Regenerative Braking In EVs: ఫుల్ ఛార్జింగ్‌తో కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నారా? ఎలక్ట్రిక్ కారు డ్రైవర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం!
Electric Car Regenerative Braking: మీ EVని 100% ఛార్జింగ్ చేశారా? అయితే వన్ పెడల్ డ్రైవింగ్ పని చేయకపోవచ్చు. BMS పాత్ర, డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

EV Regenerative Braking: ఎలక్ట్రిక్ కార్లు వాడుతున్న వారికి వన్ పెడల్ డ్రైవింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ మధ్య ప్రయాణించేటప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. యాక్సిలరేటర్‌పై నుంచి కాలు తీస్తే చాలు.. కారు వేగం దానంతట అదే తగ్గుతుంది. చాలాసార్లు బ్రేక్ పెడల్ ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండదు.
అయితే, రాత్రంతా కారును ఛార్జింగ్‌లో ఉంచి ఉదయం 100 శాతం బ్యాటరీతో ప్రయాణం ప్రారంభిస్తే మాత్రం ఓ విచిత్రమైన అనుభవం ఎదురుకావచ్చు. యాక్సిలరేటర్‌పై నుంచి కాలు తీసినా కారు వేగం తగ్గదు. సాధారణ పెట్రోల్ కారులా ముందుకు దూసుకెళ్తుంది. దీంతో, కారులో ఏదైనా సమస్య వచ్చిందేమోనని ఆందోళన చెందుతారు. కానీ ఇది లోపం కాదు. బ్యాటరీని రక్షించేందుకు కారు స్వయంగా తీసుకునే నిర్ణయం. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది?
రీజెనరేటివ్ బ్రేకింగ్ ఎలా పనిచేస్తుంది?
సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లలో బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ ప్యాడ్లు డిస్కులపై ఒత్తిడి కలిగిస్తాయి. దీంతో ఘర్షణ ఏర్పడి వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో.. వాహనం కదలడానికి ఉపయోగించిన శక్తిలో కొంత భాగం వృథా అవుతుంది.
కానీ ఎలక్ట్రిక్ కార్లలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ రెండు విధాలుగా పని చేస్తుంది. యాక్సిలరేటర్ నొక్కినప్పుడు బ్యాటరీ నుంచి విద్యుత్ అందుకుని చక్రాలను తిప్పుతుంది. అదే యాక్సిలరేటర్‌పై నుంచి కాలు తీసినప్పుడు చక్రాల కదలికతో మోటార్ జనరేటర్‌లా పని చేస్తుంది. అప్పుడు వాహనం వేగం వల్ల ఏర్పడే శక్తిని విద్యుత్‌గా మారుస్తుంది. ఆ విద్యుత్ తిరిగి బ్యాటరీలోకి చేరుతుంది. ఈ ప్రక్రియనే రీజెనరేటివ్ బ్రేకింగ్ అంటారు. దీనివల్ల కారు వేగం తగ్గడమే కాకుండా కొంత అదనపు ప్రయాణ దూరానికి అవసరమైన శక్తి కూడా అందుతుంది.
100 శాతం ఛార్జింగ్ అయితే రీజెన్ ఎందుకు ఆగుతుంది?
ఇక్కడే అసలు విషయం ఉంది. బ్యాటరీని నీటితో నిండిన బకెట్‌లా ఊహించుకోండి. బకెట్ సగం నిండినప్పుడు మరికొంత నీటిని పోయవచ్చు. కానీ పూర్తిగా నిండిన తర్వాత మళ్లీ నీరు పోస్తే బయటకు పొంగిపోతుంది. లిథియం అయాన్ బ్యాటరీల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. బ్యాటరీ 40, 60 లేదా 80 శాతం ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు, చక్రాల నుంచి తిరిగి వచ్చే విద్యుత్‌ను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. కానీ 100 శాతం చేరుకున్నప్పుడు అదనపు విద్యుత్‌ను స్వీకరించడానికి తగినంత ఖాళీ ఉండదు. అలాంటి సమయంలో బ్రేకింగ్ ద్వారా భారీ మొత్తంలో విద్యుత్ బ్యాటరీలోకి పంపితే సెల్స్‌లో వోల్టేజ్ పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల బ్యాటరీ వేడెక్కడం, దాని జీవితకాలం తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.
