Pegasus Row : పెగాసస్‌పై హౌస్ కమిటీ విచారణ ఎలా ? మమతా బెనర్జీ నుంచి వివరాలు తీసుకుంటారా ?
పెగాసస్‌పై అసెంబ్లీ హౌస్ కమిటీ విచారణ ప్రారంభించడానికి ప్రాథమిక సాక్ష్యాధారంగా మమతా బెనర్జీ చేసినట్లుగా చెబుతున్న ప్రకటన మాత్రమే కనిపిస్తోంది. మరి మమతా బెనర్జీ నుంచి ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ సమాచారం తీసుకుంటుందా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పెగాసస్ స్పైవర్ అంశంపై హౌస్ కమిటీని వేయాలని నిర్ణయించారు. ఏ క్షణమైనా సభ్యుల పేర్లను ప్రకటించనున్నారు. ఆ తర్వాత సభా కమిటీ విచారణ జరుపుతుంది. ఈ కమిటీ విచారణలో పెగాసస్ స్పైవేర్ అంశం తేలుతుందా ? ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు సద్దు మణుగుతాయా ? ప్రభుత్వం అధికారింగా ఎందుకు ప్రకటన చేయడం లేదు ?
"పెగాసస్" అంశంతో రాజకీయ కలకలం !
చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ వాడారని మమతా బెనర్జీ అసెంబ్లీలో చెప్పారని ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటి వీడియో ఎక్కడా లేదు. కానీ ఏపీలో మాత్రం రాజకీయ దుమారం రేగింది. అప్పటి అధికారపక్షంపై ఇప్పటి అధికార పక్షం తీవ్రంగా దాడి చేస్తోంది. ఏకంగా అసెంబ్లీలో చర్చ పెట్టారు. అనేకానేక ఆరోపణల అనంతరం పెగాసస్‌పై హౌస్ కమిటీని వేయాలని తీర్మానించారు. ఏ క్షణమైనా హౌస్ కమిటీని స్పీకర్ ప్రకటించబోతున్నారు. ఆ హౌస్ కమిటీ నిజానిజాలు తేల్చనుంది.
అధికారంగా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ?
ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంటుంది. పెగాసస్ కొన్నారో లేదో చెప్పడం క్షణంలో పని. గత ప్రభుత్వం కొని ఉంటే రికార్డుల్లో ఉంటుంది. బయట పెట్టాలనుకుంటే క్షణంలో బయట పెట్టవచ్చు. కానీ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ గతంలో గౌతం సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు అలాంటిదేమీ కొనలేదని స్పష్టం చేశారు. అయితే డీజీపీ కార్యాలయం కాదని ఇంకెవరైనా కొని ఉండవచ్చని అధికారపక్ష సభ్యులు చెబుతున్నారు. అలా అయినా ప్రభుత్వం వద్ద రికార్డులు ఉంటాయి. పెగాసస్ అనేది ప్రభుత్వాలకు మాత్రమే అమ్మే సాఫ్ట్ వేర్. సాఫ్ట్ వేర్ ఇవ్వడం మాత్రమే కాదు.. స్పైయింగ్ చేసేది కూడా ఆ సంస్థే. దాని నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఇదంతా జరిగితే రికార్డులు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు.
అసెంబ్లీలో ఆధారాల్లేవన్న అధికార పక్ష సభ్యులు !
పెగాసస్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ఉపయోగించిందనేదానికి ఆధారాల్లేవని నేరుగానే చెప్పారు. అనైతికంగా చేశారు కాబట్టి ఆధారాల్లేకుండా చేశారని ఆరోపించారు. అంటే... ప్రభుత్వం వద్ద కూడా పెగాసస్ వాడారనేదానికి ఆధారాల్లేవని అనుకోవాలి. మరిఅప్పుడు సభా కమిటీ ఎలా విచారణ జరుపుతుంది? ఏ ఆధారాలను బట్టి విచారణ ప్రారంభిస్తుంది ? అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది.
మమతా బెనర్జీ నుంచి వివరాలు తీసుకుంటారా ?
మమతా బెనర్జీ చెప్పారంటే చంద్రబాబు పెగాసస్ కొని ఉంటారని అసెంబ్లీలో పెగాసస్‌పై చర్చలో మాట్లాడిన వారంతా మొదటి మాటగా చెప్పారు. అంటే వారందరూ ప్రథమ సాక్ష్యంగా మమతా బెనర్జీ మాటలనే చెప్పారనుకోవాలి. మరి ఇప్పుడు హౌస్ కమిటీ మమతా బెనర్జీ నుంచే ప్రధానంగా ప్రాథమిక వివరాలు సేకరించాల్సి ఉంటుంది. చంద్రబాబు పెగాసస్ కొన్నారని ఎలా తెలుసు ? ఎలా వాడారు ? లాంటి విషయాలను మమతా బెనర్జీ నుంచి తెలుసుకుంటే.. హౌస్ కమిటీ విచారణ సులువు అవుతుంది.అయితే ఇది సాధ్యమా అనే సందేహాలు ఉన్నాయి.
హౌస్ కమిటీ విచారణకు న్యాయపరమైన అడ్డంకులేమీ రావు !
పెగాసస్ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు వేసిన కమిటీ విచారణ జరుపుతోంది. అందుకే గతంలో మమతా బెనర్జీ వేసిన ఓ విచారణ కమిటీని సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. ఏపీ అసెంబ్లీ వేసే హౌస్ కమిటీ న్యాయ పరిధిలోకి రాదు. హౌస్ కమిటీ విచారణ కోర్టులు కూడా నిలుపుదల చేయవన్న అభిప్రాయం వినిపిస్తోంది.