Budget 2023: ఉద్యోగాల సృష్టిపై బడ్జెట్లో నిర్మల కీలక వ్యాఖ్యలు - 7 అంశాలకు ప్రాధాన్యం!
Budget 2023: ఉద్యోగ, ఉపాధి కల్పనే తమ బడ్జెట్ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. యువతకు చేయూత అందిస్తామని పేర్కొన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాల్లో గొప్ప పురోగతి సాధించామన్నారు.
Budget 2023:
ఉద్యోగ, ఉపాధి కల్పనే తమ బడ్జెట్ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. యువతకు చేయూత అందిస్తామని పేర్కొన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాల్లో గొప్ప పురోగతి సాధించామని వెల్లడించారు. స్వచ్ఛ భారత్, పీఎం సురక్షా బీమా యోజన, నగదు బదిలీ, జన్ ధన్ ఖాతాల్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించామని వివరించారు. మంగళవారం ఆమె పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
వ్యవస్థీకృతం అవుతున్న ఆర్థిక వ్యవస్థ
యువతకు ఉద్యోగాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందుకోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నామని వివరించారు. నైపుణ్యాలు, ప్రతిభాపాటవాలు మెరుగు పర్చుకొనేందుకు యువతకు చేయూతనిందిస్తోందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వ్యవస్థీకృతంగా మారుతోందని నిర్మల అన్నారు. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాలు రెట్టింపవ్వడం దీనిని ప్రతిబింబిస్తోందని తెలిపారు.
ఏడు అంశాలకు ప్రాధాన్యం
బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామని నిర్మల పేర్కొన్నారు. సమ్మిళిత అభివృద్ధి, అభివృద్ధి ఫలాలను చివరి వ్యక్తి వరకు అందించడం, మౌలిక సదుపాయాల కల్పన, మౌలిక నిర్మాణాలపై పెట్టుబడి, సామార్థ్యాన్ని వెలికి తీయడం, స్వచ్చ ఇంధనం వృద్ధి, యువతకు చేయూత, ఆర్థిక రంగానికి భోరోసా కల్పించడమే తమ లక్ష్యాలని వివరించారు. ప్రజా సంక్షేమమే కేంద్రంగా బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. విద్యార్థుల కోసం జాతీయ డిజిటల్ గ్రంథాలయం స్థాపించామని వెల్లడించారు.
పీఎం కౌశల్ వికాస్ 4.0
మూలధన పెట్టుబడిని 33 శాతం పెంచుతున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.10 లక్షల కోట్లకు పెంచామన్నారు. జీడీపీలో ఇది 3.3 శాతమని తెలిపారు. రైల్వేల కోసం రూ.2.40 లక్షల కోట్లను కేటాయించామన్నారు. 2014తో పోలిస్తే ఇది 9 రెట్లని వివరించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 పథకాన్ని ప్రవేశపెడుతోందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో యువత నైపుణ్యాలు పెంపొందించేందుకు 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ కేంద్రాలను వివిధ రాష్ట్రాల్లో స్థాపిస్తామని చెప్పారు.