Budget 2024: బడ్జెట్‌లో కీలక పాయింట్లు - గత పద్దులో సవరణలు, ప్రస్తుత అంచనాలు ఇవే
2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను కేవలం 28 పేజీల్లో సమర్పించారు. బడ్జెట్ ప్రసంగాన్ని గంటలోపే, 58 నిమిషాల్లో ముగించారు.
Interim Budget 2024: మోదీ 2.0 ప్రభుత్వంలో అతి కీలక అంకం పూర్తయింది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు, తన చివరి బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సమర్పించింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను కేవలం 28 పేజీల్లో సమర్పించారు. బడ్జెట్ ప్రసంగాన్ని గంటలోపే, 58 నిమిషాల్లో ముగించారు. బడ్జెట్ సందర్భంగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ - వ్యయాల అంచనాలతో పాటు, 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సంబంధించి సవరించిన అంచనాలను కూడా వెల్లడించారు.
సవరించిన అంచనాలు 2023-24 (Revised Estimates 2023-24):
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) సవరించిన బడ్జెట్ అంచనాలను (Revised Estimate లేదా RE) ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024 మార్చి 31 వరకు), మార్కెట్ నుంచి తీసుకునే రుణాలు కాకుండా, ప్రభుత్వానికి వచ్చే మొత్తం రిసిప్ట్స్ 'సవరించిన అంచనా' రూ. 27.56 లక్షల కోట్లుగా ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇందులో.. పన్ను వసూళ్ల (ప్రత్యక్ష & పరోక్ష పన్నులు కలిపి) వాటా 23.24 లక్షల కోట్లుగా చెప్పారు. ప్రత్యక్ష పన్నుల్లో.. వ్యక్తిగత ఆదాయపు పన్ను (Individual Income Tax), కార్పొరేట్ పన్ను (Corporate Tax) ఉంటాయి. మూలధన లాభాల పన్ను (Capital gains tax), సంపద పన్ను (Wealth tax) కూడా వీటిలోనే కలిసి ఉంటాయి. పరోక్ష పన్నుల్లో.. GST, వ్యాట్ (VAT) ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకం, సేవల పన్ను వంటివి ఉంటాయి.
2023-24 ఆర్థిక సంవత్సరానికి, మొత్తం వ్యయం (Total Expenditure) విషయానికి వస్తే.. సవరించిన అంచనాను రూ. 44.90 లక్షల కోట్లుగా ఫైనాన్స్ మినిస్టర్ లెక్క చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 30.03 లక్షల కోట్లుగా అంచనా వేసిన రెవెన్యూ రిసిప్ట్స్ (Revenue Receipts), బడ్జెట్ అంచనా (Budget Estimate లేదా BE) కంటే ఎక్కువగా ఉంటాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థలో బలమైన వృద్ధి వేగాన్ని, ఎక్కువ మంది ప్రజలు పన్ను పరిధిలోకి రావడాన్ని, పన్ను విధానం అధికారికీకరణను ఇది ప్రతిబింబిస్తుందని చెప్పారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు (Fiscal Deficit) విషయానికి వస్తే.. దీని సవరించిన అంచనా GDPలో 5.8 శాతంగా ఉంటుందన్నారు. బడ్జెట్ అంచనా కంటే ఇది మెరుగుపడిందని నిర్మలమ్మ చెప్పారు.
2024-25 బడ్జెట్ అంచనాలు (Budget Estimates 2024-25):
2024-25 ఆర్థిక సంవత్సరంలో.. రుణాలు కాకుండా, మొత్తం రిసిప్ట్స్ రూ. 30.80 లక్షల కోట్లు & మొత్తం వ్యయాలు రూ. 47.66 లక్షల కోట్లుగా ఆర్థిక మంత్రి అంచనా వేశారు. మొత్తం రిసిప్ట్స్‌లో పన్ను వసూళ్లు రూ. 26.02 లక్షల కోట్లు ఉంటాయని లెక్కగట్టారు.
రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు చెప్పిన నిర్మల సీతారామన్, రూ. 1.3 లక్షల కోట్ల పద్దుతో దానిని కొనసాగిస్తామని వెల్లడించారు.
"సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మన యువతకు ఇది స్వర్ణయుగం అవుతుంది. 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలు ఇవ్వడానికి రూ. 1.3 లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటువుతుంది. ఇది దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. ఈ పథకం కింద, తక్కువ లేదా సున్నా వడ్డీ రేట్లతో రాష్ట్రాలకు రుణాలు మంజురు అవుతాయి" అని ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ చెప్పారు.
2025-26 నాటికి ద్రవ్య లోటును 4.5 శాతం కంటే దిగువకు తీసుకొస్తామని 2021-22 బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఆ మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ద్రవ్య లోటును లక్ష్యిత స్థాయికి తగ్గించేందుకు ఆర్థిక ఏకీకరణ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. 2024-25లో ద్రవ్య లోటు GDPలో 5.1 శాతంగా ఉండొచ్చని చెప్పిన ఆర్థిక మంత్రి, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే మార్గంలో వెళ్తున్నట్లు వెల్లడించారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో డేటెడ్ సెక్యూరిటీల (గవర్నమెంట్ బాండ్స్) ద్వారా సేకరించే స్థూల & నికర మార్కెట్ రుణాలను వరుసగా రూ. 14.13 లక్షల కోట్లు & రూ. 11.75 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. 2023-24 తీసుకున్న రుణాల కంటే ఈ రెండూ తక్కువే. ప్రస్తుతం, ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నందున, కేంద్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి తక్కువ రుణాలు తీసుకోవడం వల్ల, ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున రుణాలు అందుబాటులోకి వస్తాయి.
మరో ఆసక్తికర కథనం: రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ - శాఖల వారీగా కేటాయింపులు ఇలా!