Apple : తెలుగు ఉద్యోగులపై ఆపిల్ ఫైర్ - మోసం చేశారంటూ 185 మందిపై వేటు
Apple : ఆపిల్ తన మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన మోసపూరిత కార్యకలాపాలపై విచారణ తర్వాత 185 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.
Apple : టెక్ దిగ్గజం ఆపిల్ 185 ఉద్యోగుల్ని తొలగించింది. దీంతో ఇండియన్ కమ్యూనిటీస్ పేరిట మోసం జరుగుతోందా.. ఆపిల్ సంస్థ నిధులు నిజంగానే పక్కదారి పెట్టాయా అన్న టాపిక్స్ ఇవి చర్చనీయాంశంగా మారాయి. అనేక కారణాలతో భారతీయులు అమెరికా బాట పట్టడం చూస్తూనే ఉంటాం. డబ్బు సంపాదించేందుకు కొందరు, ఫ్యాషన్ తో కొందరు, చదువుకోవాలని కొందరు అమెరికాకు వలస వెళుతుంటారు. ఎక్కువగా అయితే టెక్ రంగంలో ఉద్యోగాల నిమిత్తం వెళతారు. అయితే తెలుగు వారందరినీ షాక్‌కి గురిచేసే వార్త ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఐఫోన్ తయారీదారు ఆపిల్ బే ఏరియా కార్యాలయంలో పనిచేస్తోన్న అనేక మంది తెలుగు ఉద్యోగులను కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగుల తొలగింపుకు కారణమిదే
దాదాపు 185 మంది తెలుగు ఉద్యోగులను కంపెనీ విధుల నుంచి తొలగించిందని పలు వార్తా కథనాలు పబ్లిష్ అయ్యాయి. వీరిలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గ్లోబల్ టెక్ జెయింట్ కేవలం తెలుగు వారినే ఎందుకు టార్గెట్ చేసింది అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో చాలా కంపెనీలు ఖర్చును తగ్గించుకునే పనిలో భాగంగా సిబ్బందిని వదిలించుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ ఆపిల్ మాత్రం ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ పని చేసినట్టయితే కనిపించట్లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మోసపూరిత కార్యకలాపాలే కారణమా
కంపెనీలో పనిచేస్తోన్న కొందరు తెలుగు అసోసియేట్లు ఆపిల్ అందించే మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేశారని సమాచారం. ఆపిల్ లో పనిచేస్తున్న ఉద్యోగులను ఈ సంస్థలు తమకు విరాళాలు అందించాలని కోరారని... కార్పొరేట్ సామాజిక బాధ్యత ((CSR)లో భాగంగా అదే నాన్‌ప్రిఫిట్ సంస్థలకు ఉద్యోగులు చేసిన విరాళాలను ఆపిల్ సరిపోల్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జరిపిన దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు. అయితే కంపెనీలోని తెలుగు ఉద్యోగులు డబ్బు డొనేట్ చేసినట్లే చేసి వాటిని తిరిగి వెనక్కి పొందారని, కంపెనీని మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తులో ఈ అవకతవకలకు సంబంధించిన పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చినట్టు ఆపిల ఫైనాన్స్ విభాగం గుర్తించింది.
ఈ క్రమంలో ఆయా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన తెలుగు ఉద్యోగులను రాజీనామా చేయాలని, లేదంటే తామే టర్మినేట్ చేస్తామని ఆపిల్ ఆదేశించింది. దీంతో ఉన్నత స్థాయిలో ఉన్న 185 మంది తెలుగు ఎంప్లాయిస్ తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ వ్యక్తులు మూడేళ్ల కాలంలో ఆపిల్ ని సుమారు 1లక్షా 52వేల డాలర్లు మోసం చేశారని శాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది. ఈ ఘటన అమెరికాలోని కొన్ని తెలుగు సంఘాల చిత్తశుద్ధిపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఇలాంటి మోసాలకు పాల్పడితే కార్పొరేట్ కంపెనీలు క్షమించవని ఆపిల్ ను చూస్తే తెలుస్తోంది.
ఈ ఘటనపై ఆపిల్ అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, జిల్లా న్యాయవాది కార్యాలయం దీనిపై విచారణను కొనసాగిస్తోంది. తొలగించిన ఉద్యోగులలో చాలా మంది భారతీయ మూలానికి చెందినవారని, కొందరు యూఎస్ లోని తెలుగు కమ్యూనిటీ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపణలు వస్తుండగా.. ఈ వివరాలను అధికారులు ఇప్పటికైతే ధృవీకరించలేదు.
Also Read : Insurance Grace Period : బీమాలో గ్రేస్ పీరియడ్ అంటే ఏమిటి? - దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి