Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Best Selling Cars In India: 2024 అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లకు సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈసారి హ్యుందాయ్ క్రెటా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.
Top 5 Selling Cars In India: భారత మార్కెట్లో ఎస్‌యూవీలకు చాలా డిమాండ్ ఉంది. కారు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు సెడాన్లు లేదా హ్యాచ్‌బ్యాక్‌ల కంటే ఎస్‌యూవీలను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. 2024 అక్టోబర్‌లో ఎస్‌యూవీ వాహనాల భారీ విక్రయాలు జరిగాయి. అదే సమయంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 ఎస్‌యూవీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితాలో ఐదు కార్లలో అత్యధిక ధర కలిగిన కారు అగ్రస్థానంలో ఉంది. గత నెల విక్రయాల్లో హ్యుందాయ్ క్రెటా బెస్ట్ సెల్లింగ్ కారుగా అవతరించింది.
హ్యుందాయ్ క్రెటా అక్టోబర్ 2024లో ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. ఈ కారు తాజా తరం మోడల్ 2024 జనవరిలో లాంచ్ అయింది. ఈ ఎస్‌యూవీకి సంబంధించి లక్ష వాహనాలు మొదటి నెలలోనే అమ్ముడు పోయాయి. అదే సమయంలో అక్టోబర్‌లో కూడా ఈ కారుకు డిమాండ్ తగ్గలేదు. అక్టోబర్‌లో హ్యుందాయ్ క్రెటా 17,497 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఢిల్లీలో ఈ హ్యుందాయ్ కారు ఆన్ రోడ్ ధర రూ. 12.81 లక్షల నుంచి మొదలై రూ. 24.11 లక్షల వరకు ఉంటుంది.
మారుతి కార్ల హవా...
2024 అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఎస్‌యూవీల జాబితాలో రెండు మారుతి కార్లు ఉన్నాయి. ఈ జాబితాలో మారుతి బ్రెజ్జా రెండవ స్థానంలో ఉంది. గత నెలలో ఈ మారుతి కారుకు సంబంధించి 16,565 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే కారుకు సంబంధించి 2023 అక్టోబర్‌లో 16,050 యూనిట్లు అమ్ముడు పోయాయి.
Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!
ఈ జాబితాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ మూడో స్థానంలో ఉంది. ఇది మారుతికి చెందిన అతి చిన్న ఎస్‌యూవీ. ఈ కారు టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లకు గట్టి పోటీనిస్తుంది. పండుగ సీజన్‌లో ఈ కారు విక్రయాలు 45 శాతం పెరిగాయి. 2024 అక్టోబర్‌లో ఈ కారు 16,419 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023 సంవత్సరంలో మారుతి అక్టోబర్‌లో 11,357 యూనిట్లను విక్రయించింది.
టాటా పంచ్ అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల్లో నాలుగో స్థానంలో ఉంది. సెప్టెంబర్ నెలలో టాటా పంచ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. మొదటి స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయినా అక్టోబర్‌లో ఈ వాహనం విక్రయాలు పెరగడం విశేషం. గత నెలలో 15,740 టాటా పంచ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 సెప్టెంబర్‌లో 13,711 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారు. ఈ కారు ఐసీఈ, సీఎన్‌జీ, ఈవీ మూడు ఆప్షన్లలో మార్కెట్లో ఉంది.
2024 అక్టోబర్‌లో మహీంద్రాకు సంబంధించి అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలు స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్. ఈ ఆటోమేకర్ల జాబితాలో మహీంద్రా స్కార్పియో చోటు దక్కించుకుంది. 2024 అక్టోబర్‌లో మహీంద్రా స్కార్పియోకు సంబంధించి 15,677 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది 2023 సెప్టెంబర్‌లో జరిగిన అమ్మకాల కంటే 15 శాతం ఎక్కువ. నవంబర్‌లో ఏ కంపెనీకి చెందిన కారు టాప్ ప్లేస్‌కు వస్తుందో చూడాలి మరి!
Also Read: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!