Toyota Urban Cruiser Ebella: E1, E2, E3 వేరియంట్లతో వచ్చింది - బ్యాటరీ రేంజ్, ఫీచర్లు చూస్తే ఏ వేరియంట్ కొనాలి?
Toyota Urban Cruiser Ebella, భారత్‌లో, టయోటా తొలి ఎలక్ట్రిక్ SUVగా వచ్చింది. E1, E2, E3 వేరియంట్లు, 49kWh, 61kWh బ్యాటరీలు, రేంజ్, ఫీచర్లు ఏవి ఉన్నాయో పూర్తిగా తెలుసుకోండి.

Toyota Urban Cruiser Ebella Price And Specifications: టయోటా భారత మార్కెట్‌లో తన తొలి ఎలక్ట్రిక్ SUVగా Urban Cruiser Ebella ను అధికారికంగా పరిచయం చేసింది. ఇప్పటికే Maruti e Vitara పేరుతో కనిపించిన ఈ మోడల్, కొన్ని డిజైన్ మార్పులు, బ్రాండ్‌కు తగ్గ ఫీచర్లతో టయోటా బ్యాడ్జ్‌తో ఇప్పుడు మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకుంటే, ఈ ఎలక్ట్రిక్ SUV టయోటా నుంచి వచ్చిన కీలక అడుగు అని చెప్పాలి.
Urban Cruiser Ebella ను టయోటా మొత్తం మూడు వేరియంట్లలో - E1, E2, E3 గా అందిస్తోంది. వీటికి అనుగుణంగా 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లు ఇస్తోంది.
బ్యాటరీ, రేంజ్, పనితీరు
E1 వేరియంట్‌లో కేవలం 49kWh బ్యాటరీ ప్యాక్ మాత్రమే లభిస్తుంది. ఇది ARAI ప్రకారం 440 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఈ బ్యాటరీతో ఫ్రంట్ యాక్సిల్‌పై అమర్చిన మోటార్, 144hp పవర్, 189Nm టార్క్ అందిస్తుంది.
E2, E3 వేరియంట్లలో పెద్దదైన 61kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. దీని రేంజ్ 543 కి.మీ. వరకు ఉంటుందని టయోటా చెబుతోంది. ఈ బ్యాటరీతో మోటార్ అవుట్‌పుట్ 171hp, 189Nmగా ఉంటుంది. రోజువారీ నగర ప్రయాణాలు, వీకెండ్ ట్రిప్‌లు, ఇంటర్ సిటీ ప్రయాణాలకు ఈ రేంజ్ బ్రహ్మాండంగా సరిపోతుంది.
కలర్ ఆప్షన్లు
Urban Cruiser Ebella మొత్తం 9 ఎక్స్‌టీరియర్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
మోనోటోన్ కలర్స్‌గా Sportin Red, Cafe White, Enticing Silver, Gaming Grey, Bluish Black ఉన్నాయి.
డ్యుయల్ టోన్‌లో Cafe White, Sportin Red, Land Breeze Green, Enticing Silver కలర్స్ బ్లాక్ రూఫ్‌తో వస్తాయి.
E1 వేరియంట్ - బేస్ అయినా ఫుల్ ప్యాక్
E1 వేరియంట్ అనేది బేస్ మోడల్ అయినప్పటికీ ఫీచర్ల విషయంలో ఏమాత్రం నిరాశపరచదు. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్స్ సహా చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు; 7 ఎయిర్‌బ్యాగ్స్, స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్, TPMS వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
E2 వేరియంట్ - పెద్ద బ్యాటరీ
E2 వేరియంట్‌లో ప్రధానంగా 61kWh బ్యాటరీ లభిస్తుంది. E1లో ఉన్న ఫీచర్లతో పాటు అదనంగా రియర్ పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, లగేజ్ షెల్ఫ్ వస్తాయి. ఫీచర్ల కంటే రేంజ్‌కు ప్రాధాన్యం ఇచ్చే వారికి ఇది సరైన ఎంపిక.
E3 వేరియంట్ - టాప్ ఎండ్ లగ్జరీ
టాప్ వేరియంట్ అయిన E3లో.. E1 + E2లో ఉన్న ఫీచర్లతో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, లెదరెట్ అప్హోల్స్టరీ, సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS, JBL సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి.
మొత్తానికి, Toyota Urban Cruiser Ebella టయోటా నుంచి వచ్చిన ఒక బ్యాలెన్స్‌డ్ ఎలక్ట్రిక్ SUV. బేస్ వేరియంట్‌లోనే మంచి ఫీచర్లు, టాప్ వేరియంట్‌లో ఆధునిక భద్రతా టెక్నాలజీ ఉండటం వల్ల, తెలుగు రాష్ట్రాల్లో EV కొనుగోలు ఆలోచనలో ఉన్నవారికి ఇది బలమైన ఎంపికగా నిలవనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















