Car Insurance: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
కారు బీమాలో ప్రతి చిన్న మరమ్మతుకూ క్లెయిం చేయడం వల్ల నో క్లెయిం బోనస్ కోల్పోవచ్చు. ఎప్పుడు క్లెయిం చేయాలి? ఎప్పుడు సొంతంగా ఖర్చు పెట్టాలి?

Car Insurance Claiming: కారు కొనాలంటే బీమా తీసుకోవడం తప్పనిసరి. వాహనానికి ప్రమాదం జరిగినప్పుడు లేదా ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ఆర్థిక భారం తగ్గించుకోవడానికి బీమా ఉపయోగపడుతుంది. అయితే కారు బీమా ఉందని ప్రతి చిన్న రిపేర్‌కూ క్లెయిం చేయడం మంచిదేనా అంటే.. కాదనే చెప్పాలి. ఎందుకంటే చిన్న మొత్తానికి క్లెయిం చేసినా భవిష్యత్తులో వచ్చే ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా "నో క్లెయిం బోనస్" (NCB) పోతే తదుపరి ఏడాది బీమా ప్రీమియం పెరగొచ్చు. అందుకే ఎప్పుడు క్లెయిం చేయాలి? ఎప్పుడు సొంత డబ్బుతో మరమ్మతులు చేయించుకోవాలి? అనే విషయాలను తెలివిగా ఆలోచించాలి.
'నో క్లెయిం బోనస్' అంటే ఏమిటి?
కారు బీమా పాలసీ తీసుకున్న తర్వాత వరుసగా క్లెయిం చేయకుండా ఉంటే బీమా సంస్థలు నో క్లెయిం బోనస్ అందిస్తాయి. పాలసీని పునరుద్ధరించే సమయంలో ఈ ప్రయోజనం లభిస్తుంది. సాధారణంగా, ఇది సొంత వాహనానికి జరిగే నష్టానికి సంబంధించిన బీమా ప్రీమియంపై తగ్గింపుగా ఉంటుంది. వరుసగా ఐదేళ్ల పాటు క్లెయిం చేయకుండా ఉంటే ఈ తగ్గింపు గరిష్ఠంగా 50 శాతం వరకు చేరొచ్చు. అయితే.. బోనస్ శాతం, నిబంధనలు అనేవి బీమా సంస్థ, పాలసీని బట్టి మారుతాయి.
ఉదాహరణకు, మీ కారు బీమాలో సొంత వాహన నష్టానికి సంబంధించిన ప్రీమియం ఏడాదికి రూ.20,000 అనుకుందాం. మీకు 50 శాతం NCB ఉంటే, రూ.10,000 తగ్గింపు లభిస్తుంది. అంటే ప్రీమియం భారం గణనీయంగా తగ్గుతుంది.
చిన్న క్లెయిం చేస్తే ఎంత నష్టం?
ఇప్పుడు మీ కారుకు చిన్న గీత లేదా డ్యామేజ్ జరిగిందని అనుకుందాం. దానిని బాగు చేయించడానికి రూ.5,000 ఖర్చవుతుందని అనుకుందాం. మీ పాలసీలో రూ.2,000 తప్పనిసరి మినహాయింపు మొత్తం ఉంటే, అర్హత కలిగిన క్లెయిం కింద బీమా సంస్థ నుంచి సుమారు రూ.3,000 మాత్రమే రావచ్చు.
ఇది కూడా చదవండి: రెట్రో లుక్, మోడ్రన్ టచ్‌తో Vespa ఆల్-న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, ఫీచర్ల వివరాలు
అయితే ఈ చిన్న క్లెయిం కారణంగా మీ NCB ప్రయోజనాన్ని కోల్పోయే అవకాశం ఉంది. దాంతో తదుపరి ఏడాది బీమా ప్రీమియం పెరగొచ్చు. ఇక్కడ, మీరు కోల్పోయే తగ్గింపు విలువ.. బీమా కంపెనీ నుంచి వచ్చిన రూ.3,000 కంటే ఎక్కువగా ఉంటే, చిన్న మరమ్మతు కోసం క్లెయిం చేయడం వల్ల ఈ ప్రయోజనం మీకు అందకపోవచ్చు. అందుకే మరమ్మతు ఖర్చుతో పాటు భవిష్యత్తులో కోల్పోయే NCB విలువను కూడా లెక్కించాలి.
క్లెయిం చేసే ముందు ఈ లెక్కలు వేయండి
1. మరమ్మతు ఖర్చు తెలుసుకోండి: ముందుగా, కారు రిపేర్ కోసం ఎంత ఖర్చవుతుందో అంచనా వేయించండి. అవసరమైతే బీమా సంస్థను కూడా సంప్రదించండి.
2. మీకు వచ్చే మొత్తం లెక్కించండి: తప్పనిసరి మినహాయింపు, ఇతర వర్తించే తగ్గింపులు పోగా బీమా సంస్థ ఎంత చెల్లిస్తుందో తెలుసుకోండి.
3. NCBపై ప్రభావం తెలుసుకోండి: క్లెయిం చేస్తే ప్రస్తుతం ఉన్న బోనస్‌కు, తదుపరి ఏడాది ప్రీమియంకు ఎలాంటి ప్రభావం ఉంటుందో బీమా సంస్థను అడగండి.
4. అదనపు రక్షణలు పరిశీలించండి: మీ పాలసీలో NCB ప్రొటెక్షన్ వంటి అదనపు సదుపాయాలు ఉన్నాయా? వాటి నిబంధనలు ఏమిటో తెలుసుకోండి. ఈ రక్షణ ఉన్నంత మాత్రాన అన్ని క్లెయింలకు బోనస్ అలాగే ఉంటుందని భావించకూడదు.
ఇది కూడా చదవండి: 55hp పవర్, 63Nm టార్క్ ఉన్నా ఈజీ రైడ్ ఇచ్చిన Royal Enfield Himalayan 750.. ఫీచర్లు ఎలా ఉపయోగపడ్డాయి?
పెద్ద ప్రమాదాల విషయంలో మాత్రం జాగ్రత్త
చిన్న గీతలు, స్వల్ప మరమ్మతుల కోసం ప్రతిసారీ బీమా క్లెయిం చేయడం ఆర్థికంగా ప్రయోజనకరం కాకపోవచ్చు. కానీ పెద్ద ప్రమాదం జరిగినప్పుడు, మరమ్మతులకు భారీ మొత్తం అవసరమైనప్పుడు బీమా రక్షణను ఉపయోగించుకోవడం ముఖ్యం. మరీ ముఖ్యంగా.. ఇతర వాహనాలకు లేదా వ్యక్తులకు నష్టం జరిగిన సందర్భాల్లో పాలసీ నిబంధనల ప్రకారం వెంటనే బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి.
కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బీమా ఉన్నంత మాత్రాన ప్రతి చిన్న ఖర్చుకూ డబ్బు తిరిగి పొందాలని భావించకూడదు. ఊహించని భారీ ఆర్థిక నష్టాల నుంచి రక్షణ కల్పించడం కోసం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















