Triumph Speed T4 క్లియర్ రివ్యూ: ఈ బండి ఎవరికి బెస్ట్? ఎవరు దూరంగా ఉండాలి?
ట్రయంఫ్ స్పీడ్ T4 భారత మార్కెట్లో అట్ట్రాక్టివ్ ఆప్షన్. పవర్‌ఫుల్ ఇంజిన్, వినసొంపైన ఎగ్జాస్ట్, మంచి మైలేజ్ దీని గుడ్ పాయింట్స్. సస్పెన్షన్, బ్రేకింగ్ ఫీడ్‌బ్యాక్ కొంత నిరాశ కలిగిస్తాయి.

Triumph Speed T4 Review: ట్రయంఫ్ కంపెనీ భారత మార్కెట్లో రిలీజ్ చేసిన Speed T4 బైక్ ప్రస్తుతం యువ రైడర్లకు హాట్ ఫేవరేట్. బ్రిటిష్ బ్రాండ్ నుంచి వచ్చి అందుబాటులో ఉన్న మోడల్‌గా, ఇది, Speed 400 కన్నా కూడా తక్కువ ధరలో లభిస్తోంది. అయితే... ఇందులో చేసిన మార్పులు ఏమిటి? నిజంగా కొనవచ్చా? ఏ పాయింట్ల గురించి కాస్త ఆలోచించాలి? ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం.
Triumph Speed T4 కొనేందుకు 3 ప్రధాన కారణాలు
1) రిలాక్స్‌డ్ & టార్క్ ఎక్కువగా ఇచ్చే ఇంజిన్
స్పీడ్ T4 లో 398cc ఇంజిన్ ఉన్నా, ఇది Speed 400 తో పోల్చితే కొంచెం మైల్డ్ ట్యూన్‌లో ఉంది. అయినా పవర్ తక్కువ కాదు. రైడింగ్‌లో మాత్రం చాలా స్మూత్‌గా, చక్కటి టార్క్‌తో బాగా పుల్లింగ్ ఇస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో, స్టాప్–స్టార్ట్ సిట్యువేషన్లలోనూ రైడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఆరో గేర్‌లో కూడా 60km వేగం వరకూ ఈజీగా లాగేస్తుంది. అంటే రోజూ ఆఫీస్ వెళ్లేవారికి, ఫ్రీగా డ్రైవ్ చేయాలనుకునేవారికి ఇది మంచి ప్లస్ పాయింట్.
2) బేసీ ఎగ్జాస్ట్ సౌండ్ – క్లాసిక్ టచ్
Speed 400 ఎగ్జాస్ట్ కొంచెం షార్ప్‌గా, హై పిచ్‌లో ఉంటే, Speed T4 లో మాత్రం సౌండ్ డీప్‌గా, బేసీగా వినిపిస్తుంది. సైలెంట్‌గా కూడా కాకుండా, అదే సమయంలో ఎక్కువగా గోల చేయకుండా, పక్కగా క్లాసిక్ బైక్ లాంటి థంప్ ఇస్తుంది. ఈ సెగ్మెంట్‌లో ఇది మంచి అడ్వాంటేజ్.
3) మైలేజ్ మెరుగ్గా రావడం
హైవేలో లీటరుకు సుమారు 38km, సిటీలో లీటరుకు 32km వరకు రికార్డ్ అయ్యింది. ఈ సెగ్మెంట్‌లో చాలా రైడర్లకు ఈ ఫ్యుయల్ ఎఫిషియెన్సీ ఒక పెద్ద అంశమే. రోజూ ప్రయాణించే వారికి ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్‌గా మారుతుంది.
Triumph Speed T4 కొనడం అవసరమా అని ఆలోచించాల్సిన 2 కారణాలు
1) పెద్ద గుంతలు, పగిలిన రోడ్లపై రైడ్ క్వాలిటీ కొంచెం వీక్
Speed 400 లో ఉన్న USD ఫోర్క్ బదులుగా, Speed T4 లో సాధారణ టెలిస్కోపిక్ ఫోర్క్ వేశారు. ఇది సిటీ రోడ్లపై రైడ్ బాగానే ఉంటుంది. కానీ.. పెద్ద గుంతలు, పగిలిన రోడ్డు మీద నుంచి వెళ్తే బైక్ కొట్టుకున్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. హెవీ రైడర్లు, పిలియన్ (కో-రైడర్)తో వెళ్లేవారు ప్రీలోడ్ పెంచితే కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది. కానీ పూర్తిగా సాల్వ్ కాదు.
2) బ్రేకింగ్‌లో ఫీడ్‌బ్యాక్ కొరవడటం
Speed T4 లో కాన్వెన్షనల్ ఆక్సిల్ కాలిపర్, ఆర్గానిక్ ప్యాడ్స్ ఉపయోగించారు. స్టాపింగ్ పవర్ Speed 400కి దగ్గరలోనే ఉన్నప్పటికీ, లీవర్ ఫీల్ మాత్రం కాస్త ‘ప్లెయిన్’గా ఉంది. బ్రేకింగ్‌లో ఫస్ట్ బైట్ కూడా కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. హైవే రైడర్లు దీనిని దృష్టిలో పెట్టుకోవాలి.
మొత్తం మీద చూస్తే... ట్రయంఫ్ స్పీడ్ T4 సిటీ రైడింగ్, డైలీ కమ్యూట్, లైట్ హైవే ట్రావెల్ కోసం మంచి ఆప్షన్. టార్క్, మైలేజ్, క్లాసిక్ సౌండ్ ఇవి ఇందులోని పాజిటివ్‌లు. కానీ రఫ్ రోడ్లపై రైడ్ క్వాలిటీ, బ్రేక్ ఫీల్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది.
సిటీలోనే ఎక్కువగా ఉపయోగించడానికి Speed T4 బెస్ట్ పార్ట్‌నర్. హైవేలో ఎక్కువ స్పీడ్ రైడింగ్ చేసేవాళ్లు కొంచం ఆలోచించి కొనండి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.




















