రికార్డు సృష్టించిన TVS - వెనుకబడిన Ola.. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ 10 కంపెనీలు ఇవే!
భారత్‌లో జులై 2026లో తొలిసారి నెలలో 2 లక్షలకు పైగా EV స్కూటర్లు అమ్ముడయ్యాయి. TVS అగ్రస్థానంలో నిలవగా, Bajaj, Ather, Vida దూసుకెళ్లాయి. Ola మాత్రం అమ్మకాల్లో వెనుకబడింది.

Electric Scooter Sales July 2026: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. జులై 2026లో, తొలిసారి, ఒకే నెలలో 2 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తం 2,04,266 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో కొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో నమోదైన 1,99,411 యూనిట్ల రికార్డును కూడా ఈసారి అధిగమించింది. పెరుగుతున్న ఇంధన ధరలు, మెరుగైన ఛార్జింగ్ సౌకర్యాలు & కొత్త మోడళ్ల రాకతో వినియోగదారులు EVల వైపు మరింతగా మొగ్గు చూపుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
జనవరి నుంచి జులై వరకు దేశవ్యాప్తంగా 11.7 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 56 శాతం వృద్ధి. ఇక FY27 తొలి నాలుగు నెలల్లోనే 7,29,573 యూనిట్లు అమ్ముడవ్వగా, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 73 శాతం పెరుగుదల.
TVS కొత్త రికార్డ్
జులై 2026 అమ్మకాల జాబితాలో TVS అగ్రస్థానం సాధించింది. గత నెలలో ఈ కంపెనీ 55,477 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి, కంపెనీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 135 శాతం వృద్ధిని సాధించింది. దీంతో కంపెనీ మార్కెట్ వాటా 27 శాతానికి చేరుకుంది. TVSకు చెందిన iQube ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా కొనసాగుతుండగా, Orbiterకు కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది.
రెండో స్థానంలో Bajaj నిలిచింది. కంపెనీ జులైలో 45,592 Chetak స్కూటర్లను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 122 శాతం పెరుగుదల. మార్కెట్ వాటా 22 శాతానికి చేరుకుంది. ఇటీవల విడుదల చేసిన Chetak 2501 మోడల్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని కంపెనీ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
మూడో స్థానంలో Ather ఉంది. జులైలో 30,323 యూనిట్లను విక్రయించి 70 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ తన 450 & Rizta మోడళ్లలో బ్యాటరీ కెమిస్ట్రీని అప్‌డేట్ చేసింది. ప్రస్తుతం Rizta మోడల్ LFP & NMC బ్యాటరీ ఎంపికల్లో అందుబాటులో ఉంది. ఈ నెలాఖరులో కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన మరో స్కూటర్‌ను కూడా విడుదల చేయనుంది.
నాలుగో స్థానాన్ని Vida దక్కించుకుంది. కంపెనీ జులైలో 22,887 స్కూటర్లను విక్రయించి తన అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 111 శాతం పెరుగుదల. కొత్త VX2 Plus 4.4kWh & VX2 Go మోడళ్ల విడుదలతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి.
ఓలా పరిస్థితేంటి?
ఒకప్పుడు మార్కెట్‌ను శాసించిన Ola ఈసారి మాత్రం నిరాశపరిచింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వరుస వృద్ధిని నమోదు చేసిన ఈ కంపెనీ, జులైలో కేవలం 14,105 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. గత ఏడాదితో పోలిస్తే 24 శాతం తగ్గుదల నమోదైంది. మార్కెట్ వాటా కూడా 17 శాతం నుంచి 7 శాతానికి పడిపోయింది. టాప్ 10 కంపెనీల్లో గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గిన ఏకైక కంపెనీ Ola కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
ఇక Greaves Electric Mobility 10,125 యూనిట్లు విక్రయించి 137 శాతం వృద్ధిని నమోదు చేసింది. River Mobility తన Indie స్కూటర్‌తో 5,951 యూనిట్ల అమ్మకాల ద్వారా కొత్త రికార్డు సృష్టించింది. Bgauss Auto 5,518 యూనిట్లు విక్రయించి 213 శాతం వృద్ధిని నమోదు చేయగా, Simple Energy 1,648 యూనిట్లు విక్రయించింది. Lectrix Vehicles 1,397 యూనిట్లతో టాప్ 10 జాబితాను పూర్తి చేసింది.
మొత్తంగా జులై నెలలో టాప్ 10 OEMలు కలిపి దేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలలో 94 శాతం వాటాను దక్కించుకున్నాయి. మిగిలిన సుమారు 180 తయారీ సంస్థలు కలిసి కేవలం 6 శాతం మార్కెట్‌ను మాత్రమే పంచుకున్నాయి. ఈ గణాంకాలు చూస్తే భారత EV మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని & ప్రముఖ బ్రాండ్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోందని స్పష్టమవుతోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















