Budh Gochar 2023: రెండు నెలల పాటూ ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం
కర్కాటక రాశిలో సంచరించిన బుధుడు జూలై 25న సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రాశిలో వక్రంలో ప్రయాణించి తిరిగి రాశి మారేందుకు రెండు నెలల సమయం పడుతుంది. ఈ సంచారం 4 రాశులవారికి అదృష్టాన్ని తెస్తోంది..
Budh Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లగ్నం నుంచి మూడు, ఆరు ఇంటికి అధిపతి బుధుడు. తన సొంత రాశులైన మిథునం, కన్యలో సంచరించినప్పుడు బుధుడు శుభఫలితాలనిస్తాడు. అయితే ఏ రాశిలోకి ప్రవేశించినా ఆ ప్రభావం ద్వాదశ రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలు, మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి. జూలై 25న బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆగస్టు 18న అదే రాశిలో తిరోగమనం చెంది సెప్టెంబరు 9నుంచి అదే రాశిలో సంచరించి సెప్టెంబరు 30న కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సింహరాశిలో బుధుడి సంచారం, తిరోగమనం, సంచారం అన్నీ కలుపుకుని దాదాపు 70 రోజుల పాటూ సింహరాశిలోనే ఉంటాడు బుధుడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు విద్య, వ్యాపారం, తెలివితేటలకు కారకుడిగా పరిగణిస్తారు. బుధుడు సింహరాశిలోకి వెళ్లడం వల్ల ముఖ్యంగా 4 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
శ్లో. ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం ।
సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ॥
Also Read: కృష్ణాష్టమి సహా శ్రావణమాసం రెండో పక్షంలో వచ్చే పండుగలివే!
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
సింహరాశిలో బుధుడి సంచారం అంటే మిథున రాశి నుంచి మూడోస్థానంలో సంచరిస్తున్నాడని అర్థం. ఈ సమయంలో ఈ రాశివారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆర్థికంగా ఎదిగేందుకు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. ఇంటికి సంబంధించిన అవసరాలు తీరుస్తారు. మీ తోడబుట్టినవారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి.
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
మీ రాశిలోనే బుధుడి సంచారం వల్ల మీరు తలపెట్టిన పనుల్లో సక్సెస్ అవుతారు. నూతన ప్రణాళికలు వేసుకోవడంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. ఉద్యోగం, వ్యాపార పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు..ఇది మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలి, ఆరోగ్యం జాగ్రత్త.
తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
సింహ రాశిలో బుధుడి సంచారం తులారాశికి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఉద్యోగులేకు పదోన్నతి ఉంటుంది లేదంటే జీతం పెరుగుదలకు సంబంధించిన సమాచారం అందుతుంది. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం.
Also Read: జూలై 20 రాశిఫలాలు, ఈ రాశివారు తడబాటు లేకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతారు
ధనుస్సు రాశి (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
సింహ రాశిలో బుధుడి సంచారం ధనస్సు రాశివారికి అదృష్టాన్ని తెస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా అడుగు ముందుకు పడుతుంది. ఉద్యోగులకు అదృష్టం కలిసొస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారులు మునుపటి కన్నా లాబాలు పొందుతారు. ఇంటా బయటా సంతోషంగా ఉంటారు. అనవసర వివాదాల జోలికి పోవద్దు.
మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
బుధుడు మీన రాశి నుంచి ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ సమయం మీకు కలిసొస్తుంది. ఇప్పటికే వివిధ రకాల తగాదాల్లో , వివాదాల్లో చిక్కుకున్నవారికి ఉపశమనం లభిస్తుంది. వాహనం, ఆస్తులు కొనుగోలు చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఉద్యోగుల కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. అయితే ఆర్థిక పరిస్థితి బావున్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్తపడండి.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial