AMD Investments : భారత్‌లో చిప్ దిగ్గజం భారీ పెట్టుబడులు - బెంగళూరులో అతి పెద్ద డిజైన్ సెంటర్
భారత్‌లో భారీ పెట్టుబడులకు చిప్ దిగ్గజం ఏఎండీ సిద్ధమైంది. బెంగళూరులో అతి పెద్ద డిజైన్ సెంటర్ ను ప్రారంభించనున్నారు.
AMD Investments : అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ అడ్వాన్స్‌డ్ మైక్రో డివైజెస్(ఏఎండీ) భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు బెంగళూరులో అతిపెద్ద డిజైన్ సెంటర్‌ను నిర్మించేందుకు రాబోయే ఐదేళ్ల కాలంలో సుమారు రూ. 3,290 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. ఈ విషయాన్ని శుక్రవారం గుజరాత్‌లో జరిగిన సెమీకండక్టర్ కాన్ఫరెన్స్‌లో ఏఎండీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పేపర్ మాస్టర్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి నాటికి డిజైన్ సెంటర్‌ను ప్రారంభిస్తామని, ఐదేళ్లలో 3,000 మంది కొత్త ఇంజనీరింగ్ ఉద్యోగులను నియమిస్తామని, అతిపెద్ద డిజైనింగ్ సెంటర్, ఆర్ అండ్ డీ కేంద్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారులకు మెరుగైన పనితీరు, సేవలను అందించడంలో భారత టీమ్ కీలకంగా వ్యవహారిస్తారని ఆయన తెలిపారు.
దేశీయంగా అతిపెద్ద ల్యాబ్, టీమ్ వర్క్ కోసం అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. కొత్త సెంటర్ ప్రారంభమైతే దేశంలో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై సహా 10 ప్రాంతాల్లో ఏఎండీ కేంద్రాలుంటాయని మార్క్ చెబుతున్నారు. భారత్‌లో ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ, గురుగ్రాం, ముంబైల నుంచి ఏఎండీ కార్యకలాపాలు సాగుతున్నాయి. భారత్‌లో ఢిల్లీలో తొలి కార్యాలయం ప్రారంభించడం ద్వారా 2001లో ఏఎండీ కార్యకలాపాలు మొదలవగా ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 6500కు పెరిగింది. నైపుణ్యాలతో కూడిన సిబ్బంది, స్ధానిక మేనేజ్‌మెంట్ బృందం కృషితో భారత్‌లో ఏఎండీ విస్తరణకు బాటలు వేసిందని మార్క్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సెమికాన్ ఇండియా సదస్సులో గుజరాత్ సీఎం, ఉన్నతాధికారులతో పాటు మైక్రాన్ టెక్నాలజీ, అప్లైడ్ మెటీరియల్స్, ఫాక్స్‌కాన్, సెమీ, ఏఎండీ సహా పలు దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి.
'మేము CPU సర్వర్ డేటా సెంటర్, GPU గేమింగ్ గ్రాఫిక్స్, PC, అడాప్టివ్ కంప్యూటింగ్ మరియు ఎంబెడెడ్ పరికరాలలో విభిన్నమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నాము మరియు ఈ పెట్టుబడి AMD ఉత్పత్తులలో AI ప్రాసెసింగ్ సామర్థ్యాలను విస్తృతంగా తీసుకువచ్చినందున మా పోర్ట్‌ఫోలియో మరియు సామర్థ్యాలను విస్తరించడానికి అవకాశం ఉంది. హార్డ్‌వేర్ , సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలలో AI మరియు మెషీన్ లెర్నింగ్‌ను అభివృద్ధి చేయడంలో మా భారత బృందం కీలకంగా ఉంటుంది" అని పేపర్‌మాస్టర్ ఆశాబావం వ్యక్తం చేశారు. 2001లో కంపెనీ యొక్క మొదటి సైట్ న్యూఢిల్లీలో స్థాపించబడినప్పటి నుండి AMD భారతదేశంలో సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో క్రియాశీలకంగా ఉంది.
ఏఎండీ కంపెనీ తాము పెట్టాలనుకున్న పెట్టుబడుల కోసం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలను పరిశీలించాయి. హైదరాబాద్‌లోనూ తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. చివరికి బెంగళూరు వైపు సంస్థ మొగ్గు చూపింది. గతంలో హైదరాబాద్‌లో నిర్మిస్తున్న గేమింగ్ స్పెషల్ ఇమేజ్ సిటీలో ఏఎండీ భాగం అయ్యేందుకు ఆసక్తి చూపించింది. అయితే ప్రస్తుతం ప్రకటించిన పెట్టుబడులకు ఇమేజ్ సిటీలో భాగం అయ్యే ప్రణాళికలకు సంబంధం లేదని .. ఆ పెట్టుబడులు హైదరాబాద్‌కు వస్తాయని భావిస్తున్నాయి.