Hero Splendor Plus లేదా TVS Star City Plus.. మీకు ఏ బైక్ కొనడం మంచిది? ధర, ఫీచర్లు ఇవే
Hero Splendor Plus బైక్ దేశంలో అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్న వాటిలో ఒకటి. అదే విధంగా టీవీఎస్ స్టార్ సిటీ సైతం తక్కువ ధరలో లభిస్తూ, తక్కువ మెయింటనెన్స్ కస్టమర్లను ఆకర్షిస్తోంది.

భారత మార్కెట్లో ఇప్పుడు బైక్‌లు, స్కూటర్లు విక్రయాలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో టూవీలర్ల కొనుగోలు గతంలో కంటే చౌకగా మారింది. దీనికి కారణం GST తగ్గించడమేనని కేంద్రం చెబుతోంది. Hero Splendor Plus ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 73,903. అదే సమయంలో TVS Star City Plus ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 72,500గా ఉంది. అయితే ఈ రెండు బైక్‌ల ఇంజిన్, పనితీరు, ఫీచర్ల గురించి తెలుసుకున్నాక మీకు ఏ బైక్ సరైనదో కొనుగోలు చేయవచ్చు.
Hero Splendor మైలేజ్ ఎంత?
అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్‌లలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. ఈ మోటార్‌సైకిల్‌లో ఎయిర్-కూల్డ్, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్, OHC ఇంజిన్ ఉంది. స్ప్లెండర్ ప్లస్ ఇంజిన్ 8,000 rpm వద్ద 5.9 kW శక్తిని, 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో వస్తుంది.
Hero Splendor Plus ఒక లీటర్ పెట్రోల్‌తో గరిష్టంగా దాదాపు 70-73 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ బైక్ ఇంధన ట్యాంక్ 9.8 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఒకసారి ట్యాంక్ నింపితే దాదాపు 700 కిలోమీటర్ల వరకు మీరు జర్నీ చేయవచ్చు. అయితే రోడ్లను బట్టి, ట్రాఫిక్ ఆధారంగా మైలేజీ ఆధారపడి ఉంటుంది. ఈ బైక్ తక్కువ ధరకు మంచి మైలేజ్ ఇవ్వడం వల్ల చాలా మంది కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.
TVS Star City Plus మైలేజ్ ఎంత?
TVS బైక్‌లు మంచి మైలేజ్ కారణంగా, తక్కువ ధర ఉండటంతో రైడర్లు ఇష్టపడతారు. TVS Star City Plus బైక్ BS-6 ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో 109 CC ఇంజిన్, 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు అని టీవీఎస్ సంస్థ చెబుతోంది.
బైక్ ఇంజిన్ 7,350 rpm వద్ద 8.08 bhp గరిష్ట శక్తిని, 4,500 rpm వద్ద 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్టార్ సిటీ ప్లస్ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో 17 అంగుళాల వీల్, ఇది ట్యూబ్‌లెస్ టైర్‌లతో వస్తుంది. ఈ విధంగా మీరు రెండింటి ధర, ఫీచర్లు, మైలేజ్ గురించి తెలుసుకుని ఏదైనా ఒక బైక్‌ను ఎంచుకోవచ్చు.
బైక్ నడిపేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
బైక్ ప్రయాణాన్ని సురక్షితంగా మార్చుకోవడానికి నాణ్యమైన హెల్మెట్ ధరించాలి. ఐఎస్‌ఐ (ISI) ముద్ర ఉన్న హెల్మెట్‌ను ధరించడం వల్ల ప్రమాద సమయాల్లో తలకి గాయాలు కాకుండా 80 శాతం వరకు రక్షణ లభిస్తుంది. కేవలం వాహనం నడిపే వారే కాకుండా, వెనుక కూర్చునే వారు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ప్రయాణం ప్రారంభించే ముందే బైక్ కండిషన్‌ను ఒకసారి తనిఖీ చేసుకోవాలి. ముఖ్యంగా బ్రేకులు, టైర్లలో గాలి, హెడ్ లైట్లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చూసుకోవడం వల్ల ఆకస్మిక ప్రమాదాలను నివారించవచ్చు.
అతివేగం ఎప్పుడూ ప్రమాదకరమే
ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, పరిమిత వేగంతో వెళ్లడం వల్ల వాహనంపై నియంత్రణ ఉంటుంది. ముఖ్యంగా మలుపుల వద్ద, జంక్షన్ల వద్ద వేగాన్ని తగ్గించాలి. ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇండికేటర్లను ఉపయోగించాలి. కుడి వైపు నుండి మాత్రమే ఓవర్‌టేక్ చేయాలి. వర్షం పడుతున్నప్పుడు లేదా రోడ్లు సరిగ్గా లేనప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. వాహనాల మధ్య సరైన దూరం పాటించడం వల్ల ముందున్న వాహనం అకస్మాత్తుగా ఆగినా బ్రేక్ వేయడానికి అవకాశం ఉంటుంది.
మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం మాత్రమే కాదు, అది ప్రాణాపాయం. ప్రయాణంలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడటం లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఫోకస్ ఉండదు. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది. వాహనం నడిపేటప్పుడు మన ఏకాగ్రత పూర్తిగా రోడ్డుపైనే ఉండాలి.






















