Rs 150 Flight Ticket: నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్ టిక్కెట్, బైక్ జర్నీ కన్నా చౌక
ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణం సమయం కేవలం 50 నిమిషాలు మాత్రమే. అలయన్స్ ఎయిర్ (Alliance Air) ఈ మార్గంలో విమానాలు నడుపుతోంది.
Rs 150 Flight Ticket: విమానంలో ప్రయాణించడం అనేది ఇప్పటికీ కోట్లాది మంది భారతీయులు కంటున్న కల. విమానంలో ఎక్కడం అటుంచితే, కనీసం విమానాశ్రయాన్ని కళ్లారా చూడని వాళ్లు కూడా కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఖరీదైన ఛార్జీల కారణంగా విమాన ప్రయాణాలను ఎక్కువ మంది ప్రజలు ఎంచుకోవడం లేదు. గగన ప్రయాణ ధరలు చౌకగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ... పండుగలు, వారాంతాలు, సెలవుల వంటి సందర్భాల్లో విమానయాన సంస్థలు ఛార్జీలను విపరీతంగా పెంచుతున్నాయి.
అయితే... ఒక రూట్‌లో, బైక్ ప్రయాణం కంటే తక్కువ రేటుకే విమానంలో వెళ్లొచ్చు. మీరు నమ్మకపోయినా ఇది నిజం. కేవలం రూ.150 బేస్ ఫేర్‌తో (Flight Ticket Base Fare) ఎయిర్ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు, విమానం ఎక్కాలనే కలను నిజం చేసుకోవచ్చు. ఈ రూట్.. లీలాబరి నుంచి అసోంలోని తేజ్‌పూర్ వరకు ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణం సమయం కేవలం 50 నిమిషాలు మాత్రమే. అలయన్స్ ఎయిర్ (Alliance Air) ఈ మార్గంలో విమానాలు నడుపుతోంది.
22 రూట్లలో ధర రూ.1000 కంటే తక్కువ ధరలు
లీలాబరి నుంచి తేజ్‌పూర్ తరహాలోనే, మన దేశంలో అనేక రూట్‌లు ఉన్నాయి. ఈ మార్గాల్లో ప్రాథమిక రుసుము (బేస్ ఫేర్) రూ. 1,000 కంటే తక్కువ. ఈ మార్గాలన్నీ రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ పథకం (Regional Connectivity Scheme) కింద నడుస్తాయి. ఈ స్కీమ్ కింద సర్వీసులు అందించే విమానయాన సంస్థకు అనేక రకాల ప్రోత్సాహకాలు దక్కుతాయి.
ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో (Ixigo) ప్రకారం, దేశంలో కనీసం 22 ఎయిర్ రూట్లలో చాలా చౌకగా ప్రయాణించొచ్చు. ఈ మార్గాలన్నింట్లో ప్రాథమిక విమాన ఛార్జీ ఒక్కొక్కరికి రూ. 1,000 కంటే తక్కువ. టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో, ప్రాథమిక ఛార్జీకి కన్వీనియన్స్ ఫీజు కూడా యాడ్ అవుతుంది.
రూ. 150 నుంచి రూ. 199
రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ (RCS) కింద చాలా రూట్లలో ఒక్కో వ్యక్తికి విమాన ప్రయాణ టిక్కెట్ రూ. 150 నుంచి రూ. 199 వరకు ఉంటుంది. వీటిలో ఎక్కువ రూట్లు ఈశాన్య ప్రాంతంలో ఉన్నాయి. దక్షిణాదిలో.. బెంగళూరు-సేలం, కొచి-సేలం వంటి మార్గాలు కూడా RCS కింద ఉన్నాయి. గువాహతి-షిల్లాంగ్ మధ్య ఎయిర్ బేస్ ఫేర్ రూ. 400. ఇంఫాల్-ఐజ్వాల్, దిమాపూర్-షిల్లాంగ్, షిల్లాంగ్-లీలాబరి విమాన సర్వీసుల్లో ప్రాథమిక ఛార్జీ రూ. 500. బెంగళూరు-సేలం విమానాల్లో ఈ ధర రూ. 525. గువాహతి-పాసిఘాట్ విమాన ప్రయాణానికి ఇది రూ. 999 కాగా, లీలాబరి-గౌహతి మార్గంలో రూ. 954 గా ఉంది.
ఉడాన్ (UDAN) పథకం కింద మద్దతు
అతి తక్కువ ఛార్జీ వసూలు చేసే విమాన సర్వీసులన్నీ డిమాండ్ తక్కువగా ఉన్న మార్గాల్లో ఉన్నాయి. ఇతర రవాణా మార్గాల ద్వారా ఈ ప్రదేశాలకు చేరుకోవడానికి 5 గంటలకు పైగా సమయం పడుతుంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) డేటా ప్రకారం... RCS UDAN (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) కింద, ఈ ఏడాది మార్చి 31 వరకు 559 రూట్‌లను గుర్తించారు. ఈ రూట్లలో సర్వీసులు అందించే విమాన సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, విమానాశ్రయాలు ఒక్క రూపాయి కూడా 'ల్యాండింగ్' లేదా 'పార్కింగ్' ఛార్జీలు వసూలు చేయరు. ఈ పథకం 2016 అక్టోబర్ 21 నుంచి ప్రారంభమైంది.
మరో ఆసక్తికర కథనం: కొత్త బిజినెస్‌లోకి జియో ఫిన్, ఇండస్ట్రీని షేక్ చేస్తుందట!