Auto Sales in August: భ్రూమ్, భ్రూమ్ - కార్లను ఎగబడి కొంటున్నారు, ఆటో స్టాక్స్‌ను ఆపతరమా?
వాహన రంగంలో మరింత డిమాండ్‌ను, ఆటో ఇండెక్స్ రైజింగ్‌ను ఆటో స్టాక్స్ ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు, బెట్స్ పెంచుతున్నారు.
Auto Sales in August: చిప్‌ల కొరతతో దెబ్బతిన్న గతేడాది ఆగస్టుతో పోలిస్తే, ఈ ఏడాది ఆగస్టులో ఆటో (వాహనాల) సేల్స్ సూపర్‌గా ఉన్నాయి. పండుగ సీజన్ ప్రారంభం కావడం, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడడం, సరఫరా సమస్యలు తగ్గుముఖం పట్టడంతో, ఆగస్టు నెలలో అన్ని విభాగాల్లో వాహనాల అమ్మకాలు పెరిగాయి.
ఆగస్టులో వచ్చిన రక్షా బంధన్, జన్మాష్టమి, హర్తాళికా తీజ్, గణేష్ చతుర్థి వంటి పండుగలు ఆటో సేల్స్‌ను స్పీడ్ ట్రాక్ మీద పెట్టాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో మరిన్ని కీలక పండుగలు ఉన్నాయి. సెప్టెంబర్ ఓనం, నవరాత్రులు ఉన్నాయి. అక్టోబర్‌లో ధన్‌తేరస్, దీపావళి, భాయ్ దూజ్‌ను భారతదేశం జరుపుకుంటుంది. ఈ రెండు నెలలను పండగ సీజన్. వాహన పరిశ్రమ, ఏడాది మొత్తంలో చేసే అమ్మకాల్లో దాదాపు 40% వాటా ఈ పండుగ సీజన్ నుంచే వస్తుంది. కాబట్టి.. వాహన రంగంలో మరింత డిమాండ్‌ను, ఆటో ఇండెక్స్ రైజింగ్‌ను ఆటో స్టాక్స్ ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు, బెట్స్ పెంచుతున్నారు.
వినియోగదారుల్లో ఉత్సాహం పెంచడానికి చాలా OEMలు ఈ సమయంలో కొత్త స్టెప్స్ తీసుకుంటున్నాయి. కొత్త మోడళ్లు, ఫేస్‌లిఫ్ట్‌లు, ఇప్పటికే ఉన్న లైనప్‌కి స్పెషల్ ఎడిషన్లను ప్రారంభిస్తున్నాయి.
ఆగస్టులో, ప్రయాణీకుల వాహనాల సేల్స్ విషయానికి వస్తే...
చాలా ఓఈఎంలు (OEM) గతేడాది ఆగస్టు అమ్మకాల కంటే ఏడాది ఆగస్టు అమ్మకాల్లో (YoY) వృద్ధి సాధించగా, కొన్ని కంపెనీలు మాత్రం సీక్వెన్షియల్ ప్రాతిపదికన (MoM) కొద్దీగా క్షీణతను నివేదించాయి.
కార్ మార్కెట్ లీడర్ మారుతి సుజుకి ఇండియా గత ఏడాది ఇదే కాలం కంటే 30% వృద్ధిని (ఆగస్టు 2022) నమోదు చేసి 1.34 లక్షల యూనిట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే, జులై 2022లోని 1.42 యూనిట్ల కంటే అమ్మకాలు తగ్గాయి.
మినీ (ఆల్టో, ఎస్-ప్రెస్సో), కాంపాక్ట్ (బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వ్యాగన్ఆర్) విభాగాల్లో గతేడాది కంటే ఎక్కువ అమ్మకాలు చేసింది. యుటిలిటీ వాహనాలు (బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్, ఎక్స్‌ఎల్6), ఈకో వాన్ అమ్మకాలు కూడా పెరిగాయి.
హ్యుందాయ్, ఈ ఏడాది జులైలో దేశీయ మార్కెట్లో 50,500 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ ఏడాది ఆగస్టులో అమ్మకాలు 49,510 యూనిట్లుగా ఉన్నాయి.
టాటా మోటార్స్ ఆగస్టు నెలలో 47,166 యూనిట్లను విక్రయాల విక్రయించింది. ఇందులో, 43,321 యూనిట్లు ఐసీఈ (ICE) వాహనాలు, 3,845 యూనిట్లు ఈవీలు. నెలవారీ ప్రాతిపదికన, ఐసీఈ, ఈవీలు రెండింటిలోనూ క్షీణత కనిపించింది. జులైలో, ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో 4,000 మార్కును ఈ కార్ మేకర్ అధిగమించింది.
మహీంద్ర & మహీంద్ర (M&M), కియా ఇండియా కూడా సీక్వెన్షియల్ వృద్ధిని నమోదు చేశాయి.
ఆగస్టులో, SUV విభాగంలో, రికార్డ్ స్థాయిలో 29,516 వాల్యూమ్‌ని మహీంద్ర & మహీంద్ర సాధించింది. గతేడాది ఆగస్టు కంటే ఇది 87% ఎక్కువ.
దేశంలోని టాప్ 5 కార్ల తయారీదారుల్లో చేరిన కియా విషయానికి వస్తే... నెలవారీ విక్రయాలలో 8,652 యూనిట్లతో సెల్టోస్ ముందంజలో ఉంది. సోనెట్ 7,838 యూనిట్లు, కారెన్స్ 5,558 యూనిట్లు, కార్నివాల్ 274 యూనిట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మారుతి సుజుకి, టయోటా తమ కొత్త మోడళ్లు గ్రాండ్ విటారా, హైరైడర్‌ను ఈ పండుగ సీజన్‌లో విడుదల చేయబోతున్నాయి. మహీంద్రా ఇప్పటికే స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్‌ను తీసుకొచ్చింది. కియా, సోనెట్ ఎస్‌యూవీ కొత్త ట్రిమ్‌ను కూడా విడుదల చేసింది. టాటా మోటార్స్, రెనాల్ట్ వంటి ఇతర సంస్థలు మార్కెట్లో ఉత్సాహాన్ని పెంచేందుకు స్పెషల్ ఎడిషన్ మోడళ్లను ప్రవేశపెట్టాయి.
ఈ ఏడాది ప్రారంభం నుంచి వాహన డిమాండ్ అప్‌వార్డ్‌లో ఉంది. పండుగ సీజన్‌లో మరింత బలమైన డిమాండ్ కనిపిస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే భారత ఆటోమోటివ్ మార్కెట్‌లో ప్రస్తుతం మంచి రోజులు కనిపిస్తున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.