Budget 2024: మధ్యంతర బడ్జెట్ వల్ల ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, వేటి రేట్లు తగ్గుతాయి?
ఏయే వస్తువులపై పన్ను పెంచారు, వేటిపై తగ్గించారు, ఏ ఉత్పత్తులకు రాయితీలు ఇచ్చారన్న విషయాలను ప్రజలు ఆసక్తిగా తెలుసుకుంటారు.
Interim Budget 2024: మోదీ 2.0 గవర్నమెంట్ తరపున, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 01 ఫిబ్రవరి 2024న పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024 ప్రకటించారు. ప్రస్తుత ప్రభుతానికి ఇదే చివరి పద్దు. రికార్డ్ స్థాయిలో ఆరోసారి బడ్జెట్ సమర్పించిన నిర్మల సీతారామన్, భారతదేశ స్థూల ఆర్థిక వృద్ధి, ఆర్థిక ఏకీకరణకు ఎక్కువ ప్రధాన్యం ఇచ్చారు.
ఫైనాన్స్ మినిస్టర్ గతంలోనే హింట్ ఇచ్చినట్లు, ఈ ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌లో ఎలాంటి ఆకర్షణలు లేవు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన పిదప, ఈ ఏడాది జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను లాంచ్ చేస్తారు.
మధ్యంతర పద్దు ప్రసంగాన్ని (Nirmala Sitharaman Budget Speech Duration) గంటలోపే, కేవలం 58 నిమిషాల్లోనే నిర్మలమ్మ ముగించారు. ఇప్పటి వరకు ఆమె చేసిన ఆరు బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అతి తక్కువ సమయం కావడం విశేషం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతూ.. సీతారామన్ ఏకంగా 162 నిమిషాల (2 గంటల 42 నిమిషాలు) పాటు మాట్లాడారు. దేశ బడ్జెట్ చరిత్రలో అదే అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం.
ధరలు పెరిగే వస్తువులు - ధరలు తగ్గే వస్తువులు:
ఏటా బడ్జెట్‌లో.. ఏయే వస్తువులపై పన్ను పెంచారు, వేటిపై తగ్గించారు, ఏ ఉత్పత్తులకు రాయితీలు ఇచ్చారన్న విషయాలను ప్రజలు ఆసక్తిగా తెలుసుకుంటారు. టాక్స్‌లు తగ్గిన & రాయితీలు దక్కించుకున్న వస్తువులు చౌకగా మారతాయి. టాక్స్‌లు పెరిగిన వస్తువులు మరింత ప్రియమవుతాయి. అయితే.. ఏ వస్తువు చౌకగా మారుతుంది, ఏది ఖరీదు అవుతుందన్న విషయాన్ని ఆర్థిక మంత్రి ఈసారి చెప్పలేదు.
ధరల్లో మార్పుల గురించి ఆర్థిక మంత్రి ప్రకటించనప్పటికీ, కొన్ని అంశాల ఆధారంగా, ధరలు పెరిగే/ తగ్గే వస్తువుల గురించి మనం అంచనా వేయవచ్చు.
2024 జనవరి 31న, మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని (import duty) 15 శాతం నుంచి 10 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దేశం నుంచి ఎగుమతులు పెంచే ఉద్దేశంలో ఉన్న మోదీ సర్కార్, భారత్‌లో మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాటరీ కవర్లు, మెయిన్ లెన్స్‌లు, బ్యాక్ కవర్లు, యాంటెన్నాలు, సిమ్ సాకెట్లు, ఇతర ప్లాస్టిక్ & మెటల్ మెకానికల్ వస్తువుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల మీద దిగుమతి సుంకాన్ని తగ్గించినట్లు, తన నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల, ఆ వస్తువుల రేట్లు తగ్గుతాయి, దేశీయంగా సెల్‌ఫోన్ల ఉత్పత్తి పరిమాణం, వేగం పెరుగుతుంది.
పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు కూడా విడిగా ఒక నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆ ప్రకటన ప్రకారం... దిల్లీలో విమాన ఇంధనం లేదా (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లేదా ATF) ధరను కిలో లీటర్‌కు రూ. 1,221 తగ్గించింది. ఇది వరుసగా నాలుగో నెలలోనూ తగ్గింది. తాజా తగ్గింపు తర్వాత... ATF రేటు దిల్లీలో కిలో లీటర్‌కు రూ. 1,00,772.17 కు; కోల్‌కతాలో రూ. 1,09,797.33 కు; ముంబైలో రూ. 94,246.00, చెన్నైలో కిలో లీటర్‌కు రూ. 1,04,840.19 కు దిగి వచ్చాయి. దీనివల్ల విమాన టిక్కెట్ల రేట్లు కాస్త తగ్గే అవకాశం ఉంది.
2023 బడ్జెట్‌లో... టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్రెస్డ్ గ్యాస్, రొయ్యల మేత, ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాలు (కృత్రిమ వజ్రాలు) వంటివి చౌకగా మారాయి. అదే సమయంలో.. సిగరెట్లు, విమాన ప్రయాణం, దుస్తులు వంటివి ఖరీదుగా మారాయి.
మరో ఆసక్తికర కథనం: మారని పేటీఎం తీరు, షేర్‌హోల్డర్లకు ఈ రోజు కూడా దబిడిదిబిడే!