ఎస్‌యూవీ మార్కెట్‌లో Hyundai Creta సరికొత్త రికార్డు.. 15 లక్షల సేల్స్ మైల్‌స్టోన్ దాటేసింది!
హ్యుందాయ్ క్రెటా భారత్‌లో 15 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. 2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన ఈ ఎస్‌యూవీ ఎగుమతుల్లోనూ 3 లక్షల యూనిట్లకు చేరువైంది.

Hyundai Creta Details In Telugu: హ్యుందాయ్ క్రెటా.. భారత కార్ల మార్కెట్‌లో ఈ పేరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎస్‌యూవీ కొనాలనుకునే వారికి ఈ కారు ఎప్పటి నుంచో పాపులర్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇప్పుడు ఈ కారు మరో కీలక మైలురాయిని చేరుకుంది. భారత్‌లో క్రెటా దేశీయ అమ్మకాలు 15 లక్షల యూనిట్లను దాటాయి. 2015 జూలైలో విడుదలైనప్పటి నుంచి 2026 సెప్టెంబర్ చివరి నాటికి మొత్తం 15,12,036 యూనిట్లను హ్యుందాయ్ విక్రయించింది. విదేశాలకు చేసిన ఎగుమతులు కూడా 3 లక్షల యూనిట్లకు చేరువయ్యాయి.
క్రెటా అమ్మకాల్లో సరికొత్త రికార్డు
హ్యుందాయ్ మోటార్ ఇండియా మన దేశంలో విక్రయించిన మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో క్రెటా వాటా సుమారు 15 శాతం. క్రెటా విడుదలైన తర్వాత కంపెనీ మొత్తం యుటిలిటీ వాహనాల అమ్మకాల్లో ఈ మోడల్ వాటా 55 శాతానికి చేరింది. ఈ గణాంకాలు భారత మార్కెట్‌లో క్రెటాకు ఉన్న ఆదరణను స్పష్టం చేస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా క్రెటా అమ్మకాలు నిలకడగా పెరుగుతూ వచ్చాయి. కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుదల కనిపించినా, ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 1,50,372 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024లో ఈ సంఖ్య 1,62,773కు చేరింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 1,94,871 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
2026లో అత్యధిక అమ్మకాలు
క్రెటాకు 2026 ఆర్థిక సంవత్సరం అత్యుత్తమంగా నిలిచింది. ఈ ఏడాది మొత్తం 2,01,921 యూనిట్లు విక్రయించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 4 శాతం పెరిగాయి. వరుసగా మూడేళ్ల పాటు అధిక అమ్మకాలు నమోదు చేయడం ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది.
అయితే, 2027 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో అమ్మకాలు కొంత తగ్గాయి. ఈ కాలంలో క్రెటా & క్రెటా ఎలక్ట్రిక్ కలిపి 89,727 యూనిట్లు విక్రయించారు. గత ఏడాది ఇదే కాలంలో 99,345 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో అమ్మకాల్లో 10 శాతం తగ్గుదల నమోదైంది.
ఇది కూడా చదవండి: యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
కొత్త మోడళ్లు.. పెరిగిన ఆకర్షణ
2024 జనవరిలో అప్‌డేటెడ్ క్రెటాను హ్యుందాయ్ లాంచ్ చేసింది. ఆ తర్వాత 2025 జనవరిలో క్రెటా ఎలక్ట్రిక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ రెండు మోడళ్లు కలిసి 2026 సెప్టెంబర్ నాటికి దేశీయంగా సుమారు 5.3 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు అంచనా.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ & ఎలక్ట్రిక్ రూపాల్లో క్రెటా అందుబాటులో ఉంది. సాధారణ క్రెటాలో మూడు ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. 115 హెచ్‌పీ సామర్థ్యంతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 160 హెచ్‌పీ సామర్థ్యంతో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 116 హెచ్‌పీ సామర్థ్యంతో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. వీటికి నాలుగు గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. మొత్తం 27 వేరియంట్లలో ఈ కారు లభిస్తోంది.
భద్రతకు ప్రాధాన్యం
క్రెటా అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో పాటు EBD సదుపాయాలు ఉన్నాయి. ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే, వేరియంట్‌ను బట్టి లీటరుకు 17.4 నుంచి 21.8 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఈ మైలేజీ గణాంకాలు ARAI ధ్రువీకరణ ఆధారంగా ఉన్నాయి. కారు ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.10.91 లక్షల నుంచి రూ.20.14 లక్షల వరకు ఉన్నాయి.
ఎగుమతుల్లోనూ క్రెటా దూకుడు
క్రెటా దేశీయ మార్కెట్‌కే పరిమితం కాలేదు. విదేశీ మార్కెట్లలోనూ తన ఉనికిని చాటుకుంటోంది. 2026 ఆగస్టు నాటికి మొత్తం 2,95,994 యూనిట్లను ఎగుమతి చేశారు. 2018 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 50,820 యూనిట్లు విదేశాలకు వెళ్లాయి. 2024లో ఎగుమతులు 3,859 యూనిట్లకు పడిపోయాయి. ఆ తర్వాత క్రమంగా పెరిగి 2025లో 4,314 యూనిట్లు, 2026లో 6,496 యూనిట్లకు చేరాయి. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 2,338 యూనిట్లను ఎగుమతి చేశారు.
ఇది కూడా చదవండి: మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
2027లో కొత్త తరం క్రెటా?
క్రెటా అభిమానులకు మరో ఆసక్తికరమైన వార్త ఉంది. కొత్త తరం క్రెటాను హ్యుందాయ్ 2027లో భారత మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మోడల్‌లో రెండో తరం కియా సెల్టోస్‌కు ఆధారమైన K3 ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే అవకాశముందని అంచనా.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















