Amaravati Vs Three Capitals : అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?
రైతుల పాదయాత్రకు కౌంటర్‌గా మూడు రాజధానులపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని వైఎస్ఆర్‌సీపీ నిర్ణయించింది. ఎవరి వాదన ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది ?
Amaravati Vs Three Capitals : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అంతా అమరావతి వర్సెస్ మూడు రాజధానులు అన్నట్లుగా సాగుతోంది. హైకోర్టు తీర్పు ఇచ్చినా సరే మూడు రాజధానులే మా విధానం అంటోంది. అమరావతి రైతులు మాత్రం పోరుబాట పట్టారు. పాదయాత్ర చేస్తున్నారు. అయితే రైతుల వాదన ప్రజల్లోకి బలంగా వెళ్తోందన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో ప్రభుత్వం మూడు రాజధానులు ఎందుకో చెబుతూ ఇప్పుడిప్పుడే కార్యక్రమాలను పెంచుతోంది. జిల్లాల వారీగా మేధావుల సభలు, సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. దీంతో రెండు వర్గాలు పోటాపోటీగా ప్రజలకు తమ వాదన చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రజల మద్దతు కోరుతూ ముందుకు సాగుతున్న అమరావతిరైతులు !
అమరావతి రైతుల పాదయాత్రకు జన స్పందన కనిపిస్తోంది. ఒక్క వైఎస్ఆర్‌సీపీ తప్ప అన్ని పార్టీలు రైతులకు మద్దతుగా నిలిచాయి. అది టీడీపీ యాత్ర అని వైఎస్ఆర్‌సీపీ ఎంతగా ప్రచారం చేస్తున్నా అది పెద్దగా ప్రజల్లోకి వెళ్లడంలేదు. పాదయత్ర ఎక్కువగా గ్రామాల గుండానే వెళ్తోంది. ప్రతీ గ్రామంలోనూ రైతులకు అక్కడి రైతులు ఘనస్వాగతం పలుకుతున్నారు. రైతుల పాదయాత్రకు అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకిస్తోంది. పార్టీలు, ప్రజాసంఘాలు.. ఇలా అన్నీ రాజధానికి మద్దతు ప్రకటించాయి. అందుకే పాదయాత్ర విజయవంతంపై రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోలేదు. అయితే మధ్యలో అడ్డుకుంటారేమోనన్న ఆందోళన మాత్రం వారిలో కనిపిస్తోంది.
రైతులపై రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు
వైఎస్ఆర్‌సీపీ నేతలు కొద్ది రోజులుగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. రాజధాని రైతులు రైతులు కాదంటున్నారు. మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంతంలో రాజధాని వద్దంటారా అని అసెంబ్లీలో కూడా కొంత మంది నేతలు మాట్లాడారు. ఇక కొంత మంది ద్వితీయ శ్రేణి నేతలు అమరావతి రైతుల కాళ్లిరగ్గొడతాం లాంటి ప్రకటనలు చేశారు. ఈ వివాదాస్పద ప్రకటనలు రాను రాను పెరిగిపోతున్నాయి. పాదయాత్రపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో అడుగు పెట్టవద్దని అంటున్నారు. ఇప్పుడు గోదావరి జిల్లాల్లోనే పాదయాత్రను అడ్డుకోవాలన్న ప్రణాళికలు వేస్తున్నట్లుగా ప్రకటనలు ఉంటున్నాయి. నిజానికి పాదయాత్రలో ఎక్కడా స్వల్ప ఉద్రిక్తతలు కూడా ఉండటం లేదు. గుడివాడలో మాత్రం పోలీసులు హడావుడి చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
పాదయాత్రను అడ్డుకుంటే ప్రభుత్వానికే చెడ్డపేరు !
పాలకపార్టీగా ఉండి.. పాదయాత్రను అడ్డుకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. అలాగని విశాఖలో పాదయాత్రత జరిగి అనూహ్యమైన మద్దతు లభిస్తే మూడు రాజధానుల విధానానికి మద్దతు లేకుండా పోతుంది. ఏం జరిగినా హైకోర్టు అనుమతి ఉన్నందున పాదయాత్ర ఆగదు. కానీ చెడ్డపేరు వస్తుంది. అందుకే ఇప్పుడు వ్యూహాత్మకంగా వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానులకు మద్దతుగా పార్టీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహింపచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మూడు రాజధానుల వాదన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సజ్దల ప్రయత్నం !
కారణం ఏదైనా రాష్ట్రంలో అమరావతి అంశం పాజిటివ్‌గా మూడు రాజధానులు నెగెటివ్‌గా ప్రచారంలోకి వెళ్లింది. ప్రజలు కూడా మూడు రాజధానుల అంశంపై క్లారిటీతో లేరు. పాలన వికేంద్రీకరణ వేరు.. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు అన్న దానిపై చర్చ జరుగుతోంది. దీంతో మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను విస్తృతంగా చర్చకు పెట్టాలని వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నిస్తోంది. ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఎవరి వాదన ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే వారికి ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది.