Two Wheeler Sales: సెప్టెంబర్‌లో టూవీలర్ సేల్స్ రికార్డ్ - ఒక్క నెలలో 2 మిలియన్లకు పైగా బైక్‌లు, స్కూటర్లు అమ్మకం
భారతదేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు సెప్టెంబర్ 2025 లో కొత్త రికార్డును చేరాయి. GST రేట్లు తగ్గడం & పండుగ సీజన్ కారణంగా ఆ నెలలో 2 మిలియన్లకు పైగా బైక్‌లు & స్కూటర్లు అమ్ముడయ్యాయి.

Two Wheeler Sales Record September 2025: భారత ద్విచక్ర వాహన మార్కెట్ సెప్టెంబర్ 2025లో కొత్త రికార్డును సృష్టించింది. ఆ నెలలో దేశవ్యాప్తంగా 2 మిలియన్లకు (20 లక్షలకు) పైగా బైక్‌లు & స్కూటర్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే నెల (సెప్టెంబర్ 2024)తో పోలిస్తే ఇది 9 శాతం పెరుగుదల. ఈ వృద్ధికి రెండు ప్రధాన అంశాలు దోహదపడ్డాయి, అవి - కేంద్ర ప్రభుత్వం GST రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం & పండుగ సీజన్‌లో కొనుగోళ్లు పెరగడం. తగ్గిన GST అమల్లోకి రావడం & పండుగ ఆఫర్లు ప్రారంభం కాగానే, తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న టూవీలర్ డీలర్‌షిప్‌లు కిటకిటలాడాయి. కస్టమర్ ట్రాఫిక్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా, కమ్యూటర్ బైక్ విభాగంలో డిమాండ్ రెట్టింపు అయింది, కస్టమర్లు ఇప్పుడు మునుపటి కంటే తక్కువ ధరకు తమకు కావలసిన బైక్ లేదా స్కూటర్‌ను కొనుగోలు చేయగలిగారు.
కొత్త రికార్డు సృష్టించిన Royal Enfield
2025 సెప్టెంబర్ నెల రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చారిత్రాత్మకమైనదిగా నిలుస్తుంది. దీని అమ్మకాలు 43 శాతం పెరిగి 1,13,000 యూనిట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు, కంపెనీ చరిద్రలోనే ఇవి అత్యధిక నెలవారీ అమ్మకాలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకే నెలలో 1,00,000 యూనిట్లకు పైగా అమ్మకాలు జరపడం ఇదే మొదటిసారి అని కంపెనీ CEO బి. గోవిందరాజన్ చెప్పారు. క్లాసిక్, బుల్లెట్ & హంటర్ వంటి ప్రసిద్ధ మోడళ్లు ఈ వృద్ధికి గణనీయంగా దోహదపడ్డాయి.
TVS Motor EV & స్కూటర్లకు పెరిగిన ఆదరణ
సెప్టెంబర్‌లో, టీవీఎస్ మోటార్ కూడా మంచి పనితీరును కనబరిచింది. ఈ కంపెనీ అమ్మకాలు 12 శాతం పెరిగి 4,13,000 యూనిట్లకు చేరుకున్నాయి. జూపిటర్ స్కూటర్ & ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ వృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించాయి. అదనంగా, కంపెనీ ఎగుమతులు & ఎలక్ట్రిక్ వాహన విభాగం టీవీఎస్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది.
స్థిరమైన వేగంతో దూసుకుపోతున్న Bajaj Auto
బజాజ్ ఆటో, సెప్టెంబర్‌లో 2,73,000 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం కంటే 5 శాతం ఎక్కువ. బజాజ్ బలమైన ఉనికి ఇప్పుడు మన మార్కెట్‌లోనే కాకుండా ఆఫ్రికా & లాటిన్ అమెరికా వంటి ప్రపంచ మార్కెట్లలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కంపెనీ వ్యూహం పని చేస్తోందని దాని అమ్మకాల వృద్ధి నిరూపిస్తోంది.
స్వల్ప ఆధిక్యంలో Honda Two-Wheelers
హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI), సెప్టెంబర్‌లో 5,05,000 యూనిట్లను విక్రయించింది, ఇది గత సంవత్సరం కంటే 3 శాతం ఎక్కువ. స్కూటర్ మార్కెట్, ఈ కంపెనీకి బలమైన విభాగంగా నిలిచింది. ఈ విభాగంలో హోండా యాక్టివా కోట్లాది కస్టమర్లకు ఇష్టంగా మారింది.
అయితే, ఈసారి పండుగల సమయంలో, టూవీలర్ కంపెనీలు గతంలో లాగా ఆఫర్లు, డిస్కౌంట్లను అందించలేదు. సాధారణంగా, ఈ ఫెస్టివ్ సీజన్‌లో కస్టమర్లు ₹5,000 నుంచి ₹10,000 వరకు డిస్కౌంట్లను పొందుతారు. కానీ, ఈసారి GST తగ్గింపు మినహా కంపెనీలు ప్రత్యేకంగా ప్రకటించిన గొప్ప ఆఫర్లు ఏవీ లేవు. ఇంకా, భారీ రుతుపవనాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు కొంచెం నెమ్మదిగా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే, సెప్టెంబర్ 2025 నెల భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమకు చారిత్రాత్మక నెలగా మిగిలిపోతుంది. GST రేట్ల తగ్గింపు, పండుగ సీజన్ & పెరిగిన కస్టమర్ ఆసక్తి అమ్మకాలను కొత్త శిఖరాలకు చేర్చాయి.





















