YSRCP Fire On Pawan : పదేళ్లయినా దారి తెలియని పార్టీ జనసేన - వైఎస్ఆర్‌సీపీ నేతల విమర్శలు!
పదేళ్లయినా జనసేన పార్టీకి అడ్రస్ లేదని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. టీడీపీ జెండానే జనసేన అజెండా అన్నారు.
YSRCP Fire On Pawan : మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన సభపై వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేతలు విమర్శలు గుప్పించారు. పవన్ చెప్పినవన్నీ తియ్య తియ్యని అబద్దాలని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుళ్లు ను పక్కనే ఉంచుకుని తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని మండిపడ్డారు.. ఓ నాయకుడు పార్టీ పెట్టి మూసేశాడంటూ సొంత అన్ననే పవన్ హేళన చేశారన్నారు.
పవన్ చిరంజీవిని అవహేళన చేశారు : పేర్ని నాని
డబ్బులు లేవు అంటూనే రోజుకు రెండు కోట్లు నా సంపాదన అని తనే అన్నారని విమర్శించారు. బందర్ లో బీసీ డిక్లరేషన్ అని బీసీలకు మాటిచ్చారని, 48 గంటలు కూడా అవ్వక ముందే బీసీ డిక్లరేషన్ మాట మర్చిపోయారన్నారు. నోరు తెరుస్తే కులం పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు సంకల్పం, చిత్తశుద్ధి, నాయకత్వం ఉంటే తన లాంటి వాళ్లు ఆయన వెనుకే ఉండేవారమని, జగన్ వెంట ఎందుకు వెళ్తామంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సభ అర్థరాత్రి మద్దెల దరువు అంటూ వ్యాఖ్యానించారు. పవన్ దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆపాలన్నారు. ముసుగులు వేసుకుని కాకుండా చెట్టాపట్టాలేసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రండి అంటూ సవాల్ చేశారు. కలిసి వచ్చినా ఓడిస్తామన్నార.ు
పవన్ అసెంబ్లీ చూడాలనుకుంటే రెండు పాస్‌లు ఇస్తాం : అమర్నాథ్
పదేళ్ళ పాటు ఒక అజెండా లేకుండా నడిచిన పార్టీ జనసేన అని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ జనసేన అన్నారు. తమ పార్టీ ఏం చేస్తుందో చెప్పకుండా గంటన్నర పవన్ మాట్లాడారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ బంకర్ టు బందర్ అంటూ మండిపడ్డారు. నెలన్నర రోజుల పాటు బంకర్ లో దాక్కున్నాడని ఆరోపించారు.పవన్ సభకు వచ్చిన కార్యకర్తలు చాలా అమయాకులు అని జెండా పవన్ ది అజెండా చంద్రబాబుదని ఆరోపించారు. పవన్ ప్రసంగం సారాంశం కాపు ఓట్లను చంద్రబాబుకు ఎలా ధారాదత్తం చేయలన్నదే అని చెప్పారు. అసెంబ్లీకి రావాలని ఉంటే ఎన్నికల వరకు ఆగటం ఎందుకు? అప్రశ్నించారు. కావాలంటే స్పీకర్ ని అడిగి రెండు పాస్ లు ఇస్తామని, వచ్చి అసెంబ్లీ చూసి వెళ్ళొచ్చు సెటైర్లు వేశారు.
పవన్ పవర్ స్టారా..? ఫ్లవర్ స్టారా?: కరణం ధర్మశ్రీ
పవన్ పవర్ స్టారా..? ఫ్లవర్ స్టారా అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. నీ మాటలు అన్నీ విడ్డూరంగా ఉన్నాయి. ''కాపు కులం అంతా సీఎం జగన్ వైపే ఉంది. రాజకీయంలో ఓ అజెండా ఉండాలి. జనసేన తొత్తుల పార్టీ'' అంటూ కరణం ధర్మశ్రీ విమర్శించారు.