Tesla Model Y : భారత్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఎలక్ట్రిక్ కార్ల కింగ్ టెస్లా! ధర, ఫీచర్లు, లాంచ్ డేట్ ఇదే!
Tesla India Launch:భారత్‌లో టెస్లా అడుగు పెడుతోంది. ఈ నెలలోనే తొలి షోరూమ్ ప్రారంభం కానుంది. Model Y ప్రారంభోత్సవం చేయబోతోంది ఈ కార్ల కింగ్ కంపెనీ

First Tesla Car in India:భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌ను ఎప్పటి నుంచి ఊరిస్తున్న ఎగ్జైటింగ్ విషయం ఏదైనా ఉందీ అంటే అది టెస్లానే. చాలా మంది ఈ కారు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక ఆ ఎదురు చూపులకు పుల్‌స్టాప్ పడే టైం వచ్చింది. జులై 15న తొలి షోరూం ప్రారంభంకానుంది. భారత్ మార్కెట్‌లోకి తన వై మోడల్‌ను టెస్లా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. అలాంటి తరుణంలో ఇండియాలో అడుగుపెడుతోంది అమెరికన్ కంపెనీ టెస్లా. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ భారత్‌లో జులై 15న ఓ షోరూం ప్రారంభించబోతోంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి అమ్మకాలు షురూ చేయనుంది. ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడుపోయిన బెస్ట్ సెల్లింగ్ Tesla Model Yతోనే ఇండియాలో పరుగులు పెట్టాలని చూస్తోంది.
భారత్ మార్కెట్‌లో Tesla Model Y ధర ఎంత?
భారత్‌లోకి వస్తున్న టెస్లా తన మోడల్ Y కారును కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా దిగుమతి చేయబోతోందని సమాచారం. అందుకే ఖరీదు ఎక్కువగానే ఉండొచ్చని చెబుతున్నారు. ఇంపోర్ట్ టాక్స్‌లు కారణంగా ఈ Tesla Model Y కారు ధర దాదాపు రూ. 50 - రూ. 70 లక్షల వరకు ఉంటుందని కొందరు అంటే... ఇంకా ఎక్కువ ఉంటుందని అంటున్నారు. అంటే 90 లక్షల వరకు ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలో మధ్యతరగతి మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వారిని టార్గెట్ చేస్తూ ధర తగ్గించే అవకాశాలు ఉన్నాయనే వాదన లేకపోలేదు. అందుకే దీని ధర 21 లక్షల కంటే ఎక్కువ ఉండకపోవచ్చని అంటున్నారు.
ముంబై చేరుకున్న Tesla Model Y కార్లు
జులై 15న ప్రారంభించబోయే షోరూంలో అమ్మకాలు సాగించేందుకు ఐదు యూనిట్లను ముంబై వచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. చైనాలోని షాంఘైలోని టెస్లా ఫ్యాక్టరీ నుంచి ఐదు యూనిట్లు దిగుమతి చేసినట్టు బ్లూమ్‌బెర్గ్ రిపోర్టు చేసింది. ఈ కార్ల వాస్తవ ధర 27.7 లక్షలు ఉంటుందని అయితే 21 లక్షలకుపైగా ఇంపోర్ట్ ట్యాక్స్ పడుతుందని అంటున్నారు. అందుకే ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఏవిధంగా లెక్కలు వేసుకున్నా 50 లక్షల కంటె తక్కువకు ఈ కారు రోడ్డుపైకి రాదని అంచనాలు ఉన్నాయి.
Tesla Model Y స్పెషల్ ఏంటీ?
టెస్లా మోడల్ Y 3 ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతానికి భారత్‌లో RWD, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్‌లలో లభించవచ్చని చెబుతున్నారు.
RWD వెర్షన్ : CLTC 593 కిలోమీటటర్ల రేంజ్‌లో ఉంటుందని చెబుతున్నారు. 0-100 km/h వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుందట.
లాంగ్ రేంజ్ AWD వెర్షన్: దీని CLTC పరిధి 750 కి.మీ అని కంపెనీ చెబుతోంది. 0-100 km/h వేగాన్ని 4.3 సెకన్లలో అందుకుంటుందని చెబుతున్నారు.
డిజైన్ విషయంలో Tesla Model Y ప్రత్యేకతలేంటీ?
లోపల ఎక్కువ స్పేస్ ఉండేలా డిజైన్ చేశారు. 15.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. బ్యాక్ సీట్‌లో ఉండే ప్రయాణికుల కోసం కూడా 8 ఇంచ్‌ల టచ్‌స్క్రీన్ ఉంటుంది. పూర్తిగా మడిచి పెట్టగల రెండు సీట్లు ఉంటాయి.
Tesla Model Y భద్రత ప్రమాణాలు ఎలా ఉన్నాయి?
అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు, సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యం, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్ కలిగి ఉంది. భద్రత విషయంలో ది బెస్ట్ అని చెప్పవచ్చు. సాఫ్ట్‌వేర్, ఫీచర్ల కోసం ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు కలిగి ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే అందులో ఉన్న వారి ప్రాణాలు కాపాడిన ఘటనలు చాలానే ఉన్నాయి.
ప్రస్తుతానికి మొదటి షోరూంను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ప్రారంభించిన టెస్లా తర్వాత ఢిల్లీలో మరో షోరూం తెరవబోతోంది. తర్వాత బెంగళూరులో షోరూం స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతానికి చైనా నుంచి కార్లు దిగుమతి చేసుకొని విక్రయించే సంస్థ సేల్స్ పెరిగితే ఇక్కడే అసెంబుల్ యూనిట్ లేదా తయారీ యూనిట్ ప్రారంభించే అవకాశం ఉంది.




















