నియో-రెట్రో లుక్‌తో వచ్చిన TVS Ronin - ప్లస్‌లూ ఉన్నాయ్, మైనస్‌లూ ఉన్నాయ్, అన్నీ తెలిశాకే కొనండి
225cc శక్తిమంతమైన ఇంజిన్, స్మూత్ రైడ్, అద్భుతమైన ఫీచర్లతో TVS Ronin యువ రైడర్స్‌కి కొత్త ఫేవరెట్. కానీ కొన్ని లోపాలూ ఉన్నాయి, వాటి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

TVS Ronin Review October 2025: మూడేళ్ల క్రితం భారత మార్కెట్‌లో అడుగుపెట్టిన TVS Ronin, అప్పటి నుంచి క్రూయిజర్ కేటగిరీలో ఓ కొత్త స్టైల్‌ను సృష్టించింది. ఈ బైక్ నియో-రెట్రో లుక్, కేఫ్ రేసర్, స్క్రాంబ్లర్ టచ్‌లతో కలిపి డిజైన్ అయింది, ఏ కేటగిరీలోనూ పూర్తిగా ఒదిగిపోదు. అందుకే ఇది సాధారణ బైక్‌లాగా కనిపించదు. అయితే, స్టైల్‌లో, రైడ్ కంఫర్ట్‌లో, ఫీచర్లలో కొత్త అనుభూతి ఇస్తుంది.
ఇంజిన్ & పనితీరు
TVS Ronin లో 225.9cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.4hp పవర్ & 19.9Nm టార్క్‌ను ఇస్తుంది. మామూలుగా చూస్తే ఇవి పెద్ద సంఖ్యలు కాకపోయినా, ఈ ఇంజిన్‌ను టీవీఎస్ చాలా బాగా ట్యూన్ చేసింది. తక్కువ స్పీడులోనూ మోటార్ స్మూత్‌గా నడుస్తుంది. 3,000rpm దగ్గర నుంచే పవర్ రెస్పాన్స్ మొదలవుతుంది కాబట్టి సిటీ రైడింగ్‌లో చాలా ఈజీగా ఉంటుంది.
స్మాల్ గేర్ రేషియో ఉండటంతో, బైక్ తక్కువ స్పీడులోనే హయ్యర్ గేర్‌లో సాఫ్ట్‌గా కదులుతుంది. ఉదాహరణకు, 15kmph స్పీడ్‌లోనూ మూడో గేర్‌లో నడిపినా ఇంజిన్ కంఫర్ట్‌గా రెస్పాండ్ అవుతుంది.
రైడింగ్ కంఫర్ట్ & హ్యాండ్లింగ్
TVS Ronin లో 41mm షోవా USD ఫోర్క్‌లు ఉన్నాయి, ఇవి Apache RR 310 నుంచి తీసుకున్నవి. టీవీఎస్ వీటిని కాస్త సాఫ్ట్‌గా సెటప్ చేసి, నగర రోడ్లపై బైక్‌ను కంఫర్ట్‌గా నడిచేలా మార్చింది. 795mm సీటు ఎత్తు, 160kg బరువుతో ఈ బైక్‌ను కొత్త రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. స్టెయిట్ లైన్‌లో స్టెబిలిటీ బాగా ఉంటుంది, అదే సమయంలో మలుపుల్లోనూ కంట్రోల్ కోల్పోదు.
ఫీచర్లు & టెక్నాలజీ
LED లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైలెంట్ స్టార్టర్, స్లిప్పర్ క్లచ్, Glide Through Technology (GTT), బ్లూటూత్ కనెక్టివిటీ - ఇవన్నీ Ronin కి ప్రీమియం లుక్ ఇస్తాయి. క్లస్టర్‌లో స్మార్ట్‌ఎక్స్ కనెక్ట్ యాప్ ద్వారా కాల్ అలర్ట్స్, రైడ్ ట్రాకింగ్ కూడా చూడవచ్చు.
ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది - బేస్, మిడ్, టాప్. టాప్ మోడల్‌లో డ్యూయల్ చానల్ ABSతో పాటు ‘రెయిన్ & అర్బన్’ మోడ్స్ ఉంటాయి. GST రేటు తగ్గడంతో Ronin ఇప్పుడు మరింత అందుబాటులోకి వచ్చింది. ఎక్స్-షోరూమ్ ధర ₹1.25 లక్షల నుంచి ₹1.59 లక్షల వరకు ఉంది.
బైక్ కొనే ముందు తెలుసుకోవాల్సిన ప్లస్‌లు, మైనస్‌లు
డిజైన్ విషయంలో కొంతమందికి ఇది మిక్స్‌డ్ ఫీల్ ఇవ్వవచ్చు. కేఫ్ రేసర్ స్టైల్, స్క్రాంబ్లర్ టచ్, క్రూయిజర్ రైడ్ మిక్స్ కావడంతో కొందరికి లుక్ పూర్తిగా నచ్చకపోవచ్చు. హైవేపై టాప్ ఎండ్ పనితీరు పెద్దగా రుచించదు. 85–100kmph వరకు సాఫ్ట్‌గా నడుస్తుంది కానీ అంతకంటే ఎక్కువ స్పీడ్‌లో పవర్ తగ్గిపోతుంది. లాంగ్ హైవే ట్రిప్స్ ఎక్కువగా చేసే వాళ్లకు ఇది కొంచెం తక్కువగా అనిపించవచ్చు.
మొత్తం చూస్తే, TVS Ronin సిటీలో రైడ్ చేయడానికి, స్టైల్‌గా ఉండడానికి, కంఫర్ట్‌గా ప్రయాణించడానికి సరైన బైక్. హైవే పవర్ కాస్త తక్కువైనా, ఫీచర్లు, డిజైన్, రైడ్ క్వాలిటీ - ఈ మూడింటితో ఇది యువతకు ఆకట్టుకునే చాయిస్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - ABP దేశం ఆటో సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















