Terence MacSwiney: టెరెన్సీ మాక్‌స్వినీ.. నిరాహార దీక్షకు బ్రాండ్ అంబాసిడర్.. నెహ్రూ మెచ్చిన హీరో!
టెరెన్స్ మాక్‌స్వినీ.. ప్రస్తుతం ఈ పేరు భారత్‌లో ఎవరికీ తెలియదు. కానీ ఒకానొక సమయంలో ఈ పేరు దేశంలో మార్మోగింది. హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీలో కీలక సభ్యుడు, భగత్ సింగ్ సమకాలీకుడైన బంగాల్ ఉద్యమకారి జతిన్ దాస్.. 1929లో ఆమరణ నిరాహార దీక్ష చేసి వీరమరణం పొందారు. ఆ సమయంలో టెరెన్స్ మాక్‌స్వినీ పేరు భారత్‌లో వినిపించింది. ఎందుకంటే జతిన్ దాస్‌ను ఇండియన్ టెరెన్స్ మాక్‌స్వినీగా పిలిచేవారు.
ఎవరీ టెరెన్స్?
టెరెన్స్ మాక్‌స్వినీ.. 1920 అక్టోబర్ 25న మరణించారు. ఐరిష్ నాటక రచయితగా, ఉద్యమకారుడిగా, రాజకీయవేత్తగా ఆయనకు చాలా మంచి పేరు ఉంది. ఐర్లాండ్ స్వాతంత్య్ర పోరాట సమయంలో కార్క్ సిన్ ఫెయిన్ లార్డ్ మేయర్‌గా టెరెన్స్ ఎన్నికయ్యారు.
భారత నాయకులు ఐర్లాండ్‌లోని సంఘటనలను నిశితంగా పరిశీలించేవారు. బ్రిటీష్ పాలనలో భారతదేశాన్ని దోచుకోవడంలో ఐరిష్ వ్యక్తుల పాత్ర కూడా పెద్దదే. అయితే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఐర్లాండ్ వాసులు కూడా పెద్ద పోరాటమే చేశారు. ఐరిష్ వాసులను ఎన్నో అవమానాలకు గురిచేశారు.
ఉద్యమాన్ని అణిచేందుకు..
భారత్‌లో ఉవ్వెత్తున్న ఎగసిపడుతోన్న ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తులకు బ్రిటిషర్లు పిలుపునిచ్చారు. జలియన్‌వాలాబాగ్ మారణకాండకు కారకుడైన రెజినాల్డ్ డయ్యర్‌ను ఈ సమయంలో గుర్తుంచుకోవాలి. అతను ముర్రీలో జన్మించినప్పటికీ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) కౌంటీ కార్క్‌లోని మిడిల్‌టన్ కాలేజీ, ఆ తర్వాత ఐర్లాండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌లో చదువుకున్నాడు. ఆ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్-గవర్నర్‌గా ఉన్న మైఖేల్ ఓడ్వైర్.. డయ్యర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. జలియన్‌వాలాబాగ్ ఘటనను 'సైనిక అవసరం'గా పేర్కొన్నారు మైఖేల్.
ఎన్నో పోరాటాలు..
ఐర్లాండ్‌లో ఎన్నో దారుణాలు చేసినప్పటికీ అక్కడి చేయని పనులు కూడా భారత్‌లో చేసింది ఇంగ్లాండ్. భారత్‌ను పేదరికంలోకి నెట్టారు. 1879లో జన్మించిన మాక్‌స్వినీ 30 ఏళ్లకు దగ్గర పడుతోన్న సమయంలో రాజకీయం వైపు ఆకర్షితుడయ్యారు. 1913-14 నాటికి ఆయన ఐరిష్ వాలంటీర్స్‌లో ప్రముఖుడిగా మారారు. ఐర్లాండ్ ప్రజల హక్కులు, స్వేచ్ఛను కాపాడేందుకు ఐరిష్ వాలంటీర్స్ సంస్థ పనిచేసేది. సిన్ ఫెయిన్ అనే రాజకీయ పార్టీ కూడా ఐరిష్ స్వాతంత్య్రం కోసం కృషి చేసింది.
