Mahindra XUV 7XO vs XEV 9S: పెద్ద కుటుంబానికి, లాంగ్ డ్రైవ్స్‌కు సరైన 7 సీటర్ కారు ఏది?
మహీంద్రా బ్రాండ్ నుంచి 7 సీటర్ కారు కొనాలనుకుంటున్నారా?, అయితే XUV 7XO డీజిల్, XEV 9S ఎలక్ట్రిక్ EV లో ఒక దానిని ఎంచుకోవచ్చు. ఈ కేస్‌లో... థర్డ్ రో స్పేస్, డ్రైవ్ అనుభవం వంటివి చూడాలి.

Mahindra 7 Seater SUV: భారత మార్కెట్‌లో 7 సీటర్ వాహనాల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుటుంబ వినియోగం కోసం పెద్ద కార్లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మీరు కొత్తగా మహీంద్రా 7 సీటర్ వాహనం కొనాలనుకుంటే, సహజంగా వచ్చే ప్రశ్న - డీజిల్ వెర్షన్ తీసుకోవాలా? లేక ఎలక్ట్రిక్ కారు తీసుకోవాలా?. ఈ సందేహానికి సమాధానం తెలుసుకోవాలంటే ప్రస్తుతం మహీంద్రా శ్రేణిలో ఉన్న రెండు ప్రధాన మోడళ్లను పోల్చి చూడాలి. అవే Mahindra XUV 7XO డీజిల్ & Mahindra XEV 9S ఎలక్ట్రిక్.
Mahindra XUV 7XO డీజిల్ - శక్తివంతమైన ఇంజిన్, కానీ పరిమితులు ఉన్నాయి
XUV 7XOలో ఉన్న డీజిల్ ఇంజిన్ పనితీరు విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఫుల్ పవర్‌తో పనిచేస్తుంది, రిఫైన్‌మెంట్ కూడా బాగుంటుంది. లాంగ్ డ్రైవ్స్, హైవే ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి ఈ డీజిల్ సెటప్ నమ్మకంగా అనిపిస్తుంది.
కానీ, 7 సీటర్‌గా చూస్తే ఇక్కడే ఒక కీలక లోపం కనిపిస్తుంది. థర్డ్ రో సీటింగ్ స్పేస్ చాలా పరిమితంగా ఉంటుంది. పెద్దవాళ్లు కూర్చోవడానికి ఇది సౌకర్యంగా ఉండదు. చిన్న పిల్లలకు సరిపోతుంది తప్ప పూర్తి స్థాయి కుటుంబ ప్రయాణాలకు ఇది అంతగా ఉపయోగపడదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, XUV 7XOలో సెకండ్ రో స్లైడింగ్ సీట్స్ ఆప్షన్ లేదు. దీనివల్ల సెకండ్, థర్డ్ రో మధ్య స్పేస్‌ను బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది.
Mahindra XEV 9S - నిజమైన 7 సీటర్ అనుభవం
ఇదే పోలికలో, XEV 9S ఎలక్ట్రిక్ EV స్పష్టంగా బాగుంటుంది. ఈ మోడల్‌లో సెకండ్ రో స్లైడింగ్ సీట్స్ ఆప్షన్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. దీనివల్ల, మీరు అవసరాన్ని బట్టి సెకండ్ రో, థర్డ్ రో మధ్య స్పేస్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు. ఫలితంగా, థర్డ్ రోలో కూడా పెద్దవాళ్లు కూర్చునేంత స్థలం లభిస్తుంది.
పనితీరు విషయానికి వస్తే, XEV 9S ఎక్కడా వెనుకబడదు. ఎలక్ట్రిక్ మోటార్ వెంటనే శక్తిని అందిస్తుంది, నగర డ్రైవింగ్‌లో ఇది చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. రేంజ్ కూడా బాగానే ఉండటం వల్ల రోజువారీ వినియోగంలో టెన్షన్ ఉండదు.
డీజిల్ లేదా ఎలక్ట్రిక్ - మీ వినియోగమే మీ నిర్ణయం
మీరు ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం కలిగి, ఎక్కువగా నగర ప్రయాణాలకే వాహనం ఉపయోగిస్తే, XEV 9S మీకు బెస్ట్ ఎంపిక. ఇది నిజమైన 7 సీటర్ అనుభవాన్ని ఇస్తుంది, డ్రైవింగ్ కూడా సులభంగా ఉంటుంది.
అయితే, ఒక విషయం గుర్తుంచుకోవాలి. XEV 9Sలోని సస్పెన్షన్ సెటప్ కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. అందుకే, హైవేలో అధిక వేగంతో ప్రయాణించినప్పుడు కొద్దిగా అస్థిరంగా అనిపించే అవకాశం ఉంది. తరచూ లాంగ్ హైవే డ్రైవ్స్ చేసే వారికి ఇది పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం.
ధర
Mahindra XUV 7XO - రూ. 13,66,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం
Mahindra XEV 9S - రూ. 19,95,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం
ఏది తీసుకోవాలి?
మీ ప్రాధాన్యం ఇంజిన్ ఫీలింగ్, హైవే స్టెబిలిటీ అయితే XUV 7XO డీజిల్ సరిపోతుంది.
మీకు నిజమైన 7 సీటర్ స్పేస్, సిటీ యూజ్, మోడ్రన్ ఎలక్ట్రిక్ డ్రైవ్ అనుభవం కావాలంటే XEV 9S మంచి ఎంపిక.
కాబట్టి, మీ ప్రయాణ అవసరాలు, కుటుంబ వినియోగమే మీకు ఏ కారు అవసరం అన్న అసలైన నిర్ణయాన్ని తీసుకుంటాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















