(Source: ECI/ABP News/ABP Majha)
Ashwini Vaishnaw on 5G Towers: 2,500 చాలవు, వారానికి 10 వేల 5G టవర్లు ఏర్పాటు చేయాల్సిందే!
2,500 నంబర్ మీద సెంట్రల్ గవర్నమెంట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ స్పీడ్ చాలదని, పనిలో వేగాన్ని నాలుగింతలు పెంచాలని టెల్కోలకు సూచించింది.
Ashwini Vaishnaw on 5G Towers: దేశంలో 5G సేవలను వేగంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కాస్త కరుకుగానే వ్యవహరిస్తోంది. టెలీ కమ్యూనికేషన్ కంపెనీలు (టెల్కోలు) వారానికి సగటున 2,500 5G బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లు (BTS) లేదా టవర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నంబర్ మీద సెంట్రల్ గవర్నమెంట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ స్పీడ్ చాలదని, పనిలో వేగాన్ని నాలుగింతలు పెంచాలని టెల్కోలకు సూచించింది. వారానికి సగటున 10 వేల 5G టవర్లకు తగ్గకుండా ఏర్పాటు చేయాల్సిందేనని కమ్యూనికేషన్స్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
BTS అంటే, మొబైల్ నెట్‌వర్క్‌లోని ఫిక్స్‌డ్ రేడియో ట్రాన్స్‌సీవర్. ఇది టవర్ రూపంలో ఉంటుంది. ప్రజల మధ్య వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ను సులభంగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది.
163 హ్యాండ్‌సెట్ మోడళ్లు
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు 8 వేల టవర్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. 5G రోల్ ఔట్‌లో వేగం కోసం మౌలిక సదుపాయాలను పెంచడానికి టెలీ కమ్యూనికేషన్ కంపెనీలకు అవసరమైన మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. 'ఓవర్ ది ఎయిర్' సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో 163 హ్యాండ్‌సెట్ మోడళ్లు (5G తరంగాలను అందుకోగల మొబైల్ ఫోన్లు) కూడా అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు.
శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్కరణలు
వైర్‌లెస్ లైసెన్సులు, శాటిలైట్ సమాచార వ్యవస్థల పైనా కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలను ప్రకటించింది.
వీటిలో శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సంబంధించిన ఐదు సంస్కరణలు ముఖ్యమైనవి. మొబైల్ "వెరీ స్మాల్ ఎపర్చర్ టెర్మినల్స్"లను (VSAT) అనుమతించింది. లైసెన్స్ ఉన్న వాహనాలకు వీటిని అమర్చుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
యాంటెన్నాల ధృవీకరణకు సంబంధించిన నిబంధనలను కూడా సడలించింది. యాంటెన్నాలకు సంబంధించి స్వీయ ధృవీకరణ (Self Certification) ఇస్తే ఇప్పుడు సరిపోతుంది. ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ తర్వాత యాంటెన్నాలను సొంతంగా అమర్చుకుని వినియోగించుకోవచ్చు. దీని ప్రకారం 5జీ యాంటెన్నాకు NACFA అనుమతులు ఇకపై అక్కర్లేదు.
స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే VSAT, శాటిలైట్ టెలిఫోన్ వంటి అన్ని సేవల కోసం ఇప్పటి వరకు వసూలు చేస్తున్న "నెట్‌వర్క్ ఆపరేషన్ అండ్ కంట్రోల్ సెంటర్" (NOCC) ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. NOCC ఛార్జీల ప్రకారం 36 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంకు ప్రతి ట్రాన్స్‌పాండర్‌పై సంవత్సరానికి రూ. 21 లక్షలను గతంలో కేంద్రం విధించింది. ఈ ప్రక్రియను సింగిల్ స్టేజ్ చేసింది. ఫలితంగా, గతంలోని ఎనిమిది నెలల సమయం ఇప్పుడు గణనీయంగా తగ్గి ఆరు వారాలకు దిగి వస్తుంది.
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ డొమైన్‌లో 3 రకాల బ్యాండ్లను కేంద్ర ప్రభుత్వం డీ లైసెన్స్ చేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ కమ్యూనికేషన్, కాంటాక్ట్‌లెస్ ఇండక్టివ్ ఛార్జింగ్ కోసం బ్యాండ్లను డీ లైసెన్స్ చేసింది. ఈ డొమైన్‌లో కార్ తాళాల వంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తయారీ దేశంలో వేగం పుంజుకుంటోంది.
రిలయన్స్ జియో, వన్‌వెబ్‌లకు శాటిలైట్ సేవల లైసెన్సులు ఉన్నాయి. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ కూడా శాటిలైట్ సేవల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది.