Automobile Strategy: కొత్త బ్రాండ్ క్రియేట్ చేయాలా? కొత్త షోరూమ్ ఛానల్ సరిపోతుందా? - ఆటోమొబైల్ మార్కెటింగ్‌లో హాట్ టాపిక్
మారుతి నుంచి మహీంద్రా వరకు ప్రతి కంపెనీ ఇప్పుడు కొత్త బ్రాండ్‌లు, కొత్త షోరూమ్ ఛానల్‌ల మధ్య గందరగోళంలో ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించడానికి ఏం చేయాలో అన్వేషిస్తున్నాయి.

Automobile Retail Strategy - Brand vs Channel: ఇప్పటి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చ కొనసాగుతోంది - కొత్త బ్రాండ్ సృష్టించాలా? లేక కొత్త ఛానల్ తెరవాలా?. అంటే, ఒకే కంపెనీకి చెందిన వేర్వేరు మోడళ్లను వేర్వేరు షోరూమ్‌లలో అమ్మాలా, లేక వేరే పేరుతో కొత్త బ్రాండ్‌గా మార్కెట్‌లోకి తీసుకురావాలా అన్నదే ఈ ప్రశ్న.
మారుతి, హీరో, మహీంద్రా, టాటా - ఎవరి స్ట్రాటజీ ఏంటి?
మారుతి సుజుకీకి రెండు వేర్వేరు ఛానల్‌లు ఉన్నాయి – Arena, Nexa. రెండు చోట్లా “Maruti Suzuki” పేరే ఉంటుంది, కానీ కస్టమర్ అనుభవం పూర్తిగా వేరు. MG కూడా ఇలాగే “MG Select” అనే ప్రీమియం ఛానల్ మొదలు పెట్టింది.
Hero మాత్రం ఎలక్ట్రికల్ టూవీలర్ల కోసం కొత్త “Vida” బ్రాండ్‌నే సృష్టించింది. అయితే, కొంతమంది డీలర్ల వద్ద హీరో షోరూమ్‌లలోనే వీటిని అమ్ముతోంది. మహీంద్రా కొత్త BE బ్రాండ్‌ను తీసుకు వచ్చింది, కానీ అదే పాత ఛానల్ ద్వారా అమ్మకాలు కొనసాగిస్తోంది. మరోవైపు టాటా మోటార్స్ “Tata.ev” అనే ప్రత్యేక ఈవీ షోరూమ్‌లు ఏర్పాటు చేసినా, EV కార్లు సాధారణ షోరూమ్‌ల్లో కూడా దొరుకుతున్నాయి.
ఎందుకంత భిన్నత?
కస్టమర్ అనుభవాన్ని “విభిన్నంగా మార్చడమే” చేయడమే దీని ప్రధాన లక్ష్యం. కానీ దీని వెనుక పెట్టుబడి మాత్రం భారీగా ఉంటుంది. ఒక కొత్త ఛానల్ నడపడం, కొత్త బ్రాండ్ పేరును స్థాపించడం అంటే సమయం, మనుషులు, డబ్బు అన్నీ కావాలి.
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, వీటిలో ఏది బెటర్ వర్క్ అవుతుంది? - ఒకే పేరుతో వేర్వేరు అనుభవాలు ఇవ్వడమా? లేక కొత్త బ్రాండ్‌తో కొత్త ఇమేజ్ సృష్టించడమా?. దీనికి సమాధానం కోసం రెండు ప్రశ్నలు వేసుకోవాలి.
1. ప్రొడక్ట్ డీఎన్ఏ కొత్తదా?
మీ కొత్త వాహనం ఇప్పటి మోడళ్లతో పోలిస్తే పూర్తిగా వేర్వేరుగా ఉందా?. అలా అయితే కొత్త బ్రాండ్ సృష్టించడం బెటర్ అంటున్నారు ఆటో ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్. ఉదాహరణకు Citroen కి DS అవసరమయ్యింది, Mahindra కి BE బ్రాండ్ అవసరమైంది. కానీ Tata కి నిజంగా Tata.ev అనే ప్రత్యేక పేరు అవసరమా?.
2. ఎక్స్‌పీరియెన్స్ నిజంగా వేర్వేరుగా ఉందా?
కొత్త కస్టమర్ గ్రూప్ కోసం వేర్వేరు షోరూమ్ అనుభవం అవసరమా? లేక అదే పాత నెట్‌వర్క్‌లో అమ్మవచ్చా?. ఉదాహరణకు.. Grand Vitara ని కొనేవాళ్లు అది Nexa షోరూమ్‌లో ఉన్నందుకే కొనుగోలు చేస్తారా?, లేక అది “Maruti Suzuki” కాబట్టి నమ్మకంతో తీసుకుంటారా?.
ఈ ప్రశ్నలకు ప్రతి మార్కెట్లో, ప్రతి కల్చర్‌లో జవాబులు భిన్నంగా వస్తాయి. కొన్ని చోట్ల కొత్త బ్రాండ్ బాగానే పనిచేస్తుంది, మరికొన్ని చోట్ల పాత పేరు మీద కొత్త అనుభవం ఇవ్వడమే మంచిది. కానీ చివరికి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, “నా కస్టమర్ నన్ను గుర్తుపెట్టుకునేది నా ఛానల్ వల్లనా, నా బ్రాండ్ వల్లనా?” అని మార్కెటర్ కచ్చితంగా ఆలోచించాల్సిందే. ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం అన్వేషిస్తే సరైన మార్గం కనిపిస్తుంది. అప్పుడు, కొత్త బ్రాండ్ క్రియేట్ చేయాలా? కొత్త షోరూమ్ ఛానల్ సరిపోతుందా? అనేది సులభంగా అర్ధమవుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