1916 ఏప్రిల్‌లో జరిగిన ఈస్టర్ తిరుగుబాటు సమయంలో మాక్‌స్వినీ చురుగ్గా ఉన్నారు. ఇది బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా మొదలైన సాయుధ తిరుగుబాటు. అయితే బలమైన సైనిక శక్తితో ఆరు రోజుల్లోనే ఈ తిరుగుబాటును అణిచివేశారు బ్రిటీషర్లు. ఇది జరిగిన తర్వాత నాలుగేళ్ల పాటు మాక్‌స్వినీ బ్రిటీష్ జైల్లో ఉన్నారు. ఆయన్ను రాజకీయ ఖైదీగా నిర్బంధించారు.
నిరాహార దీక్ష..
1920 ఆగస్టులో మాక్‌స్వినీ చేపట్టిన నిరాహారదీక్ష మాత్రం ఆయన్ను భారత్ సహా ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది. అయితే దేశద్రోహ ఆరోపణలపై బ్రిటీషర్లు మాక్‌స్వినీని ఆగస్టు 12న అరెస్టు చేశారు. మాక్‌స్వినీకి కోర్టు రెండు ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంగ్లాండ్‌లోని బ్రిక్స్‌టన్ జైలులో మాక్‌స్వినీ ఉన్నారు. అయితే ట్రిబ్యునల్ ముందు మాక్‌స్వినీ చేసిన వాదన ఆయన్ను చరిత్రలో నిలబెట్టింది.
ఇలా చెప్పిన వెంటనే మాక్‌స్వినీ నిరాహార దీక్ష ప్రారంభించారు. విచారణ జరిపిన సైనిక న్యాయస్థానం మాక్‌స్వినీకి శిక్ష విధించేందుకు తమకు అధికారం లేదని తేల్చిచెప్పింది. మాక్‌స్వినీకి మద్దతుగా మరో పదకొండు మంది రిపబ్లికన్ ఖైదీలు ఆయనతో చేరారు. ఆ కొద్దిరోజులకే మాక్‌స్వినీకి ఐరిష్ జనాభా పెద్ద ఎత్తున మద్దతు తెలిపింది. మాడ్రిడ్ నుంచి రోమ్ వరకు, బ్యూనస్ ఎయిర్స్ నుంచి న్యూయార్క్, దక్షిణ ఆస్ట్రేలియా వరకు.. మాక్‌స్వినీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రజలు. కార్మికవర్గం మాత్రమే కాకుండా ముస్సోలినీ, నల్లజాతి జాతీయవాదిగా పేరున్న మార్కస్ గార్వే లాంటి ప్రముఖులు కూడా మాక్‌స్వినీని విడుదల చేయాలని గళం వినిపించారు.
వీరమరణం..
రోజులు గడుస్తోన్న కొద్ది మాక్‌స్వినీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన మద్దతుదారులు.. నిరహార దీక్షను విరమించుకోవాలని మాక్‌స్వినీని వేడుకున్నారు. అదే సమయంలో ఆయనకు బలవంతంగా ఆహారం ఇవ్వడానికి బ్రిటీషర్లు ప్రయత్నించారు. కానీ అక్టోబర్ 20న మాక్‌స్వినీ కోమాలోకి వెళ్లిపోయారు. 74 రోజులు నిరాహార దీక్ష చేసి అక్టోబరు 25న మాక్‌స్వినీ చనిపోయారు.
భారత్‌లో..
భారతదేశాన్ని కూడా మాక్‌స్వినీ మరణం కుదిపేసింది. మహాత్మా గాంధీని కూడా మాక్‌స్వినీ విపరీతంగా ప్రభావితం చేశారని చాలా మంది భావించారు. కానీ స్వాతంత్య్రం సాధించడంలో నిస్సందేహంగా గాంధీజీ చూపిన సంకల్పం, దేశభక్తి, ఓర్పు చాలా గొప్పవి. ఏదిఏమైనా మాక్‌స్వినీ ఎందరో సాయుధ విప్లవకారులకు, జవహర్‌లాల్ నెహ్రూ వంటి వారికో ఓ హీరో.
నెహ్రూ లేఖ..
