Car Brands: మన రోడ్లపై కనిపించే కార్ల బ్రాండ్లు ఏ దేశానివి? మారుతి నుంచి బీఎండబ్ల్యూ వరకు పూర్తి వివరాలు
Car Brands In India: భారత్‌లో విక్రయించే ప్రముఖ కార్ల బ్రాండ్లు ఏ దేశానికి చెందినవి? మారుతి, టాటా నుంచి టయోటా, బీఎండబ్ల్యూ వరకు మూలాలు తెలుసుకోండి.

Car Companies In India: భారత్‌లో కార్ల వినియోగం చాలా పెరిగింది. నగరాల్లోనే కాదు.. చిన్న పట్టణాల్లో కూడా ఎన్నో రకాల కార్లు రోడ్లపై కనిపిస్తున్నాయి. మారుతి సుజుకి, టాటా, మహీంద్రా వంటి భారతీయ సంస్థల కార్లతో పాటు హ్యుందాయ్, కియా, టయోటా, హోండా, వోక్స్వ్యాగన్, స్కోడా వంటి విదేశీ బ్రాండ్ల కార్లు మన రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. అయితే.. ఈ కార్ల కంపెనీలు ఏ దేశానికి చెందినవో చాలామందికి తెలియదు. కొన్ని బ్రాండ్లు ఒక దేశంలో పుట్టి, ప్రస్తుతం మరో దేశానికి చెందిన సంస్థల యాజమాన్యంలో ఉన్నాయి. భారత్‌లో తయారవుతున్నాయంటే అవి పూర్తిగా భారతీయ బ్రాండ్లు అని కూడా కాదు. ప్రముఖ కార్ల కంపెనీల పుట్టిన దేశాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ బ్రాండ్లు
Tata Motors: ఈ సంస్థ మన దేశానికి చెందినదే. టాటా గ్రూప్‌లో భాగంగా పనిచేస్తోంది. నెక్సాన్, పంచ్, హారియర్, సఫారీ వంటి కార్లను విక్రయిస్తోంది.
Mahindra: ఇది కూడా పూర్తిగా భారతీయ సంస్థ. SUVలకు ప్రత్యేక గుర్తింపు పొందింది. థార్, స్కార్పియో, XUV700 వంటి మోడళ్లు ఈ కంపెనీకి చెందినవే.
Maruti Suzuki: ఈ బ్రాండ్ విషయంలో కొంత ప్రత్యేకత ఉంది. మారుతి సంస్థను భారత ప్రభుత్వం 1981లో ఏర్పాటు చేసింది. తర్వాత జపాన్‌కు చెందిన సుజుకితో భాగస్వామ్యం ఏర్పడింది. ప్రస్తుతం సుజుకి మోటార్ కార్పొరేషన్‌కు ఇందులో మెజారిటీ వాటా ఉంది. అందుకే దీనిని భారతీయ-జపాన్ భాగస్వామ్య నేపథ్యం ఉన్న సంస్థగా చెప్పవచ్చు.
విదేశీ కార్ల కంపెనీలు
Hyundai, Kia: ఈ రెండు కంపెనీలు దక్షిణ కొరియాకు చెందినవి. హ్యుందాయ్ మోటార్ కంపెనీ, కియా సంస్థలు అక్కడే ప్రారంభమయ్యాయి. క్రెటా, వెన్యూ, సెల్టోస్, సోనెట్ వంటి కార్లతో భారత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.
Toyota, Honda, Nissan, Isuzu: ఈ నాలుగు కంపెనీలు జపాన్‌కు చెందినవి. టయోటా ఇన్నోవా, ఫార్చ్యూనర్, హోండా సిటీ, నిస్సాన్ మాగ్నైట్, ఇసుజు MU-X వంటి మోడళ్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ విషయంలో ఈ తప్పు చేయకండి! 100% ఛార్జింగ్ దేనికి అవసరం? దేనిని 80% దగ్గర ఆపాలి?
Volkswagen, Skoda: వోక్స్వ్యాగన్ జర్మనీకి చెందిన బ్రాండ్. స్కోడా చెక్ రిపబ్లిక్లో పుట్టిన సంస్థ. ఈ రెండు బ్రాండ్లు ప్రస్తుతం జర్మనీకి చెందిన వోక్స్వ్యాగన్ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. భారత్‌లో టైగూన్, విర్టస్, కుషాక్, స్లావియా వంటి కార్లను విక్రయిస్తున్నాయి.
Renault, Citroen: ఈ రెండు కంపెనీలు ఫ్రాన్స్‌కు చెందినవి. రెనాల్ట్ క్విడ్, ట్రైబర్, సిట్రోయెన్ C3 వంటి మోడళ్లను భారత్‌లో విక్రయిస్తున్నాయి.
Jeep: అమెరికాలో పుట్టిన ఈ బ్రాండ్ ప్రస్తుతం అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ స్టెలాంటిస్లో భాగంగా ఉంది. కంపాస్, మెరిడియన్, రాంగ్లర్ వంటి ఎస్‌యూవీలను భారత్‌లో విక్రయిస్తోంది.
MG, BYD: ఎంజీ (మారిస్ గ్యారేజెస్) బ్రాండ్ 1924లో బ్రిటన్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం దాని అంతర్జాతీయ మాతృ సంస్థ చైనాకు చెందిన SAIC. భారత్‌లో JSW గ్రూప్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. BYD కూడా చైనాకు చెందిన సంస్థ. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
లగ్జరీ కార్ల బ్రాండ్లు ఏ దేశానివి?
Mercedes-Benz, BMW, Audi, Porsche.. ఈ నాలుగు బ్రాండ్లు జర్మనీకి చెందినవి. Lexus అనేది జపాన్‌కు చెందిన టయోటా సంస్థకు సంబంధించిన లగ్జరీ కార్ల బ్రాండ్. Volvo స్వీడన్లో పుట్టిన సంస్థ. అయితే ప్రస్తుతం చైనాకు చెందిన గీలీ హోల్డింగ్ యాజమాన్యంలో ఉంది. Mini బ్రాండ్‌కు బ్రిటిష్ నేపథ్యం ఉంది. ప్రస్తుతం ఇది జర్మనీకి చెందిన BMW గ్రూప్‌లో భాగం.
Jaguar, Land Rover బ్రాండ్లు బ్రిటన్‌కు చెందినవే. అయితే 2008 నుంచి ఇవి భారతీయ టాటా మోటార్స్ యాజమాన్యంలో ఉన్నాయి. అంటే బ్రాండ్ పుట్టిన దేశం బ్రిటన్ అయినప్పటికీ, వాటి యజమాని భారతీయ సంస్థ.
ఇది కూడా చదవండి: 3 సెకన్లలో 100km స్పీడ్, 670km రేంజ్, 1156hp పవర్.. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మరో సంచలనం!
ఒక విషయం గుర్తుంచుకోవాలి!
కారు ఏ దేశానికి చెందినదో తెలుసుకోవాలంటే బ్రాండ్ పుట్టిన దేశం, ప్రస్తుత యాజమాన్యం రెండింటినీ వేర్వేరుగా చూడాలి. భారత్‌లో తయారవుతున్న కార్లు అన్నీ భారతీయ బ్రాండ్లవి కావు. విదేశీ కంపెనీలు కూడా మన దేశంలోనే కార్లను తయారు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా వాహనాలను ఎగుమతి చేస్తున్నాయి. కాబట్టి కార్ల మూలాలు తెలుసుకునేటప్పుడు బ్రాండ్ చరిత్రతో పాటు ప్రస్తుత యాజమాన్యాన్ని కూడా పరిశీలించాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















