TVS Motors: కార్గిల్ హీరోలకు గుర్తుగా బైక్ లాంచ్ చేసిన టీవీఎస్, ఆకట్టుకుంటున్న డిజైన్
TVS Ronin: కార్గిల్ దివాస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని TVS మోటార్ కంపెనీ 'రోనిన్ పరాక్రమ్' బైక్‌ని ఆవిష్కరించింది. దీనిని ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేక డిజైన్‌లో ప్రవేశపెట్టింది.
TVS Ronin Parakram Bike Unveiled: 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌పై విజయం సాధించినందుకు గుర్తుగా, భారతదేశం ప్రతి సంవత్సరం జూలై 26న 'కార్గిల్ విజయ్ దివాస్'ని జరుపుకుంటుంది. జూలై 26, 2024న 25వ కార్గిల్ దివాస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని TVS మోటార్ కంపెనీ టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ (TVS Ronin Parakram) పేరుతో కొత్త బైక్‌ను ఆవిష్కరించింది.
TVS రోనిన్ పరాక్రమ్ ఇతర రోనిన్ బైక్‌లతో పోలిస్తే అనేక డిజైన్ మార్పులను కలిగి ఉంది. MotoSoul 2023లో TVS ప్రదర్శించిన కస్టమ్-బిల్ట్ మోటార్‌సైకిళ్లను ఇది పోలి ఉంటుంది. స్టాండర్డ్ రోనిన్ మోడల్‌ల వలె కాకుండా, ఈ ఎడిషన్ అనేక మార్పులు, ప్రత్యేకమైన స్టైలింగ్‌తో తీసుకురానుంది.
డిజైన్ మరియు ఫీచర్లు
ఇది ఇతర రోనిన్‌ల వలె వృత్తాకార హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉన్నప్పటికీ, బైక్ ముందు భాగంలో మెటాలిక్ విండ్‌స్క్రీన్ ఉంటుంది. ప్రధాన రంగులు ముదురు ఆకుపచ్చ (మిలటరీ కలర్) మరియు సిల్వర్ కలర్‌లో ఉంటుంది. ఇక భారత జాతీయ జెండాలోని కాషాయ, తెలుపు, ఆకుపచ్చ లైన్స్‌ని హెడ్‌ల్యాంప్ మరియు ట్యాంక్‌పై పెయింట్ చేసారు. భారత సైన్యంలోని వివిధ యుద్ధ ప్రాంతాలను సూచించే గ్రాఫిక్స్ కూడా ఈ బైక్‌పై ఉన్నాయి.
బైక్ ట్యాంక్, కింద ప్యానెల్‌లు ముదురు ఆకుపచ్చ కలర్‌లో ఉంటాయి. అందువల్ల ఇది చూడటానికి అచ్చం మిలటరీ వెహికిల్‌గా ఉంటుంది. కొన్ని ప్యానెల్‌లు అల్యూమినియం ఎండిగ్‌ని కలిగి ఉంటాయి. సీటు కొత్త ముదురు గోధుమ రంగు (Dark Brown) కలర్‌లో ఉంటుంది. పిలియన్ రైడర్ కౌల్ డిజైన్‌ను కలిగి ఉంది. ముందు వెనక ఉండే టెయిల్‌లైట్స్ (ఇండికేటర్స్) బుల్లెట్ ఆకారంలో సరికొత్తగా డిజైన్ చేశారు. అంతే కాకుండా ఇది డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మరియు భారీ టైర్లను కూడా కలిగి ఉంది.
ఇంజిన్ స్పెసిఫికేషన్లు
TVS రోనిన్ పరాక్రమ్ 225.9cc సింగిల్-సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ద్వారా పనిచేయనుంది. ఈ ఇంజిన్ 7,750 rpm వద్ద 20.12 bhp గరిష్ట శక్తిని మరియు 3,750 rpm వద్ద 19.93 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ముందు భాగంలో 41 మిమీ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ ఉంది. డిస్క్ బ్రేక్‌లు రెండు వైపులా బ్రేకింగ్ విధులను నిర్వహిస్తాయి.
ఇక LCD ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ నావిగేషన్, స్పీడ్, గేర్ ఇండికేటర్, టర్న్ ఇండికేటర్స్, రీండింగ్ వంటి వాటిని సూచిస్తుంది. అంతే కాకుండా ఇన్‌కమింగ్ కాల్స్ మరియు మెసేజ్ అలర్ట్‌ల కోసం బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు.
TVS రోనిన్ పరాక్రమ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మరియు హోండా CB350 RS లకు పోటీగా ఉంది. వీటి ధరలు వరుసగా రూ.1.49 లక్షలు, రూ.2.38 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉన్నాయి. అయితే, ఈ ప్రత్యేక ఎడిషన్‌ని అందరికీ అందుబాటులోకి తెస్తారా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీనితో పాటు దీని ధరకు సంబంధించిన వివరాలను సైతం వెల్లడించలేదు.