(Source: ECI/ABP News/ABP Majha)
Vibhuvana sankashta chaturthi: మూడేళ్లకోసారి వచ్చే విభువన సంకష్ట చతుర్థి ప్రాధాన్యం, పూజా విధానం మీకు తెలుసా?
Vibhuvana sankashta chaturthi: మూడేళ్లకోసారి వచ్చే విభువన సంకష్ట చతుర్థి గురించి మీకు తెలుసా? ఈ ఆగస్టు 4వ తేదీన వచ్చిన ఈ విభువన సంకష్ట చతుర్థి రోజు వినాయకుడిని ఆరాధిస్తే విశేష ఫలితాలుంటాయి.
Vibhuvana sankashta chaturthi: ప్రతి నెలా రెండు చవితి తిథులు వస్తాయని, ఒకటి కృష్ణ పక్షంలో, మరొకటి శుక్ల పక్షంలో వస్తుందని మనకు తెలుసు. కానీ విభువన సంకష్ట చతుర్థి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇది అధికమాసంలోనే వస్తుంది.
అధిక శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్థి తిథిని విభువన సంకష్టి చతుర్థిగా పేర్కొంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి గణపతిని పూజిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతారు. అంతేకాకుండా వినాయకుడి కరుణతో ప్రజలు ఆనందం, శ్రేయస్సు కూడా పొందుతారని విశ్వసిస్తారు. ఈ వ్రతంలో, రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మాత్రమే ఉపవాసం ముగుస్తుంది. అందువల్ల విభువన సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించడానికి విధివిధానాలను తెలుసుకుందాం.
విభువన సంకష్ట చతుర్థి 2023
అధిక శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి ఆగస్టు 4వ తేదీ, శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటలకు విభువన సంకష్ట చతుర్థి ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 5, శనివారం ఉదయం 09:39 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు ప్రజలు గణపతితో పాటు చంద్రుడిని పూజిస్తారు. కాగా.. చతుర్థి తిథి ఉన్న ఆగస్టు 4న చంద్రోదయం అవుతుంది కాబట్టి విభువన సంకష్ట చతుర్థి ఉపవాసం ఆగస్టు 4వ తేదీన మాత్రమే ఆచరించాలి.
Also Read : వినాయకుడి పూజకు తులసిని వాడకూడదట - ఎందుకో తెలుసా?
విభువన సంకష్ట చతుర్థి 2023 పూజ సమయం
ఆగష్టు 4వ తేదీ విభువన సంకష్ట చతుర్థి నాడు ఉదయం 05.39 నుంచి 07.21 గంటల మధ్య పూజకు అనుకూలమైన సమయం. దీని తరువాత, రెండవ ముహూర్తం ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 03.52 వరకు ఉంది.
విభువన సంకష్ట చతుర్థి 2023 చంద్రోదయ సమయాలు
ఆగస్టు 4వ తేదీ రాత్రి 09:20 గంటలకు చంద్రుడు ఉదయిస్తాడు. ఈ రోజు భక్తులు చంద్రోదయ సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం విరమించాలి.
విభువన సంకష్ట చతుర్థి 2023 పూజా విధానం
విభువన సంకష్ట చతుర్థి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజలో కూర్చోవాలి. పూజ చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉండాలి. గణపతిని పరిశుభ్రమైన పీఠం లేదా వస్త్రంపై ఆశీనుడిని చేయాలి. వినాయకుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు ధూప దీపాలను వెలిగించండి.
"ఓం గణేశాయ నమః లేదా ఓం గం గణపతయే నమః" అనే మంత్రాన్ని జపించండి.
పూజ చేసిన తరువాత, గణేశుడికి లడ్డూలు లేదా నువ్వులతో చేసిన మిఠాయిలను సమర్పించండి. సాయంత్రం వ్రత కథ చదివి చంద్ర దర్శనం చేసుకుని ఉపవాసం విరమించాలి. ఉపవాసం విరమించిన తర్వాత దానాలు చేయండి.
Also Read : మీరు గణపతి భక్తులా - బుధవారం ఉపవాసం చేసే విధానం, విశిష్టత, జపించాల్సిన మంత్రం ఇదే
విభువన సంకష్ట చతుర్థి వ్రతం ప్రాముఖ్యత
గణపతిని శాస్త్రాలలో విఘ్నహర్త అని కూడా అంటారు. ఆయన తన భక్తుల కష్టాలన్నింటినీ తొలగించి వారి కోరికలు తీరుస్తాడని చెబుతారు. అందువల్ల, విభువన సంకష్ట చతుర్థి రోజున ఉపవాసం ఉండి, వినాయకుడిని పూజించడం ద్వారా, జీవితంలో అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయి. ఏకదంతుడు వారిని వివిధ మార్గాల్లో అనుగ్రహిస్తాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.