Harrier EV Safety Rating: టాటా హారియర్ EV సురక్షితమేనా, భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏం తేలింది?
Tata Harrier EV Battery Range: టాటా హారియర్ ఈవీలో డ్యూయల్-మోటార్ సెటప్ & హై-వోల్టేజ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేస్తే బండికి 627 km డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది.

Tata Harrier EV - Bharat NCAP Crash Test Results: టాటా మోటార్స్ కొత్తగా లాంచ్ చేసిన హారియర్ EV, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు & లాంగ్ రేంజ్‌తో మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలిచింది. వాస్తవానికి, టాటా కార్ అంటేనే గట్టిదనానికి గుర్తు. ఇప్పుడు, కొత్తగా వచ్చిన హారియర్ ఎలక్ట్రిక్ SUV కూడా అదే గట్టిదనంతో ఉందా?, ఏదైనా ప్రమాదం జరిగితే తట్టుకోగలదా?, కుటుంబ ప్రయాణానికి, ముఖ్యంగా చిన్నపిల్లలకు సురక్షితమేనా? వంటి ప్రశ్నలకు 'భారత్ ఎన్‌క్యాప్' (Bharat NCAP) క్రాష్ టెస్ట్ ఫలితాలు సమాధానం చెబుతాయి.
పరిపూర్ణమైన స్టార్ రేటింగ్
భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో, టాటా హారియర్ EV అద్భుతంమైన పనితీరును ప్రదర్శించింది, ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది, క్రాష్ టెస్టుల్లో ఇదే హైయెస్ట్ రేటింగ్. టాటా కంపెనీ నుంచి పరిపూర్ణమైన 5 స్టార్ రేటింగ్ సాధించిన నాలుగో EVగా హారియర్ నిలిచింది. ఎలక్ట్రిక్ SUV, పెద్ద వయస్సు ప్రయాణీకుల రక్షణ విభాగంలో 32 పాయింట్లకుగాను 32 పాయింట్లు & చిన్నారి ప్రయాణీకుల రక్షణ విభాగంలో 49 పాయింట్లకుగాను 45 పాయింట్లు సాధించింది.
భారత్ NCAP, టాటా హారియర్ SUVలో వచ్చిన రెండు వేరియంట్‌లు Empowered 75 & Empowered 75 AWD ని పరీక్షించింది. ఫ్రంట్, సైడ్ ఛెస్ట్ & కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లోడ్ లిమిటర్‌లతో సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్‌లు వంటి బలమైన భద్రత సాంకేతికతలను ఈ రెండు వెర్షన్లలోనూ అందించారు.
ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్‌లతో - 75 kWh & 65 kWh - లాంచ్ అయింది, ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌ల్లోని రియర్ వీల్ డ్రైవ్ & ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లనూ 5-స్టార్ రేటింగ్ కవర్ చేస్తుంది.
ఇన్ని విభాగాల్లో టెస్టులు
క్రాష్ టెస్ట్‌ల్లో, హారియర్ EV అన్ని విభాగాల్లో పరిణితి ప్రదర్శించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ & సైడ్ మూవబుల్ బారియర్ పరీక్షల్లో ఫుల్ స్కోర్ చేసింది. తల, ఛాతీ & పెల్విస్ వంటి కీలక శరీర భాగాలకు బలమైన రక్షణ అందించింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లోనూ ఈ కారు రక్షణ స్థాయిలు మంచి మార్కులతో, ఆమోదయోగ్యమైన డిజైన్‌గా రేటింగ్ సాధించింది. పిల్లల భద్రత అంచనాలలో కూడా టాటా హారియర్ SUV ప్రత్యేకంగా నిలిచింది. చైల్డ్ రెస్ట్రైన్ట్ సిస్టమ్స్ (CRS) కోసం నిర్వహించిన డైనమిక్ టెస్టింగ్‌లో 24 మార్కులకు 24 మార్కులు & CRS ఇన్‌స్టాలేషన్ విభాగంలో 12 మార్కులకు 12 మార్కులు తెచ్చుకుంది. వెహికల్ అసెస్‌మెంట్ స్కోర్‌లో కూడా 13కు 9 మార్కులు పొందింది. 18 నెలలు & 3 సంవత్సరాల పిల్లల తరహాలో డమ్మీలను ఉపయోగించి ఈ క్రాష్ టెస్ట్‌లు చేశారు.
లెవల్ 2 ADAS, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, AVAS (అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్) & నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు వంటి అనేక అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లను హారియర్ EV లోడ్ చేశారు.
ధర
ఇంత అద్భుతమైన ఫీచర్లకు తగ్గట్లుగానే కారు ధర ఉంటుంది, ఈ EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
రేంజ్
టాటా హారియర్ EVలో.. 65kWh బ్యాటరీ ప్యాక్ 505 km రేంజ్‌ను & 75kWh బ్యాటరీ ప్యాక్ 627 km రేంజ్‌ను అందించగలదు. ఈ బండి కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు.





















