హారియర్ డీజిల్ వెర్షన్ బదులు పెట్రోల్ వెర్షన్ కొనొచ్చా? మీ అవసరాలకు ఏది సరిపోతుంది?
టాటా హారియర్ పెట్రోల్ - డీజిల్ వేరియంట్ల మధ్య ఫీచర్లు, ఇంజిన్, టెక్నాలజీ, డ్రైవింగ్ అనుభవంలో ఉన్న ప్రధాన తేడాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

Tata Harrier Petrol vs Diesel Comparison Telugu: ఇప్పటివరకు టాటా హారియర్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే - పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్. కానీ ఈ కథ ఇప్పుడు మారింది. టాటా మోటార్స్ హారియర్‌కు తొలిసారిగా పెట్రోల్ వేరియంట్‌ను పరిచయం చేస్తూ, మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో కొత్త అడుగు వేసింది. కొత్తగా వచ్చిన 1.5 లీటర్ హైపీరియన్ టర్బో GDI పెట్రోల్ ఇంజిన్‌తో హారియర్ పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని అందించబోతోంది. అయితే... పెట్రోల్ - డీజిల్ హారియర్‌ల మధ్య అసలు తేడాలు ఏంటి? ఏది మీ అవసరాలకు సరిపోతుంది?.
కొత్త Fearless Ultra ట్రిమ్ - పెట్రోల్‌కే ప్రత్యేకం
టాటా కంపెనీ... హారియర్ పెట్రోల్ వేరియంట్‌తో పాటు Fearless Ultra అనే కొత్త టాప్ ట్రిమ్‌ను కూడా మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇది డీజిల్ వేరియంట్లలో అందుబాటులో లేదు. ఈ ట్రిమ్‌లో ప్రధాన ఆకర్షణగా 14.5 అంగుళాల Samsung Neo QLED ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. డీజిల్ హారియర్‌లో ఉన్న 12.3 అంగుళాల స్క్రీన్‌తో పోలిస్తే ఇది చాలా పెద్దదిగా, మరింత షార్ప్‌గా కనిపిస్తుంది.
ఇంకా... 10 స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్ వస్తుంది. ఇందులో సెంటర్ స్పీకర్ కూడా ఉంటుంది. డీజిల్ వేరియంట్లలో ఈ సెంటర్ స్పీకర్ ఉండదు. మ్యూజిక్ ప్రియులకు ఇది క్లియర్‌కట్ అప్‌గ్రేడ్ అని చెప్పొచ్చు.
పెట్రోల్ హారియర్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు
హారియర్ పెట్రోల్‌లో మరో ముఖ్యమైన అప్‌డేట్ - డిజిటల్ IRVM (ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్). ఇందులో ముందు & వెనుక వైపున రెండు ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌క్యామ్‌లు ఉన్నాయి. అంతేకాదు, ముందు & వెనుక కెమెరాలకు వాషర్ ఫంక్షన్ కూడా ఇచ్చారు. ఇది డీజిల్ వేరియంట్లలో కనిపించదు.
నావిగేషన్ విషయంలో కూడా మార్పు చేశారు. డీజిల్ హారియర్‌లో ఉన్న Map My India స్థానంలో, పెట్రోల్ వేరియంట్‌లో Mappls ఆటో నావిగేషన్ అందిస్తున్నారు. అలాగే, 65W USB Type-C ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఇది డీజిల్ వేరియంట్లలో ఉన్న 45W యూనిట్‌తో పోలిస్తే మరింత ఉపయోగకరం.
ADAS విషయంలో... పెట్రోల్ హారియర్‌లోని Level 2+ సిస్టమ్‌కు Intelligent Speed Assist (Map ఆధారంగా) అనే కొత్త ఫీచర్‌ను జోడించారు.
లుక్‌లో స్పష్టమైన మార్పులు
పెట్రోల్ హారియర్‌కు ప్రత్యేకంగా Nitro Crimson అనే కొత్త ఎక్స్‌టీరియర్ కలర్ ఇచ్చారు. ఇంటీరియర్‌లో లైట్ కలర్ అప్‌హోల్స్టరీ, డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్, మధ్య భాగంలో వుడ్ ఫినిష్ కనిపిస్తుంది. ఇవన్నీ డీజిల్ వేరియంట్లతో పోలిస్తే పెట్రోల్ మోడల్‌ను స్పష్టంగా వేరుగా చూపిస్తాయి.
ఇంజిన్, మెకానికల్ తేడాలు
డీజిల్ హారియర్‌లో 2.0 లీటర్ క్రయోటెక్ ఇంజిన్ ఉంటుంది. ఇది 170 bhp శక్తి, 350 Nm టార్క్ ఇస్తుంది. కొత్త పెట్రోల్ హారియర్‌లో ఉన్న 1.5 లీటర్ హైపీరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా 170 bhp శక్తినే ఇస్తుంది. అయితే టార్క్ మాత్రం 280 Nm వరకు ఉంటుంది.
డీజిల్ ఇంజిన్ ఎక్కువ టార్క్ ఇస్తున్నా, అది తక్కువ RPM రేంజ్‌లోనే అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్‌లో మాత్రం టార్క్ బాండ్ వైడ్‌గా ఉంటుంది. టాటా చెప్పిన ప్రకారం, ఈ పెట్రోల్ ఇంజిన్ Miller cycle టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీని వల్ల 1,000 RPM నుంచే 160 Nm టార్క్ అందుతుంది. డీజిల్‌లా ఫీల్ ఇచ్చే ప్రారంభ స్పందన ఇందులో కనిపిస్తుంది.
బరువు, డ్రైవింగ్ అనుభవం
టాటా డేటా ప్రకారం, డీజిల్ వేరియంట్ కంటే పెట్రోల్ వేరియంట్ సుమారు 80 కిలోలు తక్కువ బరువు ఉంటుంది. దీని వల్ల ఫ్రంట్ యాక్సిల్‌పై లోడ్ తగ్గి, టర్న్ ఇన్ కొంచెం షార్ప్‌గా ఉంటుంది. అండర్‌స్టీర్ కూడా కొంత తగ్గుతుంది. అయితే, వాస్తవ ప్రపంచ డ్రైవింగ్‌లో పెద్దగా హ్యాండ్లింగ్ తేడా అనిపించలేదని సమాచారం.
ధర అంచనాలు
ఇప్పటికి పెట్రోల్ హారియర్ ధరలను టాటా అధికారికంగా ప్రకటించలేదు. అయితే అంచనాల ప్రకారం, ఇది డీజిల్ వేరియంట్ల కంటే రూ.50,000 నుంచి రూ.80,000 వరకు తక్కువే ఉండొచ్చు. ఎక్స్-షోరూమ్ ధర రూ.13 లక్షల నుంచి రూ.24.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
చివరగా, డీజిల్ శక్తి, టార్క్ కోరుకునే వారికి డీజిల్ హారియర్ ఇప్పటికీ సరైన ఎంపిక. అయితే ఆధునిక ఫీచర్లు, కొత్త టెక్నాలజీ, కొంచెం స్మూత్ డ్రైవింగ్ అనుభవం కావాలంటే హారియర్ పెట్రోల్ ఒక ఆసక్తికరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















