సొంతంగా టాక్సీ నడిపేవాళ్లకు గొప్ప అవకాశం.. 320km రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు.. రూ.4.5 లక్షలే!
eNEG Mobility రూ.4.5 లక్షల ప్రారంభ ధరతో ఎలక్ట్రిక్ టాక్సీని అభివృద్ధి చేస్తోంది. 320km రేంజ్, 30-32kWh బ్యాటరీ, BaaS మోడల్ వివరాలు తెలుసుకోండి.

eNEG Mobility Electric Taxi: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో టాక్సీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నవారికి ఓ కొత్త ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌కు చెందిన eNEG Mobility సంస్థ ప్రత్యేకంగా టాక్సీ డ్రైవర్లు, ఫ్లీట్ ఆపరేటర్లు, షేర్డ్ మొబిలిటీ అవసరాల కోసం ఓ ఎలక్ట్రిక్ టాక్సీని అభివృద్ధి చేస్తోంది. ఈ కారును బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో (కారు ధరలో బ్యాటరీ ధర కలపకుండా) రూ.4.5 లక్షలే ఇవ్వాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
బ్యాటరీతో కలిపి కారును కొనాలనుకునేవాళ్లకు ఆన్‌రోడ్ ధరను రూ.6.49 లక్షలుగా కంపెనీ ప్రతిపాదిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300-320 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ఈ కారును రూపొందిస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న లక్ష్యాలు మాత్రమే. వాహనం మార్కెట్లోకి వచ్చే సమయానికి తుది ధర, రేంజ్, ఫీచర్లు మారే అవకాశం ఉంది.
మినీ SUV తరహాలో డిజైన్.. ఐదుగురికి సీటింగ్
eNEG Mobility రూపొందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ టాక్సీని మినీ SUV తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. పరిమాణం, స్థానాన్ని బట్టి చూస్తే Maruti Suzuki Wagon R & Dzire మధ్య స్థాయిలో ఉండేలా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో డ్రైవర్‌తో కలిపి ఐదుగురు ప్రయాణించేందుకు సీటింగ్ ఏర్పాటు చేయనున్నారు.
టాక్సీ సేవలు, ఫ్లీట్ ఆపరేటర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ వాహనాన్ని తయారు చేస్తున్నారు. అందుకే ధరను అందుబాటులో ఉంచడంతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గించే విధానాలపై కంపెనీ దృష్టి పెట్టింది.
ఇది కూడా చదవండి: Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
బ్యాటరీ, మోటార్ వివరాలు
ఈ ఎలక్ట్రిక్ టాక్సీలో 30-32kWh సామర్థ్యం కలిగిన లిథియమ్ ఐరన్ ఫాస్పేట్ (LFP) బ్యాటరీని ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. దీనికి 67hp శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను జత చేయనున్నారు. ఈ మోటార్ సుమారు 150Nm టార్క్‌ను అందించేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇందులో రియల్-వీల్ డ్రైవ్ (RWD) వ్యవస్థ ఉంటుంది. సింగిల్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించనున్నారు. గరిష్ఠ వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉండేలా అభివృద్ధి చేస్తున్నారు.
ఛార్జింగ్ విషయంలోనూ కంపెనీ ఓ లక్ష్యాన్ని ప్రకటించింది. DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 27 నిమిషాలు పడుతుందని eNEG Mobility చెబుతోంది.
Battery-as-a-Service.. బ్యాటరీ కొనాల్సిన అవసరం లేదా?
ఈ ఎలక్ట్రిక్ టాక్సీలో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్. సాధారణంగా, ఎలక్ట్రిక్ కార్ల ధరలో బ్యాటరీ ఖర్చుదే ప్రధాన పాత్ర. BaaS విధానంలో మాత్రం ఫ్లీట్ ఆపరేటర్లు బ్యాటరీని కొనుగోలు చేయకుండా వాహనాన్ని మాత్రమే కొనుగోలు చేయవచ్చు. కారులో బ్యాటరీ వినియోగానికి ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ వ్యవస్థాపకుడు అక్షయ్ గుప్తా వెల్లడించిన వివరాల ప్రకారం, బ్యాటరీ ఖర్చు కిలోమీటరుకు సుమారు రూ.1 ఉండవచ్చని అంచనా.
ఇది కూడా చదవండి: 2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్ అవుతారు! ఇందులోని రాడార్ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
అంతేకాదు, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధానంలో.. ఛార్జింగ్ స్టేషన్‌కు వెళ్లి, కారులో ఖాళీ అయిన బ్యాటరీని తీసి ఫుల్‌గా ఛార్జ్ చేసిన బ్యాటరీని అమర్చుకోవచ్చు. బ్యాటరీ మార్చే ప్రక్రియను సుమారు ఏడు నిమిషాల్లో పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది విజయవంతమైతే టాక్సీ డ్రైవర్లు ఛార్జింగ్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది.
ఫ్లీట్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేక టెక్నాలజీ
ఈ వాహనంతో పాటు సమగ్ర ఫ్లీట్ మేనేజ్‌మెంట్ ఫ్లాట్‌ఫామ్‌ను కూడా అందించాలని eNEG Mobility యోచిస్తోంది. ఇందులో.. రూట్ మానిటరింగ్, వాహన దొంగతనాలను నిరోధించే సదుపాయాలు, బ్యాటరీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, ముందస్తు నిర్వహణ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ వ్యవస్థలను వాహనం అభివృద్ధి దశలోనే అనుసంధానం చేయాలని కంపెనీ భావిస్తోంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత అదనంగా ఏర్పాటు చేసుకునే పరికరాలుగా కాకుండా, వాహనంలోనే ఈ టెక్నాలజీని అందించాలనేది ప్రణాళిక.
గుజరాత్‌లో తయారీకి సన్నాహాలు
eNEG Mobility తన తయారీ కార్యకలాపాల కోసం గుజరాత్‌లో ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ ప్రధాన కార్యాలయం అహ్మదాబాద్‌లో ఉంది. కొత్తగా పూర్తిస్థాయి చాసిస్‌ను అభివృద్ధి చేయడానికి బదులుగా, ఇప్పటికే ఉన్న వాహన ప్లాట్‌ఫామ్ లేదా Body-in-White సరఫరాదారులతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని చూస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















