Aadhaar Address Update: మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో చిరునామా మార్చుకోవచ్చు, కొత్త న్యూస్ ఇది
మీ దగ్గర ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా చిరునామాను అప్‌డేట్ చేసుకోవచ్చు.
Aadhaar Address Update: ఆధార్ వినియోగదారుల కోసం ఉడాయ్ (Unique Identification Authority of India -UIDAI) గొప్ప శుభవార్త చెప్పింది. ఇకపై, ఆధార్ కార్డ్‌లో చిరునామా మార్చుకోవడం చాలా సులభం. మీ దగ్గర ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా చిరునామాను అప్‌డేట్ చేసుకోవచ్చు.
మన దేశంలో, ఆధార్ తప్ప మరే ఇతర ధృవపత్రం లేని ప్రజలు చాలా మంది ఉన్నారు. ఆధార్‌లో నమోదు చేసిన చిరునామాను మార్చుకోవాలంటే, కొత్త అడ్రస్‌ను సూచించే మరో ధృవపత్రం వాళ్లకు అవసరం. ఇలాంటి పరిస్థితిలో,
ఆధార్‌లో చిరునామా మార్చుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఉడాయ్ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా 'హెడ్ ఆఫ్ ఫ్యామిలీ' లేదా కుటుంబ యజమాని స్వీయ ధృవీకరణతో (సెల్ఫ్ డిక్లరేషన్) ఆధార్‌లో చిరునామా సమాచారాన్ని నవీకరించవచ్చు.
కొత్త పద్ధతి దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా ఏ ఇతర ధృవీకరణ పత్రాలు లేని వాళ్లకు బాగా ఉపయోగరకంగా ఉంటుంది. సొంత డాక్యుమెంట్లు లేని వాళ్లకు 'హెడ్ ఆఫ్ ఫ్యామిలీ' ఆధారిత ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ ద్వారా ఆధార్ చిరునామాలో మార్పులు చేసుకోవచ్చు. కుటుంబ పెద్ద స్వీయ ధృవీకరణ పత్రంతో... ఆ కుటుంబంలోని పిల్లలు, భార్య/భర్త, తల్లిదండ్రుల ఆధార్‌లో నివాస సమాచారాన్ని సులభంగా మార్చుకోవచ్చు. కొత్త సదుపాయం గురించి వెల్లడిస్తూ... జనవరి 3, 2023న ఉడాయ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
18 సంవత్సరాలు వాళ్లు కుటుంబ పెద్ద
గతంలో... మీ ఆధార్ కార్డులోని నివాస సమాచారాన్ని 'కుటుంబ యజమాని' ధృవీకరణ ద్వారా అప్‌డేట్ చేయాలనుకుంటే... కుటుంబ యజమానితో మీ సంబంధాన్ని మీరు నిరూపించుకోవాల్సి వచ్చేది. దీని కోసం... రేషన్ కార్డు, మార్కుల షీట్, వివాహ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ వంటివి అవసరం. వాటిలో మీ ఇంటి పెద్ద పేరు నమోదై ఉంటుంది. ఇలాంటి పత్రాలు ఏవీ లేనివాళ్లకు చిరునామా అప్‌డేట్ కుదిరేది కాదు. ఇప్పుడు... కుటుంబ పెద్ద స్వీయ ధృవీకరణ పత్రం ఒక్కటి ఉంటే చాలు. ఆధార్‌లో చిరునామాను నవీకరించుకోవచ్చు. ఉడాయ్ నోటిఫికేషన్ ప్రకారం.. కుటుంబ పెద్ద అంటే తండ్రి, తల్లి, భర్త, భార్య మాత్రమే కాదు, మీ కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా కుటుంబ పెద్దగా స్వీయ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వవచ్చు. ఆ పత్రం ద్వారా మిగిలిన వాళ్లు ఆధార్‌లో చిరునామాను మార్చుకోవచ్చు.
'కుటుంబ పెద్ద' స్వీయ ధృవీకరణ పత్రంతో మీ ఆధార్‌ను ఇలా అప్‌డేట్ చేసుకోండి:
ముందుగా ఆధార్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/ని సందర్శించండి.
ఈ పోర్టల్‌లో, ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను ఎంచుకోండి.
ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకోండి.
చిరునామా అప్‌డేట్ కోసం 'కుటుంబ యజమాని' ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
దీని తర్వాత, కుటుంబ యజమాని స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
చిరునామాను అప్‌డేట్ చేయడానికి రూ. 50 రుసుము చెల్లించాలి.
సర్వీస్ రిక్వెస్ట్ నంబర్, కుటుంబ పెద్ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వెళ్తుంది.
ఈ సందేశం వచ్చిన 30 రోజుల లోపు కుటుంబ పెద్ద ఆధార్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి, తన ఆమోదాన్ని తెలపాలి.
కుటుంబ పెద్ద ఆమోదించిన తర్వాత మీ ఆధార్ అప్‌డేట్ అవుతుంది.
గుర్తుంచుకోండి, 30 రోజుల లోపు కుటుంబ పెద్ద ఆమోదం ఇవ్వకపోతే, మీ అభ్యర్థనను ఉడాయ్ తిరస్కరిస్తుంది.