Gudivada Amarnath : రాష్ట్ర, ప్రభుత్వ భద్రతకు స్పైవేర్‌లు వాడుతున్నాం - వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కీలక ప్రకటన !
రాష్ట్ర, ప్రభుత్వ భద్రత కోసం నిఘా స్పైవేర్‌లు వాడుతున్నామని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. పెగాసస్‌పై దుమారం రేగుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ( YSRCP ) నిఘా సాఫ్ట్‌వేర్‌ను వాడుతోందని ఆ పార్టీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ( Gudivada Amarandh ) మీడియాకు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన నిఘా సాఫ్ట్ వేర్ వాడకం విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భద్రత కోసమే నిఘా సాఫ్ట్‌వేర్‌లను ( surveillance spyware ) వాడుతున్నామని ఆయన తెలిపారు. స్పై వేర్లు వాడడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయన్నారు. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంఘవిద్రోహ శక్తులపై నిఘా వేయడానికి, భద్రతా పరమైన చర్యల కోసం ఫోన్ ట్యాపింగ్ పరికరాలను, కొన్ని సాఫ్ట్‌వేర్లను వాడడం సహజమని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
పెగాసస్‌పై హౌస్ కమిటీ విచారణ ఎలా ? మమతా బెనర్జీ నుంచి వివరాలు తీసుకుంటారా ?
ఇలాంటి వ్యవస్థలను వ్యక్తిగత అంశాలపై నిఘా కోసం ఉపయోగించడాన్ని తాము తప్పుబడుతున్నామని అమర్‌నాథ్ ( Anakapalli MLA ) పేర్కొన్నారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ఉన్న చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి సాఫ్ట్‌వేర్లను ఓ ప్రభుత్వం ఉపయోగిస్తే, ఆ రాష్ట్ర భద్రత కోసమో, ప్రభుత్వ భద్రత కోసమో వాడాలి తప్ప, రాజకీయాల కోసం వాడడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు నాయుడు ( Chandrababu ) తన భార్యతో ఏం మాట్లాడుతున్నారు ? ఆయన కొడుకు, కోడలు ఏం మాట్లాడుకుంటున్నారు? అనే విషయాలపై నిఘా వేసే బుద్ధి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి లేదన్నారు.
ఏపీలో స్మార్ట్ సిటీ చైర్మన్ల వరుస రాజీనామాలు - పదవులు చెల్లవనే వైదొలుగుతున్నారా ?
పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను టీడీపీ హయాంలో కొనలేదు.. వాడలేదని ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ( AB Venkateswar Rao ) ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఇప్పటి ప్రభుత్వం గురించి తెలియదన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇజ్రాయెల్ వెళ్లారని ..అక్కడ నిఘా సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు.ఈ క్రమంలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేనే తమ ప్రభుత్వం నిఘా సాఫ్ట్ వేర్‌లు వాడుతోందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర భద్రత, ప్రభుత్వ భద్రత కోసం నిఘా స్పైవేర్‌లు ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే ప్రకటన రాజకీయంగా కలకలం రేపే అవకాశం కనిపిస్తోంది.