Volvo XC90 Car Cheaper: ఫెస్టివల్ సీజన్ కు ముందే పండుగ లాంటి ఆఫర్, వోల్వో కార్లపై రూ. 7 లక్షలకు పైగా డిస్కౌంట్
వోల్వో కార్ ఇండియా పండుగ సీజన్ ముందు భారీ ఆఫర్ ప్రకటించింది. ICE కార్ల ధరలు 7 లక్షల వరకు తగ్గించింది. కొత్త ధరలు, ఆఫర్ల వివరాలు చూడండి.

Discount on Volvo XC90 car Cost | పండుగ సీజన్ ప్రారంభానికి ముందే వోల్వో కార్ భారత్‌లోని కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కంపెనీ తన ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) కార్ల ధరలను ఏకంగా 7 లక్షల రూపాయల వరకు తగ్గించింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవల జీఎస్టీ స్లాబులు 5 శాతం, 18 శాతం ఉంటాయని, పొగాకు, మద్యం ఉత్పత్తులతో పాటు అత్యంత లగ్జరీ వస్తువులపై 40 శాతం జీఎస్టీ విధించినట్లు ప్రకటించారు. ఈ మార్పులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. దీంతో పాటు వోల్వో కంపెనీ ప్రత్యేకమైన డబుల్ ఫెస్టివ్ డెలైట్ ఆఫర్లను కూడా ప్రకటించింది. దీనివల్ల కస్టమర్లకు రెట్టింపు ప్రయోజనం లభించనుంది. దీని గురించి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
వోల్వో కార్లు ఎందుకు చౌకగా మారుతున్నాయి
వాస్తవానికి ఇటీవల GST కౌన్సిల్ వాహనాల పన్ను నిర్మాణంలో మార్పులు చేసింది. దేశంలోని పాత జీఎస్టీ పన్ను శ్లాబ్‌లను తొలగించి, ఇప్పుడు ఒక సాధారణ పన్ను రేటును అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో వోల్వో తన కస్టమర్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చనుంది. ఎలక్ట్రిక్ కార్లపై (BEVs) ఎటువంటి పన్ను తగ్గింపు ఇవ్వలేదు. అయితే వోల్వో వాటిపై కూడా ప్రత్యేక ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించింది. దీనివల్ల EV కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వోల్వో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారని సంస్థ భావిస్తోంది.
GST కొత్త స్లాబ్స్ తర్వాత వోల్వో కార్ల కొత్త ధర
జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి కొన్ని రకాల కార్లపై తగ్గించారు. ఆ నిర్ణయం వోల్వో XC60 కారు, XC90 లపై ఎక్కువగా ప్రభావం చూపింది. ఇంతకు ముందు ఈ లగ్జరీ SUV లు అధిక ధరల కారణంగా చాలా మందికి ధరలు అందుబాటులో లేవు. ఇప్పుడు తగ్గింపు ధరలతో ఇవి మరింతగా కస్టమర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. కంపెనీ కొత్త ధరల జాబితా ప్రకారం, ఈ వోల్వో కారు మోడళ్లపై దాదాపు 7 లక్షల వరకు ఆదా అవుతుంది.
వోల్వో కీలక ప్రకటన
వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా మాట్లాడుతూ.. లగ్జరీ మొబిలిటీని ప్రజల్లోకి మరింత అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. GST తగ్గింపుతో మేం ప్రవేశపెట్టిన డబుల్ ఫెస్టివ్ డెలైట్ ఆఫర్లు కస్టమర్లకు డబులు ప్రయోజనం పొందుతారు. ఈ పండుగ సీజన్‌లో సంస్థ అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నా. ఎక్కువ మంది కస్టమర్‌లు వోల్వో కార్లు కొనుగోలు చేసి డబ్బు ఎక్కువ ఆదా చేసుకుంటారని నమ్ముతున్నామని అన్నారు.
పరిశ్రమపై ప్రభావం, కస్టమర్లకు మంచి అవకాశం
వోల్వో కంపెనీ తీసుకున్న నిర్ణయం భారతీయ లగ్జరీ కార్ మార్కెట్‌లో అమ్మకాల్లో వేగాన్ని పెంచే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి లగ్జరీ SUV కొనాలని కలలు కంటున్న కస్టమర్‌లు తమ కలను సాకారం చేసుకునేందుకు అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా వోల్వో XC60, XC90 ఇప్పుడు గతం కంటే తక్కువ ధరకు లభిస్తాయి. సెప్టెంబర్ 22నుంచి భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త జోష్ కనిపిస్తుందని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.






















