యూత్‌కు బంపర్ న్యూస్, Harley Davidson చౌకైన బైక్ Sprint లాంచింగ్ - ధర, ఫీచర్లు ఇవిగో
Harley Davidson Sprint Affordable Bike: హార్లే-డేవిడ్సన్ కంపెనీ, ఈసారి, తన బైక్ కోసం పూర్తిగా కొత్త ఆర్కిటెక్చర్‌ను సిద్ధం చేసింది. భవిష్యత్తులో రాబోయే అనేక కొత్త మోడళ్లకు కూడా దీనినే ఉపయోగించనుంది.

Harley Davidson Sprint Launch Date And Price: హార్లే-డేవిడ్సన్ కంపెనీ ఇప్పటి వరకు హై-ఎండ్ & ప్రీమియం బైక్‌లను మాత్రమే తయారు చేసింది. కానీ, ఈ కంపెనీ ఇప్పుడు కొత్త అడుగు వేయబోతోంది. ఈసారి హార్లే డేవిడ్సన్ బడ్జెట్ రేంజ్‌లో కొత్త మోటార్ సైకిల్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ టూవీలర్ పేరు స్ప్రింట్ (Sprint). కొత్త కస్టమర్లు & యువ రైడర్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను ప్రత్యేకంగా రూపొందించింది.
హార్లే-డేవిడ్సన్ Sprint బైక్ క్లాసిక్ & మోడర్న్ స్టైల్‌లను కలిపిన ఆకర్షణీయమైన డిజైన్‌తో కనిపిస్తుంది. ముందు భాగంలో ఉన్న రౌండ్ LED హెడ్‌ల్యాంప్ దీనికి రెట్రో లుక్ ఇస్తూ, రోడ్డు మీద ప్రత్యేకంగా నిలబెడుతుంది. స్లీక్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ & క్లీన్ బాడీ లైన్స్ రైడర్‌కి ప్రీమియం ఫీల్ కలిగిస్తాయి. బ్లాక్ అవుట్ ఇంజిన్ & స్టైలిష్ అల్లాయ్ వీల్స్ మొత్తం బైక్ లుక్స్‌ను మరింత స్పోర్టీగా చూపిస్తాయి.
ఇది ఇప్పటివరకు అత్యంత చౌకైన హార్లే బైక్!
నివేదికల ప్రకారం, ఈ కొత్త Harley Davidson Sprint బైక్ ధర దాదాపు 6,000 అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు 5 లక్షల రూపాయలు (Harley Davidson Sprint Price) ఉండవచ్చు. ఇది నిజమైతే, హార్లే-డేవిడ్సన్ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత చౌకైన మోటార్ సైకిళ్లలో ఇది ఒకటి అవుతుంది. ఈ కొత్త బైక్‌ను మొదట 2025 EICMA మోటార్ సైకిల్ షోలో ప్రవేశపెట్టనున్నారు. కొన్ని వారాల తర్వాత దీనిని ప్రపంచవ్యాప్తంగా పెద్ద దేశాల్లో లాంచ్ చేస్తారు.
Harley Davidson కంపెనీ, ఈసారి, స్ప్రింట్ బైక్ కోసం పూర్తిగా కొత్త నిర్మాణాన్ని అభివృద్ధి చేసింది, రాబోయే కాలంలో తయారయ్యే కొత్త మోడళ్లకు కూడా దీనిని ఉపయోగిస్తుంది. దీని అర్ధం.. భవిష్యత్తులోనూ మరిన్ని చౌకైన బైకులను హార్లే డేవిడ్సన్ రోడ్లపైకి దించుతుంది. స్ప్రింట్‌తో హార్లే డేవిడ్సన్ కొత్త విభాగంలోకి ప్రవేశించడమే కాకుండా, మొదటిసారిగా హార్లే వంటి బ్రాండెడ్ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది.
ఎంట్రీ లెవల్ బైక్‌ను తీసుకురావడానికి గతంలోనూ ఒక ప్రయత్నం
నిజానికి, హార్లే-డేవిడ్సన్ తక్కువ ధర బైక్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, ఈ కంపెనీ, భారతదేశం వంటి దేశాల కోసం Street 750 అనే ఎంట్రీ లెవల్ బైక్‌ను విడుదల చేసింది, ఈ బండిని భారతదేశంలోనే తయారు చేసింది. అయితే, స్ట్రీట్ 750 ఆశించిన మేర అమ్మకాలను సాధించలేకపోయింది. దీంతో, కంపెనీ మోటార్ సైకిల్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు, హార్లే స్ప్రింట్ ద్వారా, బడ్జెట్ విభాగంలో కస్టమర్లను ఆకర్షించడానికి & ఎక్కువ మందిని చేరుకోవడానికి కంపెనీ మళ్ళీ ప్రయత్నిస్తోంది.



















