Honda Flex Fuel Bike: టీవీఎస్ బాటలో హోండా కంపెనీ - 2024 వరకు సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ విడుదల!
హోండా కంపెనీ సరికొత్త టూవీలర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2024 వరకు దేశీ మార్కెట్లో ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
జపాన్ ఆటో మోబైల్ దిగ్గజ కంపెనీ హోండా(Honda) అదిరిపోయే టూవీలర్ ను అందుబాటులోకి తేబోతున్నది. సరికొత్త ఫ్లెక్స్ ప్యూయల్ ఇంజిన్ తో రన్ అయ్యే బైక్ ను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ బైక్ సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించింది. ఈ బైకులను 2024 వరకు అందుబాటులోకి తీసురాబోతున్నట్లు, ఢిల్లీ వేదికగా జరిగిన అంతర్జాతీయ బయో ఫ్యూయెల్ కాన్ఫరెన్స్ లో హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సీఈవో అట్సుషి ఒగాటా ప్రకటించారు.
భారత్ లో హోండా రెండో కంపెనీ!
హోండా తాజా ప్రకటనతో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ తో బైకులను విడుదల చేసే రెండో కంపెనీగా నిలవనుంది. ఇప్పటికే భారత్ లో టీవీఎస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ బైక్ లాంచ్ అయ్యింది. TVS Apache RTR 200 Fi E100 పేరుతో ఈ బైక్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దేశీయ మార్కెట్లోకి తొలి ఫ్లెక్సీ-ప్యూయల్ బైక్ ను విడుదల చేసిన కంపెనీగా టీవీఎస్ నిలిచింది. అయితే, ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఈ రకమైన బైకులను తీసుకొచ్చిన కంపెనీగా హోండా రికార్డు నెలకొల్పింది. 2009లోనే బ్రెజిల్ లో హోండా CG150 టైటాన్ మిక్స్ పేరుతో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ బైకులను విడుదల చేసింది. ఆ తర్వాత NXR 150 Bros Mix, BIZ 125 Flex మోడళ్లను కూడా ఇదే రకమైన ఇంజిన్ తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి హోంగా కంపెనీ నుంచి వచ్చిన తొలి ఫ్లెక్స్-ఇంధన మోడల్ E20. గ్యాసోలిన్, 20% ఇథనాల్ కలయికతో రన్ అవుతుంది. పలు కారణాలతో దశలవారీగా ఈ బైక్ ను నిలిపివేసింది.
విదేశాల్లో ఇప్పటికే ఫ్లెక్స్ ప్యూయల్ బైకుల అమ్మకం
విదేశాల్లో ఇప్పటికే ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ బైకులను అమ్ముతున్న హోండా కంపెనీ.. త్వరలో భారత్ లో పరిచయం చేయబోతున్నది. 2024 వరకు కనీసం ఒక్క మోడల్ నైనా విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నా, ఒకటి కంటే ఎక్కువ మోడళ్లను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ తో వస్తున్న బైకులు పెట్రోల్ తో పాటు ఇథనాల్ తో పని చేస్తాయి. ఈ బైకులకు సంబంధించిన లాంచ్, ధర, మోడల్ సహా ఎలాంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల తయారీ పెంచాలని గడ్కరీ సూచన
పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని టూ వీలర్స్ ను తయారు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆయా కంపెనీలకు సూచించారు. అంతర్జాతీయ బయో ఫ్యూయెల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన పలు ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను లాంచ్ చేశారు. రానున్న రోజుల్లో పెట్రో ఉత్పత్తుల దిగుమతులను తగ్గించేందుకు వీలు కలిగేలా ఫ్లెక్స్-ప్యూయల్ వాహనాలను ఎక్కువ సంఖ్యలో విడుదల చేయాలని కోరారు.
టయోటా నుంచి తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనం లాంచ్
ఈ సదస్సులో టయోటా కంపెనీ చెందిన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ వాహనం అయిన ‘ది కరోలా ఆల్టిన్’ను గడ్కరీ విడుదల చేశారు. ఈ వాహనం ఇథనాల్, పెట్రోల్ మిశ్రమంతో నడుస్తుంది. పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. ఈ కారు 83 శాతం ఇథనాల్ తో రన్ అవుతుంది. ఇక ఈ వాహనం హుడ్ కింద, 102 hp, 142 Nm టార్క్‌తో కూడిన 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. గరిష్టంగా 163 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 73hp ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడి ఉంటుంది. ఇది 1.3kWh బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది. అమెరికా, బ్రెజిల్, కెనడాలో ఫ్లెక్స్- ఫ్యూయల్ వాహనాల వినియోగం సర్వసాధారణం. యునైటెడ్ స్టేట్స్ రోడ్లపై 21 మిలియన్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు నడుస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.