Air India Chairman: ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్- ఎవరో తెలుసా?
Air India Chairman: ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్‌ను నియమితులయ్యారు.
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను.. ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా నియమిస్తూ టాటా అధికారిక ప్రకటన చేసింది. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడగిస్తూ కంపెనీ బోర్డు ఇటీవల నిర్ణయం తీసుకుంది.
నటరాజ్ చంద్రశేఖరన్.. ప్రస్తుతం టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన్నే ఎయిరిండియాకు కూడా ఛైర్మన్‌గా ప్రకటిస్తూ టాటా సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏబీపీ న్యూస్‌కు టాటా సన్స్ ప్రతినిధి ముందే తెలిపారు. ఎయిర్ ఇండియా బోర్డ్ మీటింగ్‌లో ఆయన నియామకాన్ని ధ్రువీకరించారు.
టర్కీ ఎయిర్‌లైన్స్ మాజీ హెడ్ మెహ్మత్ ఐసీ.. ఎయిర్ ఇండియా సీఈఓ-ఎమ్‌డీ పదవిని నిరాకరించిన కొద్ది రోజులకే టాటా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రొఫైల్
- 2009-17 వరకు ఆయన టాటా సంస్థలో ప్రధాన నిర్వహణాధికారిగా పనిచేశారు.
- టాటా సన్స్ బోర్డులో 2016 అక్టోబర్‌లో నటరాజన్ చంద్రశేఖరన్ చేరారు.
- 2017 జనవరిలో ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.
- టాటా సన్స్ మాత్రమే కాకుండా సంస్థకు చెందిన టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లకు ఆయన బోర్డు ఛైర్మన్‌గా చేశారు.
టాటా చేతికి
గతేడాది అక్టోబర్‌లో స్పైస్‌జెట్ కన్సార్షియంతో పోటీపడి ఎయిరిండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్ (టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇటీవల ప్రకటించారు.
టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టాలేస్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఎయిరిండియాను అప్పగించినట్టు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే జనవరిలో తెలిపారు. ఈ డీల్ విలువ సుమారు రూ.18,000 కోట్లు. ఇందులో రూ.2,700 కోట్ల మేర టాలేస్ నగదు చెల్లించనుండగా, మిగతా మొత్తానికి సరిపడా ఎయిరిండియాకు ఉన్న రుణ భారాన్ని తనకు బదిలీ చేసుకోనుంది. అయితే, ఎయిరిండియా తిరిగి టాటాల చెంతకు చేరడం.. చంద్రశేఖరన్ సాధించిన విజయాల్లో ముఖ్యమైనది.
Also Read: LIC IPO Postponed: LIC ఐపీఓ వాయిదా- కేంద్రం స్పీడుకు బ్రేకులు వేసిన పుతిన్!
Also Read: EPFO Interest: ఈపీఎఫ్‌తో ఇరుక్కున్న కేంద్రం, ఎన్నికలు అవ్వగానే మొదలెట్టారని విమర్శలు