Kinetic ZX: 1980ల నాటి కైనెటిక్ హోండా ZX మళ్లీ వస్తోంది, ఎలక్ట్రిక్ మోడ్‌లో!
Kinetic Honda ZX క్లాసిక్ మోడల్ ZX నుంచి స్ఫూర్తి పొంది, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను ఈ కంపెనీ రూపొందించింది. ఈ డిజైన్‌కు పేటెంట్ కోసం కూడా అప్లై చేసింది.

Kinetic Honda ZX Electric Scooter Details: మన దేశంలో, ఐకానిక్ టూవీలర్లకు పర్యాయపదంగా కైనెటిక్‌ను చెప్పుకోవచ్చు. 1980ల్లో, కైనెటిక్ హోండా ZX ఒక ఊపు ఊపింది, యువతను ఉర్రూతలూగించింది, స్టైలిష్ ఐకాన్‌గా నిలిచింది. ఈ మోడల్, 1980ల్లో నమ్మకమైన 98cc టూ-స్ట్రోక్ ఇంజిన్‌తో కస్టమర్ల హృదయాలను దోచుకుంది. యూత్ మాత్రమే కాదు, మహిళలు & మధ్య వయస్కులు కూడా చాలా సులభంగా నడిపేలా ఈ బండి డిజైన్ ఉంటుంది. అయితే, కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో కైనెటిక్ హోండా వెనుకబడింది. కానీ, ఇండియన్ మార్కెట్‌ను మాత్రం మరిచిపోలేదు. ఇప్పుడు, ఐకానిక్ స్కూటర్ కైనెటిక్ హోండా ZX కొత్త అవతార్‌లో, అంటే ఎలక్ట్రిక్ మోడ్‌లో మళ్లీ కనిపించబోతోంది. క్లాసిక్ ZX మోడల్ నుంచి ప్రేరణతో రూపొందించిన మోడర్న్ & ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌కు పేటెంట్ కోసం ఈ కంపెనీ ఇటీవలే దరఖాస్తు చేసుకుంది.
డిజైన్ & ఫీచర్లు
పేటెంట్ పొందిన డిజైన్ కైనెటిక్ హోండా ZXను గుర్తు చేసేలా ఉంటుంది & చూడచక్కని అవతార్‌లో రాబోతోంది. కొత్త కైనెటిక్ హోండా ZX ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌లో కీలక అంశాలు ఇవీ...
రెట్రో-ఇన్‌స్పైర్డ్ స్టైలింగ్: ఫ్రంట్ ఆప్రాన్ & ఫెండర్.. ఒరిజినల్ ZX లాంటి నాజూకైన, ఐకానిక్ లుక్‌ను ప్రతిబింబిస్తాయి. హెడ్‌లైట్ పైన ఉండే ఫ్లైస్క్రీన్‌పై కైనెటిక్ లోగో ఉంటుంది, ఇది ఒరిజినల్ కైనెటిక్ ZXలో తరహాలోనే కనిపిస్తుంది. సైడ్ ప్యానెళ్లు క్లాసిక్ మోడల్‌ను గుర్తుకు తెచ్చేలా క్లీన్‌గా, కనీస డిజైన్‌తో వస్తాయి. ఇంకాస్త దగ్గరగా చూస్తే, సైడ్ ప్యానెళ్లపై వెంట్స్‌ను కూడా గమనించవచ్చు, ఈ ఫీచర్‌ను ఒరిజినల్ వెర్షన్ నుంచి తీసుకున్నారు.
LED హెడ్‌లైట్లు: 1980ల్లోనే, స్లీక్ హ్యాండిల్‌బార్-మౌంటెడ్ లైట్ ప్యానెల్‌తో ఒరిజినల్ కైనెటిక్ ZX అందరినీ ఆశ్చర్యపరిచింది, ఈ తరహా డిజైన్ కొన్ని బండ్లలో ఇప్పటికీ కనిపిస్తోంది. అంటే, ఒరిజినల్ కైనెటిక్ ZXను భవిష్యత్ తరం బండిలా అప్పట్లోనే తీర్చిదిద్దారు. ఇప్పుడు, కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కూడా కైనెటిక్ LED హెడ్‌లైట్ & హ్యాండిల్‌బార్ల మీద 'K' ఆకారంలో LED వింకర్‌లను ఈ కంపెనీ ప్రజెంట్ చేస్తోంది.
విశాలమైన సీటు & పనితనం: ఈ స్కూటర్‌లో కాళ్లు & సామగ్రిని పెట్టుకునేందుకు విశాలమైన ఫ్లోర్‌బోర్డ్ ఉంది. అందమైన సింగిల్-పీస్ గ్రాబ్ రైల్ కూడా కొత్త డిజైన్‌లో కనిపిస్తోంది, వెనుక వైపు కూర్చున్న వాళ్లు కింద పడకుండా సపోర్ట్‌గా ఉంటుంది. కాబట్టి, కొత్త బండి డిజైన్‌లో కుటుంబ వినియోగానికి అధిక ప్రాధాన్యత & సౌకర్యానికి పెద్ద పీట వేశారు.
అల్లాయ్ వీల్స్ & సస్పెన్షన్: ఈ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు స్ట్రాంగ్ అల్లాయ్ వీల్స్‌ను బిగిస్తారు & కుదుపుల్లేని ప్రయాణం కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లను బిగించే అవకాశం ఉంది.
డిజిటల్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే: పైన చెప్పినవన్నీ చాలా బండ్లలో కామన్‌గా కనిపించే ఫీచర్లు. అయితే, ఒక్కో బ్రాండ్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కైనెటిక్ హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలు ఏంటన్నది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ బండిలో డిజిటల్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉండొచ్చన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణ సమయంలో, రైడర్ మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేసి, ఈ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ద్వారా నియంత్రించవచ్చు & రియల్ టైమ్ రైడ్ సమాచారం కూడా పొందవచ్చు. మొత్తంగా చూస్తే, రాబోయే కైనెటిక్ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడర్న్ ట్రెండ్‌కు అనుగుణంగా ఉండవచ్చు.





















