Engine Warm Up: పెట్రోల్, డీజిల్, CNG కార్లను నడిపే ముందు ఎంత సేపు ఆన్‌లో ఉంచాలి? కంపెనీలు ఏం చెబుతున్నాయి?
కారు ఇంజిన్‌ను స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువసేపు వార్మ్ చేయాలా? పెట్రోల్, డీజిల్, CNG & టర్బో ఇంజిన్ల విషయంలో కంపెనీలు ఇచ్చే సూచనలు తెలుసుకోండి.

Warming Up Car Engine: కారు స్టార్ట్ చేసిన వెంటనే డ్రైవ్ చేయాలా? లేక ఇంజిన్ వేడెక్కే వరకు కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలా? ఈ సందేహం చాలామంది కార్ల యజమానులకు ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ లేదా CNG కార్లు ఉపయోగించేవారు ఈ విషయంలో స్పష్టత కోరుకుంటారు. పాత కార్లలో ఇంజిన్‌ను కొంతసేపు వార్మ్ చేయడం అవసరమయ్యేది. కానీ ఆధునిక కార్లలో పరిస్థితి మారింది. ఇంజిన్ టెక్నాలజీలో వచ్చిన మార్పుల కారణంగా, వాతావరణం ఎలా ఉన్నా, కారును ఎక్కువసేపు స్టార్ట్ చేసి అలాగే ఉంచాల్సిన అవసరం లేదు. అయితే ఇంజిన్ రకం, టర్బోచార్జర్ వంటి అంశాలను బట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
పాత కార్లలో ఎక్కువసేపు వార్మ్ చేయాల్సి వచ్చేది, ఎందుకు?
పాత కార్లలో కార్బ్యురేటర్ వ్యవస్థ ఉండేది. ఇంజిన్ చల్లగా ఉన్నప్పుడు గాలి & ఇంధన మిశ్రమాన్ని సరైన నిష్పత్తిలో అందించడం కార్బ్యురేటర్‌కు వెంటనే సాధ్యమయ్యేది కాదు. అందువల్ల ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతసేపు సరిగా పని చేయకపోవచ్చు.
ఇంజిన్ వేడెక్కే వరకు ఇంజిన్ పనితీరులో అస్థిరత ఉండేది. అందుకే పాత కార్లను నడిపే ముందు కొంతసేపు ఐడిల్‌లో ఉంచేవారు. తర్వాత వచ్చిన ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ ఈ సమస్యను పరిష్కరించింది. అందువల్ల ఆధునిక కార్లకు ఎక్కువసేపు వార్మ్ అప్ అవసరం లేదు.
పెట్రోల్ కార్ల విషయంలో ఏం చేయాలి?
కారు ఎక్కువ సేపు పార్క్ చేసి ఉన్నప్పుడు ఇంజిన్ ఆయిల్ కిందికి చేరుతుంది. ఇంజిన్‌ను స్టార్ట్ చేసిన తర్వాత ఆయిల్ పంప్ మళ్లీ ఆయిల్‌ను ఇంజిన్‌లోని కదిలే భాగాలకు పంపిస్తుంది. సాధారణంగా ఈ ప్రక్రియకు సుమారు 30 సెకన్లు పడుతుంది. ఇంజిన్ చల్లగా ఉన్నప్పుడు ఐడిల్ RPM ఎక్కువగా ఉంటుంది. ఇంజిన్ క్రమంగా వేడెక్కిన తర్వాత RPM తగ్గుతుంది.
పెట్రోల్ కార్ల యజమానులు ఇంజిన్ పూర్తిగా వేడెక్కే వరకు కారును ఒకేచోట నిలిపి ఉంచాల్సిన అవసరం లేదని కంపెనీల ఓనర్ మాన్యువల్స్ సూచిస్తున్నాయి. ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సెకన్లు ఐడిల్‌లో ఉంచి, ఆ తర్వాత డ్రైవింగ్ ప్రారంభించవచ్చు. అయితే మొదట్లో అధిక వేగంతో నడపకుండా మితమైన వేగంతో ప్రయాణించాలి. ఇలా చేస్తే ఇంజిన్ క్రమంగా సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.
ఇది కూడా చదవండి: 9999, 0001 వంటి ఫ్యాన్సీ నంబర్లు పొందడం ఎలా? Parivahan పోర్టల్‌లో అప్లై చేసుకునే విధానం ఇదిగో
డీజిల్ కార్ల విషయంలో జాగ్రత్తలు
డీజిల్ ఇంజిన్లలో చల్లని వాతావరణంలో స్టార్ట్ చేయడానికి ముందు గ్లో ప్లగ్స్‌ను ఉపయోగిస్తారు. ఇవి ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి అవసరమైన వేడిని అందిస్తాయి. కారు ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో Glow Plug ఇండికేటర్ వెలుగుతూ కనిపిస్తుంది. ఈ లైట్ ఆరిపోయిన తర్వాత ఇంజిన్‌ను స్టార్ట్ చేయాలని కారు కంపెనీలు సూచిస్తాయి.
ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలనే విషయంలో కంపెనీని బట్టి సూచనలు మారవచ్చు. కొన్ని సంస్థలు, ముఖ్యంగా, శీతాకాలంలో చల్లగా ఉన్న డీజిల్ ఇంజిన్‌ను కొంతసేపు వార్మ్ చేసిన తర్వాత డ్రైవ్ చేయాలని చెబుతాయి. మరికొన్ని కంపెనీలు అలాంటి ప్రత్యేక సూచనలు ఇవ్వవు. కాబట్టి మీ కారు ఓనర్స్ మాన్యువల్‌లోని సూచనలను పాటించడం ముఖ్యం.
టర్బో ఇంజిన్లకు మరిన్ని జాగ్రత్తలు
పెట్రోల్ అయినా, డీజిల్ అయినా టర్బోచార్జర్ ఉన్న ఇంజిన్ల విషయంలో కొన్ని అదనపు జాగ్రత్తలు అవసరం. టర్బోచార్జర్ సరిగ్గా పనిచేయడానికి ఇంజిన్ ఆయిల్‌తో లూబ్రికేషన్ అవసరం. అందుకే, కోల్డ్ స్టార్ట్ తర్వాత వెంటనే కారును వేగంగా నడపకుండా కొద్దిసేపు వేచి ఉండాలని కంపెనీలు సూచిస్తాయి. కారును బట్టి ఈ సమయం సుమారు 30 సెకన్లు ఉండవచ్చు.
అలాగే హైస్పీడ్ డ్రైవింగ్ లేదా ఎక్కువ థ్రోటిల్ ఉపయోగించిన వెంటనే ఇంజిన్‌ను ఆఫ్ చేయకూడదు. టర్బోచార్జర్ చల్లబడటానికి కొంత సమయం అవసరం. ఇంజిన్‌ను ఆఫ్ చేసే ముందు ఓనర్స్ మాన్యువల్‌లో సూచించిన సమయం వరకు ఐడిల్‌లో ఉంచాలి. కారును బట్టి ఈ సమయం కొన్ని సెకన్ల నుంచి సుమారు ఒక నిమిషం వరకు ఉండవచ్చు. ఎక్కువ లోడ్‌తో పని చేసిన ఇంజిన్‌ను వెంటనే ఆఫ్ చేస్తే టర్బోచార్జర్ దెబ్బతినే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: జనం ఎక్కువగా కొంటున్నది ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లనే.. అక్టోబర్‌లో రెట్టింపు అమ్మకాలు!
CNG కార్లను స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి?
కొన్ని ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కార్లు మొదట పెట్రోల్‌తో స్టార్ట్ అవుతాయి. ఇంజిన్ వేడెక్కిన తర్వాత ఆటోమేటిక్‌గా CNGకి మారతాయి. కొన్ని మోడళ్లలో నేరుగా CNGతో స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ నిర్దిష్ట పరిస్థితులు నెరవేరకపోతే కారు పెట్రోల్‌తోనే పనిచేస్తుంది. అందుకే CNG కార్లలో కూడా తగినంత పెట్రోల్ నిల్వ ఉంచాలని ఓనర్స్ మాన్యువల్ సూచిస్తాయి. ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు కొన్ని కార్లు CNGకి మారకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఇంజిన్ వేడెక్కే వరకు పూర్తిగా పెట్రోల్‌తోనే నడపాలని కంపెనీలు సూచిస్తాయి.
చల్లని ఇంజిన్‌ను ఎక్కువగా రైజ్ చేయకూడదు
ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే ఎక్కువ RPM వచ్చేలా రైజ్ చేయకూడదని ఓనర్స్ మాన్యువల్‌లో స్పష్టంగా ఉంటుంది. ఇంజిన్ వేడెక్కుతున్న సమయంలో వైడ్ ఓపెన్ థ్రోటిల్ ఉపయోగించడం, వేగంగా యాక్సిలరేట్ చేయడం వంటివి చేయకూడదు. ఇంజిన్ సాధారణ ఆపరేటింగ్ ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు మితమైన వేగంతో డ్రైవ్ చేయడం మంచిది.
మొత్తంగా చూస్తే.. ఆధునిక పెట్రోల్ కార్లను ఎక్కువసేపు ఐడిల్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. డీజిల్, CNG & టర్బో ఇంజిన్ల విషయంలో మాత్రం కారు తయారీ సంస్థ ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా కోల్డ్ స్టార్ట్ తర్వాత ఇంజిన్‌పై అధిక ఒత్తిడి పెట్టకుండా నడపడం ముఖ్యం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















