Union Budget 2022 Andhra : ఎప్పట్లాగే.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిరాశ !
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేవు. విభజన హమీలపై ఏపీ ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది.
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఏం లభించింది ? . నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మెత్తం చూస్తే చూస్తే ఆంధ్రప్రదేశ్ అనే ప్రస్తావన రాలేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఏ రాష్ట్రం పేరు ప్రత్యేకంగా ప్రస్తవించలేదు. నిజానికి ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఎదురుగా ఉన్నాయి. అందులోనూ ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రం ఉంది. అయినా ఆ రాష్ట్రానికి కూడా పెద్దగా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అలాంటిది ఇక ఏపీ గురించి ప్రత్యేకంగా ఎందుకు పట్టించుకుంటారు.. అలాంటి అవకాశమే లేదు.
విభజన హామీలకు సంబంధించి ఎంతో కొంత నిధులు వస్తాయని ఏపీ ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్ట్ సహా అనేక ప్రాజెక్టులకు దండిగా నిధులు అవసరం. కానీ వీటికి కేటాయింపులు ఉన్నాయో లేవో అసలు స్పష్టతలేదు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో ఎప్పుడూ భారీగా కేటాయించలేదు. రూ. వంద కోట్లే ఎక్కువ. అయితే నాబార్డు ద్వారా వంద శాతం రుణం రూపంలో కేంద్రం ఇప్పిస్తోంది. అందుకే బడ్జెట్‌లో చూపించడం లేదని తెలుస్తోంది. మరో వైపు రాజధాని సహా అనేక ప్రాజెక్టులకు నిధులు కావాలని కేంద్రాన్ని సీఎం జగన్ ప లుమార్లు కోరారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ప్రత్యేకంగా వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. కానీ నేరుగా ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం బడ్జెట్‌లో ఏపీకి కల్పించ లేదు.
కానీ కేంద్రం ప్రకటించిన వివిధ రకాల ప్రాజెక్టులు.. పనులు.. పథకాల్లో ఏపీకి ఎంత మేర వస్తాయనేది ఇప్పుడు కీలకం. కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన కింద 2022-23 ఏడాదిలో 80 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.44,000 కోట్లు కేటాయించారు. ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతోంది.ఇందులో ఎంత మేర ఏపీకి నిధులు ఇస్తారు.. రాబట్టుకోవచ్చనేది కీలకం. అలాగే ప్రభుత్వం నిర్మిస్తు్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకూ పెద్ద ఎత్తున ఖర్చవుతుంది. వాటికి కేంద్రం ఏమైనా నిధులు ఇస్తుందో లేదో స్పష్టత లేదు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం గురించి ప్రస్తావించారు. ఎంత నిధులు ఖర్చు పెడతారన్నదానిపైనా స్పష్టతలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ 40 కోట్లు, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ కి రూ. 50 కోట్ల కేటాయించారు. ఇవి నిర్వహణ ఖర్చులకూ కూడా సరిపోవని నిపుణుల అభిప్రాయం.
ఏపీకి కాస్త అనుకూలమైన అంశం ఏమైనా ఉందంటే అది రాష్ట్రాల కోసం కేంద్రం ఈ ఏడాది అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాల నిధి. దీని ద్వారా ఏపీ ఎంతో కొంత అదనపు రుణం తెచ్చుకుంటే కాస్త ఉపయోగకరం ఉటుంది. అంతకు మించి ఈ బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కేంద్ర పథకాల్లో కోటా కింద ఏపీకి నిధులు వస్తాయి. ప్రత్యేకంగా ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అనుకోవచ్చు. అయితే ఇప్పుడే కాదు విభజన తరవాత ఎప్పుడూ కేంద్రం ప్రత్యేకంగా ఏపీకి నిధులు కేటాయించ లేదు.