ఇది కూడా చదవండి: భారత EV మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. నవంబర్ 9 నాటికే 3.04 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు
ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ప్రతి ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) ఉంటుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయినట్లు గుర్తించిన వెంటనే ఇది మోటార్‌కు వెళ్లే ఆదేశాలను నియంత్రిస్తుంది. దీంతో రీజెనరేటివ్ బ్రేకింగ్ తగ్గుతుంది లేదా పూర్తిగా నిలిచిపోతుంది. చలికాలంలోనూ ఇదే పరిస్థితి ఎదురుకావచ్చు. ముఖ్యంగా బ్యాటరీ ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు విద్యుత్‌ను తిరిగి స్వీకరించే సామర్థ్యం తగ్గుతుంది. బ్యాటరీ భద్రత కోసం బీఎంఎస్ రీజెన్‌ను పరిమితం చేస్తుంది.
డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు?
వన్ పెడల్ డ్రైవింగ్‌కు అలవాటు పడిన వారికి రీజెన్ అకస్మాత్తుగా నిలిచిపోవడం ఇబ్బందిగా అనిపించవచ్చు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఇది మరింత జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఉదాహరణకు, కొండపై ఉన్న హోటల్‌లో కారును 100 శాతం ఛార్జ్ చేసి దిగువకు ప్రయాణం ప్రారంభించారనుకుందాం. సాధారణంగా దిగువకు వస్తున్నప్పుడు రీజెనరేటివ్ బ్రేకింగ్ వాహన వేగాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ బ్యాటరీ నిండుగా ఉంటే ఈ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పుడు వాహన వేగాన్ని నియంత్రించేందుకు సాధారణ బ్రేకులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. నిరంతరం బ్రేకులు ఉపయోగిస్తే అవి వేడెక్కే ప్రమాదం ఉంటుంది.
కంపెనీలు తీసుకుంటున్న చర్యలేమిటి?
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు కొన్ని ప్రత్యేక సాంకేతిక పరిష్కారాలను అందిస్తున్నాయి.
బ్లెండెడ్ బ్రేకింగ్: బ్రేక్ పెడల్ నొక్కినప్పుడు రీజెన్ అందుబాటులో లేకపోతే సాధారణ డిస్క్ బ్రేకులు పనిచేస్తాయి. దీంతో డ్రైవర్‌కు సాధారణంగా ఉండే బ్రేకింగ్ అనుభూతి కొనసాగుతుంది.
సాఫ్ట్‌వేర్ రిజర్వ్: కొన్ని కార్లలో బ్యాటరీ పూర్తిగా నిండినట్లు చూపించినా కొంత శక్తి నిల్వకు ఖాళీగా ఉంటుంది. దీనివల్ల ప్రారంభంలో కొంత రీజెన్ అందుబాటులో ఉండవచ్చు.
డ్యాష్‌బోర్డ్ హెచ్చరికలు: రీజెనరేటివ్ బ్రేకింగ్ అందుబాటులో లేనప్పుడు కొన్ని కార్లు డిస్‌ప్లేలో ప్రత్యేక సూచికలను చూపిస్తాయి.
ఇది కూడా చదవండి: పెద్ద ఫ్యామిలీల కోసం 6 సీటర్, 7 సీటర్ SUVలు.. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆప్షన్లు కూడా!
EV యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రోజువారీ ప్రయాణాలకు ప్రతిసారీ 100 శాతం ఛార్జింగ్ అవసరం ఉండదు. ముఖ్యంగా NMC బ్యాటరీ ఉన్న కార్లలో కంపెనీ సూచించిన పరిమితి మేరకు 80 నుంచి 90 శాతం వరకు ఛార్జింగ్ ఉంచడం మంచిది.
LPF బ్యాటరీ ఉన్న కార్లలో బ్యాటరీ సెల్స్ సమతుల్యత కోసం అప్పుడప్పుడు 100 శాతం ఛార్జింగ్ అవసరం కావచ్చు. అలాంటి సందర్భాల్లో రీజెన్ తగ్గే అవకాశాన్ని గుర్తుంచుకోవాలి.
అలాగే కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు పైకి వెళ్లిన ప్రదేశంలోనే బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయకుండా ఉండటం మంచిది. దిగువకు వచ్చే ప్రయాణంలో తిరిగి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను నిల్వ చేసుకునేందుకు కొంత ఖాళీ ఉండాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















