Toyota Innova Crysta Loan: మోస్ట్ వాంటెడ్ కార్ 'ఇన్నోవా క్రిస్టా' కొనాలంటే ఎంత లోన్ వస్తుంది, ఎంత జీతం ఉండాలి?
Toyota Innova Crysta EMI Details: టయోటా ఇన్నోవా క్రిస్టా ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.99 లక్షల నుంచి రూ. 26.55 లక్షల వరకు ఉంటుంది. తెలుగు నగరాల్లో దాని బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 24.79 లక్షలు.

Toyota Innova Crysta Down Payment and EMI Details: టయోటా ఇన్నోవా గురించి తెలీనివాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఈ కార్ కొనకపోయినా, బాడుగకు మాట్లాడుకుని దూర ప్రయాణాలు చేసేవాళ్ల ఫస్ట్ ఛాయిస్ దాదాపుగా ఈ కారే. బండి బాడీలో గట్టిదనం, హుందాతనం, సీటింగ్ సౌకర్యం వంటివి ఇన్నోవాని ఇష్టపడేలా చేస్తాయి. ఇన్నోవాలో క్రిస్టా మోడల్ కూడా మార్కెట్లో ఉంది, ఈ మోడల్‌ను తొలిసారి 2016లో లాంచ్ చేశారు. టయోటా ఇన్నోవా క్రిస్టా విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు చాలాసార్లు అప్‌డేట్ అయింది. వీటిలో, 2020 ఫేస్‌లిఫ్ట్ ఒక కీలక అప్‌డేట్. ఆ సమయంలో, ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటోతో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ కారులో 7-సీటర్, 8-సీటర్ కాన్పిగరేషన్లు ఉన్నాయి. ఇన్నోవా క్రిస్టా ఇప్పటికీ మార్కెట్‌లో దుమ్ము రేపుతోంది, చాలామందికి మోస్ట్ వాంటెడ్ కార్‌గా నిలిచింది. మీరు కూడా టయోటా ఇన్నోవా క్రిస్టా కొనాలని ప్లాన్ చేస్తుంటే, డబ్బు మొత్తం ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు, ఫైనాన్స్ తీసుకోవచ్చు.
టయోటా ఇన్నోవా క్రిస్టా ఆన్-రోడ్ ధర ఎంత?
టయోటా ఇన్నోవా క్రిస్టా ఎక్స్-షోరూమ్ ధర (Toyota Innova Crysta ex-showroom price) రూ. 19.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్-ఎండ్ ఎక్స్-షోరూమ్ రేటు రూ. 26.55 లక్షల వరకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో, దీని బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర (Toyota Innova Crysta on-road price) దాదాపు రూ. 24.79 లక్షలు అవుతుంది. ఆన్-రోడ్ ధరలో... ఎక్స్-షోరూమ్ ధర, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కారు బీమా, ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి.
ప్రతి నెలా EMI ఎంత కట్టాలి?
హైదరాబాద్ లేదా విజయవాడలో, టయోటా ఇన్నోవా క్రిస్టా బేస్ వేరియంట్‌ను రూ. 4.79 లక్షల డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, బ్యాంకు నుంచి రూ. 20 లక్షల లోన్ వస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ బాగుండడం వల్ల బ్యాంక్ మీకు 9 శాతం వడ్డీ రేటుకు ఈ లోన్ మంజూరు చేసిందనుకుందాం. మీరు ఈ రుణాన్ని 5, 6 లేదా 7 సంవత్సరాల్లో తిరిగి తీర్చేలా తీసుకుంటుంటే, 9 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలో ఇప్పుడు చూద్దాం:
* 5 సంవత్సరాల కాల పరిమితితో రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో, 60 నెలల పాటు ప్రతి నెలా 41,517 రూపాయలు EMI చెల్లించాలి.
* 6 సంవత్సరాల కాల పరిమితితో రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో, 72 నెలల పాటు ప్రతి నెలా 36,051 EMI రూపాయలు చెల్లించాలి.
* 7 సంవత్సరాల కాల పరిమితితో రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో, 84 నెలల పాటు ప్రతి నెలా 32,178 EMI రూపాయలు చెల్లించాలి.
బ్యాంక్ వడ్డీ రేటు పూర్తిగా మీ క్రెడిట్ స్కోర్, ఆదాయ వనరులు, క్రెడిట్ హిస్టరీ, బ్యాంక్ పాలసీ ఆధారంగా నిర్ణయమవుతుంది. మీరు ఇన్నోవా క్రిస్టా కొనాలని ఆలోచిస్తుంటే, మీ జీతం రూ.లక్ష కంటే ఎక్కువ ఉండి, ఇతర EMIలు లేకపోతేనే ఈ కారు కొనాలన్నది నిపుణుల సలహా.
టయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్లు
ఈ కారులో అమర్చిన LED హెడ్‌ల్యాంప్‌లు కారుకు లవ్లీ లుక్స్ ఆపాదించాయి. ఇన్నోవా క్రిస్టా క్యాబిన్‌లో 20.32 సెం.మీ. డిస్‌ప్లే ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. దీంతో మీ మొబైల్ ఫోన్‌ను కారుతో సులభంగా కనెక్ట్ చేయవచ్చు. ఇలాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇంకా చాలా ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లు
ప్రయాణీకుల భద్రత విషయానికి వస్తే... ఈ కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. టయోటా ఇన్నోవా క్రిస్టా G & GX వేరియంట్లలో 3 ఎయిర్‌బ్యాగ్‌లు వస్తాయి. VX & ZX వేరియంట్లలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.






















