Maruti Suzuki e-Vitara: మోదీ చేతుల మీదుగా మారుతి EV విప్లవం - 100 దేశాలకు ఎగుమతి, ₹70,000 కోట్ల భారీ పెట్టుబడి
Maruti Suzuki Battery Plant: మారుతి సుజుకి EV యుగానికి అంకురార్పణ జరిగింది. e-Vitara అసెంబ్లీ లైన్, లిథియం-ఐయాన్ బ్యాటరీ ఉత్పత్తి మొదలైంది. ₹70,000 కోట్ల పెట్టుబడి, 100 దేశాలకు ఎగుమతి లక్ష్యం.

Maruti e-Vitara Launched: భారత ఆటోమొబైల్ రంగంలో చరిత్ర తిరగరాసిన రోజు ఇది!. గుజరాత్‌లోని హన్సల్పూర్‌లో ప్లాంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చేతుల మీదుగా, మారుతి సుజుకి EV విప్లవానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొదటి లిథియం-ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ప్రొడక్షన్ యూనిట్, EV అసెంబ్లీ లైన్ ప్రారంభం కావడంతో, “మేక్ ఇన్ ఇండియా” భావన సరికొత్త శిఖరాలను చేరింది.
మారుతి సుజుకీ మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ SUV e-Vitara లాంచ్ చేసిన ప్రధాని మోదీ, ఆ కార్ల ఉత్పత్తిని పూర్తి స్థాయిలో ప్రారంభించారు. భారత్‌లో తయారైన ఈ SUV.. యూకే, జర్మనీ, ఫ్రాన్స్, నార్వే, ఇటలీ వంటి యూరప్ దేశాలు సహా 100కి పైగా దేశాలకు ఎగుమతి కానుంది. మన దేశం నుంచి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ నేరుగా గ్లోబల్ మార్కెట్లను చేరడం ఇదే మొదటిసారి!.
#WATCH | Aerial view of the stockyard of Maruti Suzuki in Gujarat, showing just about 2–3% of the annual production. The plant that rolls out 7.5 lakh cars every year pic.twitter.com/ZK7t0a3mam
— ANI (@ANI) August 26, 2025
మరింత ముఖ్యంగా, TDS లిథియం-ఐయాన్ బ్యాటరీ గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ (TDSG) అనే మారుతి అనుబంధ సంస్థ ఇప్పుడు “ఎలక్ట్రోడ్ లెవెల్ లోకలైజేషన్” సాధించింది. అంటే, లిథియం-ఐయాన్ బ్యాటరీల కాథోడ్, అనోడ్ భాగాలు దేశంలో తయారవుతున్నాయి. ఈ విప్లవాత్మక అడుగుతో, భారత్ ఇకపై హైబ్రిడ్ వాహనాల బ్యాటరీల విషయంలో ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. Grand Vitara హైబ్రిడ్ SUV లో స్థానికంగా తయారైన ఇవే సెల్స్‌ను ఉపయోగిస్తారు.
ఉత్పత్తి సామర్థ్యం పెంపు ప్రణాళిక
ప్రస్తుతం, హన్సల్పూర్‌లో ప్లాంట్ ఏడాదికి 18 మిలియన్ సెల్స్ ఉత్పత్తి చేస్తోంది. దీని మీద ఇప్పటికే రూ. 4,267 కోట్లు పెట్టుబడి పెట్టారు. వచ్చే రోజుల్లో మరో 12 మిలియన్ సెల్స్ సామర్థ్యం జోడించి, ఉత్పత్తిని మరింత విస్తరించబోతున్నారు.
హన్సల్పూర్‌లోని ప్రధాన ప్లాంట్‌కి భారీ సామర్థ్యం కూడా ఉంది. ఒక్క ఏడాదిలోనే 7.5 లక్షల వాహనాలు తయారు చేయగల ఈ యూనిట్ ఇప్పుడు మారుతి కంట్రోల్‌లోకి వచ్చింది. దీని ద్వారా EVలతో పాటు పలు మోడళ్ల ఉత్పత్తి మరింత వేగం కానుంది.
“మారుతి నాలుగేళ్లుగా భారత్ నుంచి అతి పెద్ద కార్ల ఎగుమతిదారుగా నిలుస్తోంది. ఇక EVలు కూడా అదే స్థాయిలో ఎగుమతి అవుతాయి. ప్రపంచంలో నడిచే EVల మీద ‘Made in India’ ముద్ర మనకు గర్వకారణం అవుతుంది” - ప్రధాని నరేంద్ర మోదీ
“తదుపరి 5 నుంచి 6 సంవత్సరాల్లో, భారత్‌లోనే ₹70,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాం. EVలు, హైబ్రిడ్లలో టెక్నాలజీ, ప్రొడక్షన్ సామర్థ్యాన్ని మరింత పెంచుతాం” - సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి
మొదటి లిథియం-ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ప్రొడక్షన్ యూనిట్, EV అసెంబ్లీ లైన్ ప్రారంభించిన ఘట్టాన్ని కేవలం ఒక ప్లాంట్ ప్రారంభోత్సవంగా మాత్రమే కాదు, అంతకుమించిన సందర్భంగా చూడాలి. భారత్ గ్లోబల్ EV మ్యాప్‌లో తనదైన ముద్ర వేసిన రోజు ఇది. స్థానిక ఉత్పత్తి, భారీ ఎగుమతులు, అంతర్జాతీయ పెట్టుబడులు కలిసి దేశాన్ని ఎలక్ట్రిక్ భవిష్యత్తులోకి నడిపిస్తున్నాయి.





















