Bank Locker New Rules: కొత్త సంవత్సరంలో లాకర్ రూల్స్ మారుతున్నాయి, అగ్రిమెంట్ చేసుకోకపోతే మీకే నష్టం!
కొన్ని బ్యాంకులు ఈ విషయాన్ని తమ కస్టమర్ల దృష్టికి తీసుకెళ్లాయి, కొత్త లాకర్ అగ్రిమెంట్ చేసుకోవాలని కోరుతున్నాయి.
Bank Locker New Rules: మీకు బ్యాంక్‌లో లాకర్ ఉందా?, ఉంటే.. మీ బ్యాంక్ శాఖ వద్దకు వెళ్లి కొత్త ఒప్పందం మీద సంతకం చేశారా, లేదా?. ఒకవేళ ఇంకా సంతకం చేయకపోతే, ఇంకా ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే, కొత్త సంవత్సరం ప్రారంభంలోనే లాకర్ రూల్స్ మారుతున్నాయి.
ఒక వ్యక్తికి ఏ బ్యాంక్‌లో లాకర్ ఉన్నా, అలాంటి ఖాతాదారుల మీద బ్యాంకులు తమ సొంత షరతులు లేదా నిబంధనలు విధిస్తాయి. ఆ రూల్స్ కూడా దాదాపుగా బ్యాంకులకే అనుకూలంగా ఉంటాయి, కస్టమర్ ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి. ఒక్కోసారి, లాకర్ ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, లేదంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలని బ్యాంకులు డిమాండ్ చేస్తుంటాయి. స్వప్రయోజనాల కోసం ఇలాంటి మరికొన్ని రూల్స్‌ను కూడా బలవంతంగా ఖాతాదారుల నెత్తిన రుద్దుతుంటాయి. ఇది కస్టమర్లకు ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఈ నేపథ్యంలో, ఖాతాదారుల ఇబ్బందులను తొలగించేలా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త లాకర్ రూల్స్ తీసుకొచ్చింది. కొత్త నియమాలు 2023 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ప్రయోజనాలను పొందాలంటే, ముందుగా ఖాతాదారుడు తన బ్యాంకుతో లాకర్ అగ్రిమెంట్ మీద సంతకం చేయాలి. ఇప్పటికే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సహా కొన్ని బ్యాంకులు ఈ విషయాన్ని తమ కస్టమర్ల దృష్టికి తీసుకెళ్లాయి, కొత్త లాకర్ అగ్రిమెంట్ చేసుకోవాలని కోరుతున్నాయి. డిసెంబర్ 31లోగా అగ్రిమెంట్ పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. అప్పడే కొత్త ఒప్పందం బ్యాంకు - కస్టమర్ మధ్య అమల్లోకి వస్తుంది.
కొత్త లాకర్ నియమాలు
RBI జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం... ఖాతాదారు ఆస్తికి నష్టం జరిగినా లేదా బ్యాంకు వల్ల నష్టపోయినా, గతంలోలాగా బాధ్యత నుంచి తప్పించుకోవడం ఇకపై బ్యాంక్‌కు వీలవదు. జరిగిన నష్టాన్ని ఆ బ్యాంకు ఖాతాదారుకి భర్తీ చేయాల్సి ఉంటుంది. గతంలో... కస్టమర్ల నుంచి మూడు సంవత్సరాల లాకర్ అద్దెను బ్యాంకులు ఒకేసారి వసూలు చేయవచ్చు. ఇకపై అలా అద్దె వసూలు చేయలేరు. బ్యాంకులు ఖాతాదారులకు ఖాళీ లాకర్ల జాబితా, వెయిటింగ్ లిస్ట్‌ను చూపించాలి. అలాగే లాకర్లు ఉంచే చోట సరైన భద్రత ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు ఎలాంటి అన్యాయమైన నిబంధనలను కస్టమర్ల మీద రుద్దకూడదు.
నష్ట బాధ్యత ఉండని సందర్భాలు
కొత్త నిబంధనల ప్రకారం... కొన్ని సందర్భాల్లో కస్టమర్ లాకర్ నష్ట బాధ్యతను బ్యాంకు తీసుకోదు. భూకంపం, తుపాను, కొండ చరియలు విరిగిపడటం వంటి ఆకస్మిక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లయితే బ్యాంకు బాధ్యత వహించదు. అంతేకాదు, స్వయంగా ఖాతాదారు వల్ల లాకర్ లేదా లాకర్‌లోని వస్తువులు పాడైతే బ్యాంకు ఎలాంటి బాధ్యత వహించదని కొత్త నిబంధనలలో స్పష్టంగా పేర్కొన్నారు.
2023 జనవరి 1 నుంచి లాకర్ ఖాతాదారులందరికీ అగ్రిమెంట్ జారీ అవుతుంది, దాని మీద సంతకం చేయాలి. మొత్తంగా చూస్తే, ఖాతాదారుల ప్రయోజనాలను పెంచేలా కొత్త నిబంధనలను RBI తీసుకొచ్చింది.