మాక్‌స్వినీ మరణించిన కొన్నాళ్ల తర్వాత తన కుమార్తె ఇందిరా గాంధీకి రాసిన ఓ లేఖలో మాక్‌స్వినీ గురించి జవహర్‌లాల్ నెహ్రూ ప్రస్తావించారు. ఐరిష్‌కు చెందిన మాక్‌స్వినీ చేసిన నిరాహారదీక్ష ఐర్లాండ్‌ను ఉద్యమబాట పట్టించిందని వాస్తవానికి ప్రపంచాన్నే భావోద్వేగ పూరితం చేసిందని నెహ్రూ పేర్కొన్నారు.
లాహోర్ కుట్ర కేసులో చిక్కుకున్న భగత్ సింగ్, భటుకేశ్వర్ దత్ లాంటి వీరులపై గాంధీ కంటే మాక్‌స్వినీ ప్రభావమే ఎక్కువ ఉంది. రాజకీయ ఖైదీలుగా తమను గుర్తించాలని 1929 మధ్యలో వారు చేసిన నిరాహారదీక్ష అనన్య సామాన్యం. బంగాల్ ఉద్యమ కార్యకర్త అయిన జతీంద్రనాథ్ దాస్‌తో కలిసి జైలులో వారు ఆ నిరాహార దీక్ష చేశారు. జైలులోని దయనీయమైన పరిస్థితులకు వ్యతిరేకంగా ఆ నిరాహార దీక్ష సాగింది. రాజకీయ ఖైదీల హక్కుల రక్షణ కోసం సాగింది.
జతిన్ 63 రోజుల నిరాహార దీక్ష తర్వాత 1929 సెప్టెంబర్ 13న మరణించారు. నెహ్రూ తన ఆత్మకథలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
"జతిన్ దాస్ మరణం దేశమంతటా సంచలనం సృష్టించింది. దేశం దుఃఖించింది" అని పేర్కొన్నారు.
గాంధీ కంటే..
నిరాహారదీక్ష పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చే పేరు గాంధీ. కానీ గాంధీ కంటే ముందే నిరాహార దీక్ష చేసి టెరెన్స్ మాక్‌స్వినీ చరిత్ర సృష్టించారు. నిరసన తెలియజేయడంలో నిరాహారదీక్షకు ఉన్న శక్తి, విలువ ఏంటో ఒక దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచానికే పరిచయం చేసిం మాక్‌స్వినీ మరణం. ఆయన చేసిన త్యాగం ప్రపంచాన్నే ప్రభావితం చేసింది. తన ప్రజల రక్షణ కోసం ఆయన చూపిన తెగువ ఎంతో మందిని ప్రభావితం చేసింది.
భారతదేశాన్ని దోచుకునే ముందు ఐర్లాండ్‌ను అభివృద్ధి కాకుండా ఇంగ్లాండ్ చేసింది. క్రూరత్వాన్ని అనుభవించినవారు కూడా ఇతరులతో క్రూరంగానే నడుచుకుంటారనే దానికి భారత్‌లో ఐర్లాండ్ చేసిన దాష్టీకమే నిదర్శనం. అయితే భారతదేశ వలసరాజ్యంలో ఐరిష్‌ల ఖచ్చితమైన పాత్రకు మరింత అధ్యయనం అవసరం.
మరోవైపు భారత్‌పై టెరెన్స్ మాక్‌స్వినీ ప్రభావంపై ఇటీవలి కాలంలో చాలామంది అధ్యయనం చేస్తున్నారు. ఐరిష్ మహిళ అన్నీ బీసెంట్ సహా పలువురి ప్రభావం భారత్‌పై కచ్చితంగా ఉంది. కానీ మాక్‌స్వినీ మాత్రం.. ప్రపంచంపై చాలా ప్రభావం చూపిన వ్యక్తుల్లో ఒకరు.
- వినయ్ లాల్, రచయిత, బ్లాగర్, కల్చరల్ క్రిటిక్, ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ (యూసీఎల్ఏ)
[నోట్: ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు వారి వ్యక్తిగతమైనవి. ABP News Network Pvt Ltd అభిప్రాయాలు, నమ్మకాలను ఇవి ఏ మాత్రం ప్రతిబింబించవు.]