Ugadi panchangam in telugu 2024 to 2025: ఉగాది తర్వాత ఈ రాశుల ఉద్యోగుల జీవితంలో కొత్త వెలుగులే - ఆ 2 రాశులవారికి మినహా!
Ugadi Panchangam 2024: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏ రాశుల ఉద్యోగుల భవిష్యత్ బావుంటుంది.. ఏ రాశుల ఉద్యోగులకు కష్టాలు ఎదురవుతాయో ఇక్కడ తెలుసుకోండి...
Ugadi panchangam in telugu 2024 to 2025: ప్రతి ఉద్యోగి తాను విధులు నిర్వర్తించే సంస్థలో ఉన్నతిని కోరుకుంటారు. ప్రతి సంవత్సరం తమ ప్రతిభకు తగినంత హైక్ లు, ప్రమోషన్లు ఆశిస్తారు. అయితే ఉన్నతాధికారుల కరుణతో పాటూ గ్రహాల అనుగ్రహం కూడా ఉండాలంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అయితే ఏప్రిల్ 09 నుంచి మొదలయ్యే శ్రీ క్రోధి నామ సంవత్సంలో ఓ మూడు రాశుల ఉద్యోగులకు మినహా మిగిలిన అన్ని రాశుల ఉద్యోగులకు శుభసమయమే.
మేష రాశి ఉద్యోగులకు
మేష రాశి ఉద్యోగులకు ఈ ఏడాది శని అనుకూల ఫలితాలనిస్తున్నాడు. ఉద్యోగాల్లో అనుకున్న ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే అవకాశాలున్నాయి. ఆదాయం ఒక్కసారిగా పెరుగుతుంది.. అదే సమయంలో ఖర్చులు కూడా అలాగే ఉంటాయి.
వృషభ రాశి ఉద్యోగులకు
ఈ రాశి ఉద్యోగులకు కొత్త ఏడాదిలో మిశ్రమ ఫలితాలున్నాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునే ఉద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకోని బదిలీలు తప్పవు. ఉన్నతాధికారుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉద్యోగం మారాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. నిరుద్యోగులు ఉద్యోగాల్లో స్థిరపడతారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది.
Also Read: 60 ఏళ్లకి బ్యాక్ టు చైల్డ్ హుడ్ - తెలుగు సంవత్సరాల నంబర్ వెనుక ఆంతర్యం ఇదా!
మిథున రాశి ఉద్యోగులకు
మిథున రాశి ఉద్యోగులకు ఈ ఏడాది శుభసమయం అనే చెప్పాలి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. నిరుద్యోగులు ఎట్టకేలకు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ప్రభుత్వ ఉద్యోగులకు నచ్చినచోటుకి బదిలీ జరుగుతుంది. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటక రాశి ఉద్యోగులకు
కర్కాటక రాశి ఉద్యోగులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసొచ్చే సమయం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవారు ప్రమోషన్ పొందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు పొందుతారు. ప్రైవేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు శుభసమయం.
సింహ రాశి ఉద్యోగులకు
కొత్త ఏడాదిలో సింహ రాశి ఉద్యోగులకు అంత అనుకూల ఫలితాలు లేవు.గ్రహాలు అనుకూల స్థానంలో లేనందున ఎంత కష్టపడినా అందుకు తగిన ప్రతిఫలం పొందడం కష్టమే. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కష్టాలు తప్పవు. ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఉన్నతాధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు. కాంట్రాక్టు ఉద్యోగులకు కష్టాలే. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది.
Also Read: ఈ ఉగాది నుంచి మొదలయ్యే తెలుగు సంవత్సరం పేరు , అర్థం ఏంటో తెలుసా!
కన్యా రాశి ఉద్యోగులకు
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కన్యారాశి ఉద్యోగులకు సాధారణ ఫలితాలున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారికి అంత అనుకూల ఫలితాలు లేవు. కష్టానికి తగిన ఫలితం పొందలేరు.
తులా రాశి ఉద్యోగులకు
తులా రాశి ఉద్యోగులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం యోగకాలం. గ్రహసంచారం బావుండడం వల్ల ప్రమోషన్ వచ్చే ఛాన్సుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసులలో చిక్కుకున్న ఉద్యోగులకు కాస్త ఉపశమనం ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మంచి ఫలితాలున్నాయి. విదేశాలకు వెళ్లాలి అనుకున్నవారి కల ఫలిస్తుంది.
వృశ్చిక రాశి ఉద్యోగులకు
ఈ రాశి ఉద్యోగులకు క్రోధి నామసంవత్సరంలో గ్రహ సంచారం బావుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్న ప్రాంతానికి బదిలీలు జరుగుతాయి. ప్రైవేట్ సంస్థలలో పనిచేసేవారికి మిశ్రమ ఫలితాలున్నాయి...ఆదాయం మీరు ఊహించిన స్థాయిలో ఉండదు. కాంట్రాక్ట్ ఉద్యోగులుకు పర్మినెంట్ అవుతుంది. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
ధనస్సు రాశి ఉద్యోగులకు
ధనస్సు రాశి ఉద్యోగులు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కష్టాల నుంచి గట్టెక్కుతారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. అయితే పెరిగిన ఆదాయంతో పాటూ ఖర్చులు పోటీ పడతాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.
మకర రాశి ఉద్యోగులకు
ఈ రాశి ఉద్యోగులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆరంభం కన్నా గడిచేకొద్దీ బావుంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకూ ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిందలు పడతారు, బదిలీ అవుతారు. అయితే సెప్టెంబరు నుంచి పరిస్థితుల్లో మార్పులొస్తాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నవారు మంచి జీతంలో వేరే కంపెనీలకు మారుతారు.
కుంభ రాశి ఉద్యోగులకు
ఈ రాశి ఉద్యోగులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆరంభం అదిరింది కానీ ఆ తర్వాత కష్టాలు మొదలవుతాయి. ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకూ అంతా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. సెప్టెంబరు నుంచి మీరు చేయని తప్పులకు శిక్షలు అనుభవించాల్సి రావొచ్చు. ఉద్యోగులకు అత్యంత కష్టకాలం. కుంభ రాశి నిరుద్యోగులకు ఆగష్టులోగా ఉద్యోగం వస్తే వచ్చినట్టు లేదంటే మరో ఆరు నెలలు ఆగక తప్పదు. కాంట్రాక్టు ఉద్యోగులదీ ఇదే పరిస్థితి.
మీన రాశి ఉద్యోగుకు
మీన రాశి ఉద్యోగులకు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో శని బలంతో పాటూ గురుడు వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి వృద్ధి ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతారు..ఆదాయం పెరుగుతుంది.మీ తెలివితేటలు మీకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెడతాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది.
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.