5Paisa Capital Q3 Results: కంపెనీ కొంచం - లాభం ఘనం, ఉరుకులు పెట్టిన షేర్ ధర
సరిగ్గా ఏడాది క్రితం, 2021 డిసెంబర్ త్రైమాసికంలో ఇది ఒక కోటి కన్నా తక్కువగా, 74 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జించింది.
5Paisa Capital Shares: స్మాల్ క్యాప్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ 5Paisa Capital, 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (Q3FY23) బ్రహ్మండమైన ఫలితాలు ప్రకటించింది.
అత్యంత భారీ లాభం
2022 డిసెంబర్ త్రైమాసికంలో (Q3) కంపెనీ నికర లాభం అతి భారీగా 1389.19% పెరిగి రూ. 11.02 కోట్లకు చేరుకుంది. సరిగ్గా ఏడాది క్రితం, 2021 డిసెంబర్ త్రైమాసికంలో ఇది ఒక కోటి కన్నా తక్కువగా, 74 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జించింది.
Q3FY23లో రూ. 83.8 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ఆర్జించింది. ఇది, గత త్రైమాసికం కంటే 4% (QoQ), గత సంవత్సరం ఇదే కాలం కంటే (YoY) 4% ఎక్కువ.
2022-23 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) రూ. 248.1 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 18% ఆదాయ వృద్ధి.
ఏకీకృత స్థాయిలో, కంపెనీ మొత్తం ఆదాయం 4% YoY పెరిగితే, నిర్వహణ ఖర్చులు 13% తగ్గాయి.
డిసెంబర్ త్రైమాసికంలో కొత్తగా 1,62,400 మంది క్లయింట్‌లను 5Paisa Capital ఆన్‌బోర్డ్ చేసింది. దీంతో మొత్తం రిజిస్టర్డ్ కస్టమర్ల సంఖ్య 33,53,400కి చేరుకుంది.
ఉరుకులు పెట్టిన షేర్ ధర
Q3 ఫలితాలు ఘనంగా ఉండడంతో, ఈ షేర్ ధర ఒక్కసారిగా పెరిగింది. ఇవాళ్టి (గురువారం, 12 జనవరి 2023) నష్టాల మార్కెట్‌లో సైతం ఈ కంపెనీ షేర్ ధర 12% పైగా ర్యాలీ చేసింది.
గత ఆరు నెలల్లో ఈ స్టాక్ దాదాపు 16% పెరిగింది, గత సంవత్సర కాలంలో ఇది దాదాపు 20% పడిపోయింది.
Trendlyne డేటా ప్రకారం, 5Paisa Capital టార్గెట్ ధర రూ. 375. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 338.35 నుంచి మరో 11% అప్‌సైడ్ ర్యాలీ చేయగలదని ఈ టార్గెట్ అర్ధం. ఈ స్టాక్ మీద 'హోల్డ్' రేటింగ్ ఉంది.
సాంకేతికంగా చూస్తే... 5Paisa Capital 8 సింపుల్ మూవింగ్ యావరేజ్‌ల (SMA) కన్నా పైన ట్రేడవుతోంది.
5పైసా క్యాపిటల్, తన ఆన్‌లైన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ & మొబైల్ అప్లికేషన్స్ ద్వారా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అందించే వ్యాపారంలో ఉంది. స్టాక్ బ్రోకర్, డిపాజిటరీ పార్టిసిపెంట్, రీసెర్చ్ అనలిస్ట్‌గా SEBIలో... మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌గా AMFI వద్ద నమోదైంది.
తన క్లయింట్లు ఇంటర్నెట్ టెర్మినల్స్ & మొబైల్ అప్లికేషన్ల ద్వారా NSE, BSEలో సెక్యూరిటీల ట్రేడింగ్ చేయడానికి ఆన్‌లైన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోంది. ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఆఫర్‌లో భాగంగా డిపాజిటరీ సంబంధిత సేవలనూ అందిస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.