Market update: గ్రే మార్కెట్లో తగ్గుతున్న పేటీఎం ప్రీమియం.. మళ్లీ సెన్సెక్స్ 314, నిఫ్టీ 100 డౌన్
బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. మదుపర్లు విక్రయాలు చేపట్టారు. గ్రే మార్కెట్లో పేటీఎం ప్రీమియం మరింత తగ్గింది. టార్‌సన్స్ ప్రొడక్ట్స్ ఐపీవో ముగిసింది.

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం భయాలు, మదుపర్లు లాభాలు స్వీకరణకు దిగడంతో సూచీలు దిగువవైపు పయనిస్తున్నాయి. స్థిరాస్తి, చమురు, గ్యాస్, ఫార్మా రంగాల్లో విక్రయాలు కొనసాగాయి. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 314, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయాయి.
క్రితం రోజు 60,322 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ బుధవారం 60,179 వద్ద మొదలైంది. 60,426 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత అమ్మకాలే కొనసాగడంతో 59,944 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకొని చివరికి 314 పాయింట్ల నష్టంతో 60,008 వద్ద ముగిసింది. ఇక మంగళవారం 17,999 వద్ద ముగిసిన నిఫ్టీ నేడు 17,939 వద్ద మొదలైంది. 17,879 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకి చివరికి 100 పాయింట్ల నష్టంతో 17,898 వద్ద ముగిసింది.
నిఫ్టీలో యూపీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐఓసీ నష్టాల బాట పట్టాయి. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఆసియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ లాభపడ్డాయి. స్థిరాస్తి, చమురు, గ్యాస్, ఫార్మా సూచీలు ఒక శాతం వరకు నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్స్ షేర్లు కొన్ని నష్టపోయాయి.
టార్‌సన్స్ ప్రొడక్ట్స్ ఐపీవోకు మంచి స్పందన లభించింది. ఆఖరి రోజు 33 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రిప్షన్ చేసుకున్నారు. గో ఫ్యాషన్ ఐపీవో మొదటి రోజే 1.56 రెట్ల స్పందన వచ్చింది. అతిపెద్ద ఐపీవోగా భావిస్తున్న పేటీఎం ప్రీమియం గ్రే మార్కెట్లో మరింత తగ్గింది. లేటెంట్ వ్యూ అనలిటిక్స్ అలాట్‌మెంట్ నేడు జరిగే అవకాశం ఉంది.
Also Read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో మరో ముందడుగు.. తాజా అప్‌డేట్ ఇదే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి





















