Hyundai CNG Sales: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
Hyundai CNG Cars: హ్యుందాయ్ సీఎన్‌జీ సేల్స్ మనదేశంలో పెరుగుతున్నాయి. 2024 అక్టోబర్‌లో హ్యుందాయ్ కార్లకు సంబంధించి మొత్తం సేల్స్‌లో 15 శాతం వరకు సీఎన్‌జీ మోడల్స్‌నే ఉండటం విశేషం.
CNG Cars Sales: మనదేశంలో సీఎన్‌జీ వాహనాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. 2024 అక్టోబర్‌లో హ్యుందాయ్ తన సేల్స్ రిపోర్టును విడుదల చేసింది. అమ్ముడు పోయిన మొత్తం కార్లలో 15 శాతం వరకు సీఎన్‌జీనే కావడం ఈ రిపోర్టులో స్పెషల్. ప్రస్తుతం హ్యుందాయ్ మూడు సీఎన్‌జీ మోడల్స్‌ను విక్రయిస్తుంది. అవే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ ఎక్స్‌టర్. వీటిలో ఎక్స్‌టర్, గ్రాండ్ ఐ10 నియోస్ కార్లు హ్యుందాయ్ హై-సీఎన్‌జీ డ్యూయో కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉన్నాయి. అంటే వీటిలో రెండు సీఎన్‌జీ సిలిండర్లను బూట్ ఫ్లోర్ కింద అందిస్తారన్న మాట. దీని కారణంగా ఈ కార్లలో బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది.
ఈ మూడు నగరాల్లోనే ఎక్కువగా...
2024 జనవరి నుంచి అక్టోబర్ మధ్యలో పుణే, న్యూఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో సీఎన్‌జీ మోడల్స్ ఎక్కువగా అమ్ముడుపోయాయని హ్యుందాయ్ తన నివేదికలో పేర్కొంది. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ సీఎన్‌జీ అమ్మకాల పరంగా టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి. 2021-22లో సీఎన్‌జీ మోడల్స్ అమ్మకాలు మొత్తం కార్ల సేల్స్‌లో 9.1 శాతం ఉండగా... అది 2023-24 నాటికి 11.4 శాతానికి చేరింది. గత నెలలో అది ఏకంగా 15 శాతం మార్కును టచ్ చేసింది.
Also Read: సేల్స్‌లో దూసుకుపోతున్న రెనో 7 సీటర్ కారు - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య హ్యుందాయ్ దేశీయ అమ్మకాల్లో సీఎన్‌జీ మోడల్స్ వాటా 12.8 శాతంగా ఉంది. మొత్తం హ్యుందాయ్ ఆరా సేల్స్‌లో 90.6 శాతం వాటా సీఎన్‌జీ వెర్షన్‌దే కావడం విశేషం. హ్యుందాయ్ ఎక్స్‌టర్ సేల్స్‌లో 39.7 శాతం, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సేల్స్‌లో 17.4 శాతం సీఎన్‌జీ వెర్షన్‌వే ఉన్నాయి.
అర్బన్ మార్కెట్లలో కూడా సీఎన్‌జీ మోడల్స్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో సీఎన్‌జీ వాహనాల సేల్స్ 8.8 శాతంగా ఉండగా, 2023-24 నాటికి అవి 10.7 శాతానికి చేరుకున్నాయి. ఇక రూరల్ మార్కెట్లో ఈ జంప్ మరింత భారీగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూరల్ మార్కెట్లలో సీఎన్‌జీ వాహనాల సేల్స్ 7.1 శాతంగా ఉండగా, 2023-24 నాటికి అవి 12 శాతానికి చేరుకున్నాయి.
మైలేజీనే కారణమా?
పెట్రోల్, డీజిల్ వేరియంట్ల కంటే మైలేజీ ఎక్కువ ఇవ్వడంతో పాటు సీఎన్‌జీ ధర తక్కువ కావడం కూడా వీటి సేల్స్ పెరగడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. ఉదాహరణకు హ్యుందాయ్ ఆరా పెట్రోల్ వేరియంట్ 17 నుంచి 20.5 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది. అదే సీఎన్‌జీ వేరియంట్ మాత్రం 22 నుంచి 28 కిలోమీటర్ల మైలేజీని డెలివర్ చేయనుంది. ఇక ఫ్యూయల్ రేటు విషయానికి వస్తే... హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109గా ఉండగా... సీఎన్‌జీ కేజీ ధర కేవలం రూ.92 మాత్రమే. దీని కారణంగా ప్రజలు సీఎన్‌జీ వేరియంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ సీఎన్‌జీ ఫ్యూయల్ ఫిల్లింగ్ సెంటర్లు పెట్రోల్ బంకులు కనిపించినంత విరివిగా కనిపించవు. ఇవి కొంటే ఎదురయ్యే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని సీఎన్‌జీ కారు కొనుక్కోవడం ముఖ్యం.
Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!