Adani Group: అమేజింగ్.. జింగ్.. జింగ్! మార్కెట్ విలువలో టాటా గ్రూప్‌ను బీట్ చేసిన అదానీ గ్రూప్
Adani Group: అదానీ గ్రూప్ అద్భుతాలు చేస్తూనే ఉంది! మార్కెట్ విలువలో దేశంలోనే అత్యంత విలువైన బిజినెస్ హౌజ్‌గా అవతరించింది. టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టేసింది.
Adani Group beats Tata Group: అదానీ గ్రూప్ అద్భుతాలు చేస్తూనే ఉంది! మార్కెట్ విలువలో దేశంలోనే అత్యంత విలువైన బిజినెస్ హౌజ్‌గా అవతరించింది. ప్రతిష్ఠాత్మక టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టేసింది. అంబుజా సిమెంట్స్, ఏసీసీ కంపెనీల్లో వాటాలు సొంతమవ్వడంతో ఇది సాధ్యమైంది.
అంబుజా, ఏసీసీని సొంతం చేసుకున్నాక శుక్రవారం అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.22.25 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక టాటా గ్రూప్ కంపెనీల విలువ రూ.20.81 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.40,000 కోట్ల మేర తగ్గింది. ఇదే సమయంలో టాటా గ్రూప్ దాదాపుగా రూ.60,000 కోట్లు తగ్గింది. ఇక ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.17.07 లక్షల కోట్ల మార్కెట్ విలువతో మూడో స్థానంలో నిలిచింది.
ఏసీసీ, అంబుజాను పక్కన పెడితే ఈ ఏడాది అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా రూ.10.16 లక్షల కోట్ల మేర పెరిగింది. స్టాక్ మార్కెట్లు బూమ్‌లో ఉండటమే ఇందుకు కారణం. ఇదే సమయంలో టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ.2.57 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. అత్యంత ముఖ్యమైన టీసీఎస్ 17 శాతం మేర పతనమవ్వడంతో ఇలా జరిగింది. కాగా స్విజర్లాండ్ కేంద్రంగా నడిచే హోల్‌సిమ్ కంపెనీ తమ వ్యాపారాలను రూ.6.4 బిలియన్ డాలర్లను అదానీకి అమ్మేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ డీల్ పూర్తైంది.
ప్రపంచ రెండో సంపన్నుడు
ఫోర్బ్స్ తాజా సమాచారం ప్రకారం గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండో అత్యధిక సంపన్నుడిగా అవతరించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ అర్నాల్ట్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టేశారు. శుక్రవారం అదానీ గ్రూప్ ఛైర్మన్ సంపద మరో రూ.40,000 కోట్లు (5 బిలియన్ డాలర్లు) పెరిగింది. దాంతో ఆయన నెట్‌వర్త్ 155.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇక మస్క్‌తో ఢీ!
ప్రస్తుతం అదానీకి పోటీగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఉన్నారు. ఆయన 273.5 బిలియన్ డాలర్ల సంపదతో అందరి కన్నా ముందున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ విల్మార్ వంటి కంపెనీల షేర్ల ర్యాలీతో ఆయన సంపద విలువ మరింత పెరిగింది. ఎల్‌వీఎంహెచ్ సీఈవో అర్నాల్ట్, అమెజాన్ స్థాపకుడు బెజోస్‌ను దాటేలా చేసింది. ప్రస్తుతం అర్నాల్ట్ 155.2 బిలియన్ డాలర్లు, బెజోస్ 149.7 బిలియన్ డాలర్ల సంపదతో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచారు.
రాకెట్లా షేర్ల ధర
ద్రవ్యోల్బణం భయాలు, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు ఆందోళనతో స్టాక్ మార్కెట్లు గురువారం పతనమయ్యాయి. అయినప్పటికీ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మాత్రం పరుగులు పెట్టాయి. గ్రూప్‌లోని ఏడుకు ఏడు కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఏకంగా 4.97 శాతం ఎగిసింది. అదానీ ట్రాన్స్‌మిషన్ 3.27, అదానీ టోటల్ గ్యాష్ 1.14, అదానీ గ్రీన్ ఎనర్జీ 2, అదానీ పోర్ట్స్ 2.1, అదానీ పవర్ 3.45, అదానీ విల్మార్ 3.03 శాతం లాభపడ్డాయి. మొత్తంగా అన్ని కంపెనీల మార్కెట్ విలువ రూ.20.11 లక్షల కోట్లకు చేరుకుంది.