Cars Price Hike: కస్టమర్లకు బిగ్ షాక్ - జూన్ నుంచి ఈ కార్ల రేట్లు పెంపు, ముందే కొనడం బెటర్
Cars To Get Costlier From June 2025: త్వరలో కార్ కొనాలని ఆలోచిస్తున్న కస్టమర్లు తమ ప్లాన్‌ను ఈ నెలలోనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మే 31 దాటితే, కొన్ని కార్ల రేట్లు పెరుగుతాయి.

Mercedes-Benz Cars To Get Costlier From June 2025: కార్ కొనేవాళ్లకు కాస్త బ్యాడ్ న్యూస్. కార్ ధరలు మరో దఫా పెరగబోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు (జనవరి, ఏప్రిల్) కార్‌ల ధరలు ప్రియమయ్యాయి. ఇప్పుడు, ముచ్చటగా మూడోసారి కూడా ఫోర్‌వీలర్‌ల మరింత ఖరీదు కానున్నాయి. ప్రీమియం కార్లకు పెట్టింది పేరైన మెర్సిడెస్-బెంజ్ ఇండియా, తన కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించి కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే లాంచ్ అయిన అన్ని మోడళ్లకు ఈ పెరుగుదల వర్తిస్తుంది.
ఈ లగ్జరియస్ కార్ల కంపెనీ, ధరల పెంపును రెండు దశల్లో అమలు చేయబోతోంది. మొదటి దశలో జూన్ 01, 2025 నుంచి & రెండో దశలో సెప్టెంబర్ 01, 2025 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయని మెర్సిడెజ్ బెంజ్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత మెర్సిడెస్ కార్ కొనుగోలు చేసే వాళ్లు రూ. 90 వేల నుంచి రూ. 12.20 లక్షల వరకు అదనంగా చెల్లించాల్సిరావచ్చు.
ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది?
అన్ని మోడళ్ల ధరలు సగటున 1.50 శాతం పెరుగుతాయని మెర్సిడెస్ బెంజ్ ప్రకటించింది. Mercedes-Benz C-Class వంటి ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ల ధర కనీసం రూ. 90,000 పెరుగుతుంది. ఈ పెంపు తర్వాత, సి-క్లాస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 60.3 లక్షలకు చేరుకుంటుంది. అదే సమయంలో, కంపెనీ అత్యంత ప్రీమియం సెడాన్ Mercedes-Maybach S-Class ధర గరిష్టంగా రూ. 12.20 లక్షలు పెరుగుతుంది. ఈ పంపు తర్వాత, ఈ హై-ఎండ్ మోడల్ కొత్త ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.60 కోట్లకు చేరుతుంది. ఇంకా... GLE, GLS, EQB & E-Class వంటి ఇతర ప్రముఖ మెర్సిడెస్ మోడళ్ల ధరలు కూడా పెరుగుతాయి. దీంతో, లగ్జరీ కార్లను కొనాలనుకునే వాళ్ల జేబులపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది.
ధరలు పెరగడానికి కారణం ఏమిటి?
మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & CEO సంతోష్ అయ్యర్ చెప్పిన ప్రకారం, కార్ ధరల పెంపు నిర్ణయం వెనుక ఉన్న అతి పెద్ద కారణం 'భారతీయ రూపాయి విలువ పడిపోవడం & దిగుమతి ఖర్చులు పెరగడం'. భారతదేశంలో మెర్సిడెస్ కార్లను అసెంబుల్ చేయడానికి ఉపయోగించే చాలా అనేక విడిభాగాలు & సాంకేతికత విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత కారణంగా ఈ ఉత్పత్తుల ధర గణనీయంగా పెరిగింది. కంపెనీ, ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తోంది.
వాత పెట్టి ఆయింట్‌మెంట్ రాసే చర్యలు
రేట్ల మంట నుంచి కస్టమర్లను కూల్ చేయడానికి కూడా కంపెనీ ప్రయత్నిస్తోంది. ధరల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి, కంపెనీ ఆర్థిక సేవల విభాగం (MBFS) కస్టమర్లకు కొన్ని పరిష్కార మార్గాలను అందిస్తోంది. సులభమైన వాయిదాలు & కస్టమైజ్డ్ లోన్ ప్లాన్‌లు వంటి ఉపశమన చర్యలను అందుబాటులోకి తీసుకొస్తామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా వెల్లడించింది. మీరు మెర్సిడెస్ కొనాలని ఆలోచిస్తుంటే మే 31ని డెడ్‌లైన్‌గా పెట్టుకోండి, ఈ గడువులోగా బండిని తీసుకొచ్చి మీ ఇంటి ముందు పార్క్ చేయండి. గడువు దాటిందంటే జేబుకు పెద్ద చిల్లు తప్పదు, జూన్ 1, 2025 నుంచి ధరలు భారీగా పెరుగుతాయి.





















